పవన్ సూచన

18 March, 2020 - 4:55 PM

(న్యూవేవ్స్ డెస్క్)

కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ప్రజారోగ్యానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ ప్రభుత్వాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ వైరస్ మహమ్మారిలా వ్యాపిస్తున్న కారణంగా.. ప్రభుత్వ విభాగాలు ముందస్తు జాగ్రత్తలు చేపట్టి స్క్రీనింగ్ సెంటర్లు, ఐసోలేషన్ వార్డులు, ల్యాబ్‌లు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. కరోనాను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ఇప్పటికే ప్రకటించిన తర్వాత కూడా తేలిగ్గా తీసుకోవడం సరికాదని ప్రభుత్వానికి పవన్ తెలిపారు. మన రాష్ట్రంలో వైరస్ లేదు.. అయినా వైరస్ వస్తుంది.. పోతుందని భావించే విషయం కాదన్నారు పవన్.

వైరస్ విస్తృతి మొదటి రెండు వారాల తర్వాతే ఉంటుందని ఇతర దేశాల్లో చోటు చేసుకున్న పరిణామాల వల్ల వెల్లడవుతోందన్నారు. రాజకీయ అవసరాల కోసం కరోనా విషయంలో పంతాలు, పట్టింపులకు పోకూడదని.. వాటిని పక్కన పెట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిందని పవన్ గుర్తు చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కేంద్రం చెప్పిన విధంగా వెంటనే అన్ని విద్యా సంస్థలను తాత్కాలికం మూసివేయాలన్నారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంతోపాటు వైద్య బృందాలను నియమించాలన్నారు.

ఈ వైరస్‌పై ప్రజలను అప్రమత్తం చేసేందుకు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంఘాలు తమ వంతు కృషి చేయాలని పవన్ పిలుపు నిచ్చారు. జనసేన తరఫున ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇప్పటికే పార్టీ శ్రేణులకు ప్రణాళిక అందజేశామన్నారు. ప్రజలకు ఈ వైరస్‌పై, దాని విస్తృతిపై ప్రాధమిక అవగాహన కల్పించడంతోపాటు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే వివరాలను జనసేన శ్రేణులకు తెలిపామని పవన్ వెల్లడించారు.