సై..రా.. పవన్

07 September, 2019 - 8:28 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: పవర్ స్టార్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. 25 సినిమాల్లో నటించారు. కానీ ఏనాడు పవన్.. తాను నటించిన చిత్రాల ప్రమోషన్ కోసం ప్రయత్నించ లేదు. ఈ విషయం ఆయన ఫ్యాన్స్ అందరికీ తెలిసిందే. అంతేకాదు.. ఆయన ప్రచార ఆర్భాటాలకు సైతం దూరంగా ఉంటారు. అయితే మెగాస్టార్ చిరంజీవి తొలి తరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం సైరా. ఈ చిత్రంలో నటించాలన్నది చిరంజీవి బలమైన కోరిక. ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ చిత్ర ప్రమోషన్‌ కోసం పవన్ కళ్యాణ్ నేను సైతం అంటూ కదలడం.. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

అంతేకాదు.. తాను నటించిన చిత్రాలనే ప్రమోషన్ చేసుకునేందుకు ఇష్టపడని పవన్… సైరా విషయంలో ఎందుకు అంత ఆసక్తి కనబరుస్తున్నాడంటూ టాలీవుడ్ జనాలు ఆలోచనలో పడి బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. అయితే పవన్ ..సైరా  చిత్రానికి సై .. సై.. సైరా అంటూ ప్రమోషన్ ఇవ్వడానికి బలమైన కారణం ఉందని… పవన్ మనసెరిగిన వారు పేర్కొంటున్నారు. సైరా చిత్రం దేశభక్తితో  కూడిన చిత్రం. పవన్‌కి దేశభక్తి బాగా ఉందని.. అది ఆయన మాటలు, ప్రసంగాల ద్వారా ఇప్పటికే ప్రపంచంలోని తెలుగు సమాజానికి బహిర్గతమైంది. ఇదే విషయాన్ని పవన్ అంతరంగికులు సైతం స్పష్టం చేస్తున్నారు.

అందుకే ఇప్పటికే సైరా టీజర్‌కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో వాయిస్ ఓవర్ ఇప్పించారు. ఆ మేకింగ్ కూడా విడుదల చేసి.. పవన్ ఫ్యాన్స్ ఆనందాన్ని మరింత పెంచేశారు. అలాగే సైరా సినిమా ఆడియో ఫంక్షన్‌కి కూడా పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారని సమాచారం. దేశభక్తి బలంగా ఉన్న పవన్‌.. సైరా ఆడియో ఫంక్షన్‌కి వస్తే.. అటు మెగా ఫ్యామిలీ ఫ్యాన్సే కాదు.. ఇటు పవర్ స్టార్ ఫ్యాన్స్‌ కూడా ఖూషీ ఖూషీ అవుతారన్న సంగతి అందరికి తెలిసిందే.