‘అనవసరంగా మాట్లాడితే అణుదాడి చేస్తాం’

14 January, 2018 - 11:30 AM

(న్యూవేవ్స్ డెస్క్)

ఇస్లామాబాద్: భారత్, పాక్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవల భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్రంగా స్పందించింది. అనవసరమైన ఆరోపణలు చేస్తే అణు దాడి తప్పదని పాక్ హెచ్చరించింది. పాక్ విదేశాంగశాఖ మంత్రి మహమ్మద్ ఆసిఫ్ ఈ మేరకు ట్విట్టర్ వేదికగా భారత్‌పై తీవ్ర ఆరోఫణలు చేశారు. ‘ఇండియన్‌ ఆర్మీ చీప్‌ భాద్యతారాహిత్యంగా మాట్లాడారు. ఇది ముమ్మాటికీ కవ్వింపు చర్యనే. అణుక్షిపణుల దాడికి భారత్‌ మాకు ఆహ్వానం పంపుతున్నట్లుంది. ఒకవేళ వారు యుద్ధానికి కాలుదువ్వితే అందుకు మేం కూడా సిద్ధమే. భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అనుమానాలను త్వరలోనే తీరుస్తాం’  అని ఆసిఫ్ తేల్చి చెప్పారు.

మరోవైపు పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మహమ్మద్ ఫైసల్‌ కూడా భారత ఆర్మీ చీఫ్ రావత్‌ వ్యాఖ్యలను ఖండించారు. ఈ వ్యాఖ్యలను తేలికగా తీసుకోబోమని ఆయన పేర్కొన్నారు. ఇక రావత్‌ దిగజారి మాట్లాడారని నిఘా వ్యవస్థ ఐఎస్‌పీఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ అసిఫ్‌ గుఫర్‌ మండిపడ్డారు.

నిబంధనలకు విరుద్దంగా పాకిస్తాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందని..తాము పాక్ పై అణు యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.