ఆ ముగ్గురి వెనుక ఉంది ఒక్కడే…

01 January, 2019 - 8:04 PM

 

పరిటాల రవీంద్ర…. మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డి …. భానుకిరణ్ … ఈ మూడు పేర్లు చూస్తుంటే  ఏం గుర్తుకు వస్తుంది? ఫ్యాక్షనిజం… రాజకీయం… దందాలు.. హత్యారాజకీయాలు… ఇవే స్ఫూరణకు వస్తాయి. కానీ ఇంకా నిగూఢంగా గమనిస్తే… ఈ ముగ్గురి పేర్లు మధ్య సంబంధం చాలా బలంగా ఉంది. వీరి వెనక ఒకే ఒక్కడు ఉన్నాడు. అదే సూర్యుడు. ఇంకా చెప్పాలంటే ప్రపంచానికి వెలుగులు పంచే దైవం ప్రత్యక్ష నారాయణుడు. వీరి పేర్లన్నీ సూర్యుడి పేరుతో ముడిపడి ఉండడమే గమ్మత్తు. రవి, సూరి, భాను..ఈ పేర్లన్నీ సూరీడికి పర్యాయపదాలే.

తొలుత అనంతపురం జిల్లాలో పరిటాల రవి, మద్దెలచెరువు సూర్యనారాయణ కుటుంబాల మధ్య ఫ్యాక్షనిజం పడగ విప్పింది. ఫ్యాక్షనిజం గొడవల్లో ఇరు కుటుంబాలకు చెందిన పలువురు  దారుణంగా హత్యకు గురైయ్యారు. అందుకు ఉదాహరణ సూరి ఇంట్లో టీవీ బాంబు పేలి పలువురు దుర్మరణం పాలయ్యారు. అలాగే రవీంద్ర ఇంట్లో కూడా తండ్రి, సోదరుడు సైతం అత్యంత పాశవికంగా హత్య గావింపబడ్డారు.

అయితే పరిటాల రవీంద్ర … టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్ టీ రామారావు పిలుపు మేరకు సైకిల్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రి పదవిని సైతం అందుకున్నారు. ఆయన ఒక రాజకీయ శక్తిగా ఎదిగారు. ఎంతగా అంటే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిటాల రవి పేరు వింటే ఎవరికైనా ఒకింత అలజడి పుట్టాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో కూడా రవిపై హత్యాయత్నం జరిగింది. కానీ దీని నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. కానీ 2004 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.

ఈ ప్రభుత్వం కొలువు తీరిన ఏడాదిలోపే అంటే 2005, జనవరి 24వ తేదీన సొంత జిల్లా అయిన అనంతపురం నగరంలోని టీడీపీ కార్యాలయం వద్దే పరిటాల రవీంద్ర దారుణ హత్యకు గురయ్యారు. దీనిపై అందరి చూపు జైలులో ఉన్న రవి ప్రధాన ప్రత్యర్థి మద్దెల చెరువు సూరిపై పడింది. కానీ ఈ హత్య నాటీ ఏపీ సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి హస్తం ఉందని ప్రచారం జోరుగా జరిగింది.

కానీ అకస్మాత్తుగా పరిటాల రవి హత్య తానే చేశానంటూ.. జూలకంటి శ్రీనివాస్ రెడ్డి అలియాస్ మొద్దు శ్రీను .. టీవీకి ఇచ్చిన ఇంటర్వ్య్ లో క్లియర్‌గా చెప్పాడు. అంతే అతడి కోసం పోలీసులు జల్లెడ పట్టినా.. అంతు చిక్కలేదు. కానీ హైదరాబాద్ శివారు ప్రాంతం చందానగర్‌లోని సుప్రజ లాడ్జిలో బాంబులు తయారు చేస్తుండగా… పేలుడు సంభవించింది.

ఈ ఘటనలో గాయపడిన వ్యక్తి.. మొద్దు శీను అని  మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ తర్వాత  పరిటాల రవి హత్యపై వైయస్ఆర్ ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపి.. ఈ హత్యలో వైయస్ జగన్‌కి ఎటువంటి ప్రమేయం లేదని క్లీన్ చీట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొద్ది కాలం తర్వాత మొద్దు శీను అనంతపురం జైలులో శిక్ష అనుభవిస్తూ… తొటి ఖైదీ ఓం ప్రకాశ్ చేతిలో దారుణ హత్యకు గురయ్యారు.

ఇక జైలులో మద్దెల చెరువు సూరి ఉండగా… అతడి ప్రధాన అనుచరుడు భానుకిరణ్.. ఏపీ, కర్ణాటకలో సూరి పేరు చెప్పి దందాలు చేసి..వందల కోట్లాది రూపాయిలు దండుకున్నాడని ఆరోపణలు గుప్పుమన్నాయి. అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత సూరికి.. భాను కిరణ్ దందాలు తెలిసాయి. దీంతో సదరు దండుకున్న సొమ్ము అంతా తనకు అప్పగించాలని సూరి… భానుపై సామదానదండోపాయలతో బెదిరించాడు.

కానీ అన్నీ సూరి పేర బదలాయించేస్తే తనకేమీ మిగలదని భావించిన భానుకిరణ్… సూరికి స్పాట్ పెట్టాడు. అంతే 2011, జనవరి మూడు హైదరాబాద్ నడిబొడ్డులో దారుణంగా పాయింట్ బ్లాంక్ పిస్టల్‌తో కాల్చాడు. దీంతో రవి హతమయ్యాడు. ఆ తర్వాత భాను కిరణ్ పరారై.. దాదాపు 14 నెలల తర్వాత పోలీసులకు చిక్కాడు. అదీ నాటకీయ పరిణామాల మధ్య.

తాజాగా భానుకిరణ్‌కు సూరి హత్య కేసులో కోర్టు జీవిత ఖైదు విధించింది. 2011 జనవరి మొదటి వారంలో జరిగిన ఈ హత్యకు 2018, డిసెంబర్ ఆఖరి వారంలో తీర్పు వెలువడం నిజంగా యాదృచ్ఛికమే. కానీ పరిటాల రవీంద్ర అయినా.. మద్దెలచెరువు సూరి అయినా.. భాను కిరణ్ అయినా కత్తి నమ్మిన వాడు కత్తిలా బతకడం కొన్ని రోజుల వరకే. ఆ తర్వాత ఆ కత్తికే బలికాక తప్పదన్నది మాత్రం వాస్తవం. మరి భానుకిరణ్ కూడా .. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సైతం క్షణక్షణం భయంతో గడపడం తప్పదన్నది మాత్రం నిజం.