రాహుల్ బ్యాటింగ్‌కు పాక్ యాంకర్ ఫిదా

09 May, 2018 - 4:57 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ఇస్లామాబాద్: పంజాబ్‌ ఓపెనర్‌ కేఎల్ రాహుల్‌ బ్యాటింగ్ చూసి మురిసిపోయిందీ పాకిస్తన్ స్పోర్ట్స్ యాంకర్. ‘వావ్.. నీ సూపర్బ్ టైమింగ్‌కు ఫిదా అయిపోయానం’టూ ట్వీట్ చేసింది. ఇప్పుడా ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

క్లాసికల్‌ ప్లేయర్‌గా ముద్రపడిన కేఎల్‌ రాహుల్ ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌‌లో మాంచి జోరు మీదున్నాడు. వరుస బౌండరీలు, భారీ సిక్సర్లతో ప్రత్యర్థి బౌలింగ్‌పై విరుచుకుపడుతున్నాడు. వరుస అర్ధశతకాలతో చెలరేగుతూ ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌‌మెన్‌ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

జైపూర్‌ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌‌తో జరిగిన మ్యాచ్‌‌లో రాహుల్ మరో చూడచక్కని ఇన్నింగ్‌ ఆడాడు. ఒకవైపు సహచర బ్యాట్స్‌‌మెన్‌ త్వరత్వరగా ఔటవుతున్నా.. రాహుల్‌ ఏమాత్రం ఒత్తిడికి గురవకుండా తుదికంటూ పోరాడాడు. ఎదుర్కొన్న 70 బంతుల్లో 11 బౌండరీలు, రెండు సిక్సర్లతో 95 పరుగులు సాధించి అజేయంగా నిలిచి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. తన జట్టును గెలిపించలేకపోయినా చక్కని షాట్లతో అలరించాడు.

కాగా.. ఈ నెల 6న ఇండోర్‌ వేదికగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌.. రాజస్థాన్‌ రాయల్స్‌‌తో తలపడింది. ఆ మ్యాచ్‌‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 152 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన పంజాబ్‌ నాలుగో ఓవర్‌‌లోనే విధ్వంసక ఆటగాడు క్రిస్‌ గేల్‌ వికెట్‌ కోల్పోయింది. అయినప్పటికీ రాహుల్‌ (84 నాటౌట్‌; 54 బంతుల్లో 7×4, 3×6) చివరి వరకూ నిలిచి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌‌లో కూడా రాహుల్‌ చక్కని షాట్లతో ఆకట్టుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌ చూసి ముగ్ధురాలైన పాకిస్తాన్‌ యాంకర్‌ జైనబ్‌ అబ్బాస్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. ‘కేఎల్‌ రాహుల్‌ కొట్టిన షాట్లు ఆకట్టుకున్నాయి. సూపర్‌ టైమింగ్‌‌తో అద్భుత ప్రదర్శన చేశావు. ఈ మ్యాచ్‌ చూడటానికి చాలా గొప్పగా అనిపించింది’ అంటూ ట్వీట్‌ చేశారు.
పాకిస్తాన్‌‌కు చెందిన జైనబ్‌ అబ్బాస్‌ స్థానిక న్యూస్‌ చానల్‌‌లో స్పోర్ట్స్‌ యాంకర్‌‌గా పనిచేస్తున్నారు. అంతకు ముందు పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌‌లో కూడా ప్రజెంటర్‌‌గా పనిచేశారు.