పార్లమెంటరీ కమిటీ ప్రశ్నలతో ఉర్జిత్ ఉక్కిరిబిక్కిరి

12 June, 2018 - 4:45 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: పార్లమెంటరీ స్థాయీ సంఘం ముందు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ మంగళవారం హాజరయ్యారు. సుమారు మూడున్నర గంటల పాటు స్థాయీ సంఘం సభ్యులు ఆయనను పలు అంశాలపై ప్రశ్నించారు. స్థాయీ సంఘం ప్రశ్నలతో ఉర్జిత్ పటేల్ ఉక్కిరి బిక్కిరైనంత పనైంది. వీరప్ప మొయిలీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సమావేశానికి హాజరైన ఊర్జిత్‌పై నీరవ్ మోదీ స్కామ్ గురించి కమిటీ సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా పాల్గొన్నారు.

2016 నవంబర్‌ 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు ఎంత నగదు తిరిగి వచ్చిందో లెక్కలు చెప్పాలని స్థాయీ సంఘం ఆయనను ఆదేశించింది. దేశాన్ని కుదిపేసిన పీఎన్‌‌బీ కుంభకోణంపైన కూడా ఉర్జిత్‌ను స్థాయీ సంఘం ప్రశ్నించింది. ఇన్నేళ్ల నుంచి కుంభకోణం జరుగుతున్నా ఎందుకు జోక్యం చేసుకోలేదని నిలదీసింది. ఏటీఎంలలో నగదు ఎందుకు సరిగా ఉంచలేకపోతున్నారు? అసలు.. నగదు కొరతకు ఎవరు కారణం? తదితర అనేక ప్రశ్నల్ని ఉర్జిత్‌‌పై కురిపించింది. బ్యాంకుల్లో పేరుకుపోతున్న నిరర్థక ఆస్తుల (నాన్ పెర్ఫామింగ్ అస్సెట్స్)పై కూడా చర్చ జరిగింది.

ఈ సందర్భంగా ఉర్జిత్ పటేల్ బదులిస్తూ.. ఈ ప్రశ్నలన్నింటికీ లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తానని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి స్పష్టంచేశారు. మొండి బకాయిల వసూలు ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. ఇంతకు ముందు మే 17న కూడా స్టాండింగ్ కమిటీ ముందు ఉర్జిత్ పటేల్ హాజరయ్యారు.