జర్నలిస్టు హత్య ఆటవిక చర్య

16 October, 2019 - 6:22 AM

     (న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా తొండంగిలో ఒక పత్రికా విలేఖరిగా పనిచేస్తున్న కాలా సత్యనారాయణను పొడిచి చంపడం క్రూరమైన చర్య అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఖండించారు. విలేఖరి హత్యను ఆటవిక చర్యగా జనసేన పార్టీ భావిస్తోందన్నారు. ఈ సంఘటన జరిగిన తీరును చూస్తే.. మనం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నామా? అని పించక మానదన్నారు. ఈ సంఘటన ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన జర్నలిజాన్ని చంపినట్టు ఉందని జనసేనాని అభివర్ణించారు. ఈ మేరకు జనసేన పార్టీ సామాజిక వేదిక ట్విటర్‌లో ఒక ఖండన ప్రకటనను పవన్ కల్యాణ్ విడుదల చేశారు.

ఇంత భయంకరంగా భయపెడితే తప్ప కలాలకు సంకెళ్ళు వేయలేమనే నిర్ణయానికి వచ్చి విలేఖరి సత్యనారాయణను హతమార్చినట్లు కనిపిస్తోందని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని టి.వెంకటాపురంలో సత్యనారాయణను అతని ఇంటికి కూతవేటు దూరంలోనే నడిరోడ్డుపై హత్య చేశారంటే.. దాని వెనుక పెద్ద కుట్రే దాగి ఉంటుందని అనుమానించక తప్పదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. విలేఖరి సత్యనారాయణపై నెల రోజుల క్రితం ఒకసారి హత్యాయత్నం జరిగి, అది పోలీసుల వరకూ వెళ్ళినా అతనికి రక్షణ కల్పించకపోవడం దారుణం అని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టు సత్యనారాయణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు. ప్రభుత్వం పక్షపాతం చూపకుండా ఈ హత్య వెనుక ఉన్న దోషులను చట్టం ముందు నిలబెట్టి శిక్షించాలని, సత్యనారాయణ కుటుంబానికి చట్టబద్ధమైన పరిహారం ఇవ్వాలని జనసేన చీఫ్ డిమాండ్ చేశారు. సత్యనారాయణ కుటుంబానికి పవన్ కల్యాణ్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.