‘మహానటి’కి అభినందనలు

09 August, 2019 - 6:32 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: జాతీయ ఉత్తమ నటి పురస్కారానికి ప్రముఖ నటి కీర్తి సురేశ్‌ ఎంపికైయారు. ఈ నేపథ్యంలో కీర్తి సురేశ్‌కి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. అలాగే జనసేన పార్టీ కార్యకర్తల తరఫున కూడా ఆమెకు పవన్ అభినందనలు తెలియజేశారు. అలనాటి మేటి నటి సావిత్రి జీవిత ఆధారంగా తెరకకెక్కిన మహానటిలో ప్రధాన పాత్ర పోషించిన కీర్తి సురేశ్ .. నటన పురస్కారానికి అర్హమైనదని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

అలాగే మహానటి చిత్రం జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచినందుకు ఆ చిత్ర యూనిట్‌తోపాటు రంగస్థలం, అ!, చి.ల.సౌ. చిత్రాలు సాంకేతిక విభాగాల్లో పురస్కారాలకు ఎంపికైన వారికి కూడా పవన్ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. టాలీవుడ్ చిత్రాలు ఏడు పురస్కారాలను దక్కించుకుందని .. ఇదే స్ఫూర్తితో టాలీవుడ్ నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలని పవన్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ మేరకు జనసేన పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. మహానటి సావిత్రి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మహానటి. ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా నిలవడమే కాదు… ఈ చిత్రంలో సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేశ్ సైతం ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో కీర్తికి పవన్ అభినందించారు. పవన్ కళ్యాణ్ నటించిన 25వ చిత్రం అజ్ఞాతవాసి. ఈ చిత్రంలో  పవన్ సరసన కీర్తి సురేశ్ నటించిన విషయం విదితమే.