కరెంట్ బిల్లుకు ఠికానా లేదు కానీ..

31 August, 2019 - 9:54 PM

‘ఉట్టికి ఎగరలేనమ్మ.. స్వర్గానికి ఎగురుతుందట’ ఈ సామెత మాదిరిగానే ఉంది మన దాయాది దేశం పాకిస్తాన్ తీరు చూస్తే… భారతదేశంతో చీటికీ మాటికీ కాలు దువ్వడం.. ఆపైన దారుణంగా చిత్తయిపోవడం పక్కదేశం పాకిస్తాన్‌కు షరా మామూలే కదా.. కశ్మీర్ భూభాగం తనదే అంటూ చిత్ర విచిత్రమైన పల్టీలు కొడుతూనే ఉండడం మనకు తెలిసిందే కదా..

ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే.. పాకిస్తాన్ ప్రధాన మంత్రి సచివాలయం కరెంట్ బిల్లు కూడా కట్టలేని దుస్థితిలోకి వెళ్ళిపోయిందట. కరెంట్ బిల్లు కట్టకపోతే ఇమ్రాన్ ఖాన్ సచివాలయానికి విద్యుత్ సరఫరా నిలిపేస్తామంటూ.. ఆ దేశ విద్యుత్ శాఖ ఇటీవల హెచ్చరించడం, ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ (ఐఈఎస్‌సీఓ) నోటీసులు కూడా జారీ చేయడాన్ని చూస్తే.. ఆ దేశ డాబూ దర్పం ఏ మేరకు ఉందో చెప్పకనే చెబుతోంది. అలాంటిది భారతదేశంతో యుద్ధానికి సిద్ధమని, అణు యుద్ధం చేస్తానంటూ మొన్నామధ్య ప్రగల్భాలు పలికిన తీరు చూస్తే.. ఔరా! అనిపించక మానదు. ఐఈఎస్‌సీఓకి కేవలం రూ.41 లక్షల బకాయి కట్టలేని పాకిస్తాన్ వేల కోట్లు ఖర్చు పెట్టి భారత్‌తో తలపడుతుందట.. వినడానికి చాలా చీప్‌గా లేదూ.. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధానిగా ఎన్నికైన తొలి రోజుల్లో తనకు కేటాయించిన ఖరీదైన కార్లను విక్రయించి, ఆ డబ్బును దేశ ఖజానాకు ఇచ్చిన విషయం మనందరికీ గుర్తుండే ఉంటుంది.భారతదేశంలో యుద్ధం చేస్తానని పాకిస్తాన్ చెప్పడానికి కారణం కశ్మీర్‌లో మానవ హక్కుల హననం జరిగిపోతోందట. ఇదీ దాయాది దేశం అభిప్రాయం. ఈ వంకతో కశ్మీర్‌ను కమ్మేయాలన్నది దాని ఉద్దేశం. ఇలాగే.. హెచ్చులు పోయిన పాకిస్తాన్ కొన్నేళ్ల క్రితం కార్గిల్ యుద్ధం చేసింది. భారతదేశం సైనిక, ఆయుధాల శక్తి ముందు ఎదురు నిలవలేక తోక ముడిచింది. ఈ యుద్ధం కారణంగా ఇరు దేశాలూ భారీ మొత్తంలో సైనికుల్ని కోల్పోయాయి. ఆర్థిక, ఆయుధ సంపత్తిని కూడా గణనీయంగా ఖర్చుచేయాల్సి వచ్చింది. భారత్‌ యుద్ధం చేస్తే.. తనకు శృంగభంగం తప్పదని గ్రహించిన పాకిస్తాన్ టెర్రరిస్టు గ్రూపులకు శిక్షణ ఇచ్చి.. దొంగచాటుగా భారత్‌పైకి ఉసిగొల్పుతుండడం తెలిసిందే. అయితే.. కొంత నష్టం జరిగినప్పటికీ ఆ టెర్రరిస్టుల పీచాన్ని మనదేశం ఎప్పటికప్పుడు అణచివేస్తూనే ఉంది.

