పాక్ మ్యూజియంలో మన అభినందన్

11 November, 2019 - 6:14 AM

(న్యూవేవ్స్ డెస్క్)

కరాచీ: భారత్‌పై విషప్రచారం చేయడంలో ఏ అవకాశాన్నీ వదులుకోని మన దాయాది దేశం పాకిస్తాన్‌ మరో దుశ్చర్యకు పాల్పడింది. కరాచీలోని పాకిస్తాన్‌ వైమానికదళ యుద్ధ మ్యూజియంలో భారత వైమానికదళ వింగ్‌ కమాండర్‌ వర్ధమాన్‌ బొమ్మను ప్రదర్శించింది. వర్ధమాన్‌ చుట్టూ పాక్‌ సైనికులు చుట్టుముట్టి ఉండగా, ఎడమ పక్క ఒక టీ కప్పును కూడా ఉంచింది. ఫిబ్రవరిలో జరిగిన బాలాకోట్‌ వైమానిక దాడుల సమయంలో వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ పాకిస్తాన్‌ యుద్ధ విమానాలను వెంబడించాడు. ఈ ప్రక్రియలో అతను నడుపుతున్న యుద్ధవిమానం పాకిస్తాన్‌ భూభాగంలో కూలిపోయింది.

అభినందన్ సురక్షితంగా బయటపడినప్పటికీ పాక్‌ సైన్యం అతనిని అదుపులోకి తీసుకుంది. రెండు రోజుల అనంతరం అభినందన్‌ను తిరిగి భారత్‌కు అప్పగించింది. ఈ ఘటనపై అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో కూడా పాకిస్తాన్‌ వ్యంగ్య ప్రచారం చేసింది. తాజాగా అభినందన్‌ బొమ్మను మ్యూజియంలో ప్రదర్శించింది. దీనిని పాకిస్తాన్‌ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు అన్వర్‌ లోధీ ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. ‘అభినందన్‌ బొమ్మ చేతిలో ఒక టీ కప్పు ఉంచితే బొమ్మకు మరింత పరిపూర్ణత వచ్చేది’ అని లోధీ వ్యాఖ్యానించారు. అభినందన్‌ పాకిస్తాన్‌ అదుపులో ఉన్నప్పుడు పాక్‌ సైన్యం విడుదల చేసిన ఒక వీడియోలో అభినందన్‌ టీ తాగుతున్నట్టు చూపించడంతో లోధీ ఈ వ్యాఖ్యలు చేశారు.