పారదర్శకత చేతల్లో చూపించాలి

22 September, 2019 - 4:39 AM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్ష పేపర్లు ముందే లీకయ్యాయంటూ వస్తున్న వార్తలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం చెబుతున్న పారదర్శకత మాటల్లో కాదని చేతల్లో చూపించాలని వ్యాఖ్యానించారు. పేపర్ లీకేజి ఆరోపణలపై ప్రభుత్వం తక్షణమే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించాలని కోరారు. వ్యవస్థ కారణంగా యువత ఇబ్బందిపడే పరిస్థితి రాకూడదంటూ జనసేన పార్టీ సామాజిక మాధ్యమం ట్విటర్ వేదికగా పవన్ కల్యాణ్ హితవు పలికారు.

జీవితాలు మారతాయన్న కొండంత ఆశతో అభ్యర్థులు పరీక్ష రాశారని, అయితే.. పరిస్థితి చూస్తుంటే అధికార పార్టీకి కొమ్ముకాసే వారికే ఉద్యోగాలు ఇస్తున్నట్టు ఉందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసి 20 లక్షల మంది జీవితాలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆడుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాల పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం జరిగిందని జనసేనాని ఆరోపించారు. గనులైనా.. ఉద్యోగాలైనా కుంభకోణాల్లో జగన్ టీమ్ రాటుదేలిందంటూ పవన్ కల్యాణ్ దెప్పిపొడిచారు.