ఇక తాజాగా.. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేయడంతో పాకిస్తాన్ తరచూ ఏదో ఒక వేదిక మీద తన అక్కసును, ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతూనే ఉంది. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మొదలు సాధారణ మంత్రుల వరకూ యుద్ధ రాగం ఆలపిస్తుండడం గమనార్హం. అక్టోబర్ లేదా నవంబర్‌లో ఇరు దేశాల మధ్య అణుయుద్ధం తథ్యమంటూ పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ బెదరింపులకు దిగడం ఆయన టెంపరితనానికి నిదర్శనం కాక మరేమిటి? కశ్మీర్ అంశాన్ని పరిష్కరించాలంటే అక్కడ ఈ పాటికే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేదని, కానీ అలా చేయలేదని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని, కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ తప్ప మిగతా ముస్లిం సమాజం ఎందుకు నోరు తెరవడం లేదంటూ షేక్ రషీద్ అభాండాలు వేసే తెగింపునకు రావడం వెనుక అసలు రహస్యం ఏమిటనే ప్రశ్న ఉదయించక మానదు. పై పెచ్చు ‘ఇప్పటికీ భారత్‌తో చర్చల గురించి ఆలోచించేవారు తెలివితక్కువ వారే’నట.. మరి అలాంటప్పుడు మొన్నా మధ్య భారత్- పాక్ మధ్య చర్చలు జరపాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాళ్ళను ఇమ్రాన్ ఖాన్ ఎందుకు పట్టుకున్నారో ఈ షేక్ రషీద్‌కు స్పృహ ఉందా? లేదా?

ఇక పాక్ పదే పదే చేస్తున్న మరో పిచ్చి పని గురించి కూడా ఇక్కడ ప్రస్తావించడం అవసరమనుకుంటా. ‘చెరువు మీద అలిగి.. సీటు కడుక్కోవడం మానేశాడట’ చందంగా చీటికి మాటికి తమ గగనతలం మీదుగా భారత విమానాలు తిరగకూడదంటూ ఆంక్షలు పెడుతుండడం మరీ విడ్డూరం కాక మరేమిటి? పాక్ గగనతలం మీదుగా కాకపోతే మార్గంలో భారత్ విమానాలు తిరగగలవనే ఇంగిత జ్ఞానం కూడా ఆ దేశానికి లేకపోవడం గమనార్హం. భారతదేశానికి తన గగనతలం ఒక్కటే దిక్కైనట్లు పాక్ ఇస్తోన్న బిల్డప్ చూస్తుంటే.. తెగ నవ్వాలనిపించక మానదు.

ఇలాంటి పాకిస్తాన్.. తాజాగా కొత్తరాగాన్ని అందుకోవడం విశేషం అనే చెప్పాలి. ఒక పక్కన భారత్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపే ప్రశ్నే లేదంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఘంటాపథంగా చెప్పారు. అవసరమైతే అణుయుద్ధం చేయడానికి కూడా రెడీ అంటూ చెప్పకుండానే చెప్పారు. కానీ.. భారత్‌తో ద్వైపాక్షిక చర్చలకు తాము సిద్ధమని పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖరేషి ప్రకటించడం దేనికి సంకేతం?.. భారత్ చర్చలను తాము ఎప్పుడూ నిషేధించలేమని, ఇరు దేశాల మధ్య సుదీర్ఘ చర్చలు జరగాల్సిన అవసరం ఉందన్నది ఆయన అభిప్రాయమట. ఇక్కడ కూడా ఓ మెలిక పెట్టిన ఖురేషి ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్న కశ్మీర్ నేతలను వదిలేయాలన్నారు. అనంతరమే భారత్, పాకిస్తాన్, కశ్మీరీ ప్రజల మధ్య చర్చలు జరగాలనే అంశాన్ని తెర మీదకు తేవడం గమనార్హం.

ఇలా ఉండగా.. కరెంట్ బిల్లు కూడా కట్టలేని స్థితిలో ఉన్న పాకిస్తాన్.. భారత్‌తో యుద్ధం చేస్తాంటూ ప్రగల్భాలు పలకడమెందుకని నెటిజన్లు సెటైర్లు పేలుస్తుండడం విశేషం. ముందైతే కరెంట్ బిల్లు కట్టండి.. ఆ తర్వాత యుద్ధం సంగతి ఆలోచించవచ్చంటూ హితవు పలుకుతుండడం పాక్ ఆర్థిక దుస్థితికి అద్దం పడుతోందనడంలో సందేహం లేదు.

(డి.వి.రాధాకృష్ణ)
సీనియర్ జర్నలిస్టు
క్లార్క్స్‌బర్గ్ (మేరీల్యాండ్- అమెరికా)