జమ్ము కశ్మీర్ భారత్‌దే..: పాక్ మంత్రి!

10 September, 2019 - 10:25 PM

(న్యూవేవ్స్ డెస్క్)

జెనీవా: జమ్మూ కశ్మీర్ గురించి ఏ సందర్భం వచ్చినప్పుడు దాయాది దేశం పాకిస్తాన్ మాట్లాడినా ‘భారత ఆక్రమిత కశ్మీర్’ అంటూ అక్కసు వెళ్లగక్కేది. అయితే.. తొలిసారిగా అంతర్జాతీయ వేదికపై జమ్మూ కశ్మీర్‌ను భారత్‌కు చెందిన రాష్ట్రంగా అని పేర్కొంది. జెనీవాలో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్‌ మండలి సమావేశానికి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని చెప్పే క్రమంలో భారతదేశంలోని రాష్ట్రమైన జమ్మూ కశ్మీర్‌ అంటూ సంబోధించారు. ‘కశ్మీర్‌లో పరిస్థితులను సమీక్షించేందుకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో కమిటీని నియమించాలి. కమిటీ సభ్యులకు మేం పూర్తి మద్దతునిస్తాం. అదే విధంగా కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు ఉన్నాయంటూ భారత్‌ చెప్పడం విడ్డూరంగా ఉంది’ అని ఖురేషి విమర్శలు గుప్పించారు.

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో పాకిస్తాన్  వీలు చిక్కినప్పుడల్లా భారతదేశాన్ని దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టేందుకు దాయాది దేశం చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలమైన వేళ పాక్‌ మరోసారి ఐక్యరాజ్య సమితి ఎదుట కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తేందుకు సిద్ధమైంది. ‘జమ్మూ కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని మిగతా ప్రపంచాన్ని నమ్మించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. అక్కడ ఉద్రిక్తతలు చల్లబడి, సాధారణ జనజీవనం ఉంటే అంతర్జాతీయ మీడియాను ఎందుకు అనుమతించడంలేదు? అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థలను ఎందుకు జమ్మూ కశ్మీర్‌లో అడుగుపెట్టనివ్వడంలేదు? భారత్‌లోని జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో వాస్తవ పరిస్థితిని అంచనా వేయడానికి ఎందుకు ఒప్పుకోవడంలేదు?’ అంటూ పాక్ విదేశాంగ మంత్రి ప్రశ్నించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది.కాగా.. జమ్మూ కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి సదస్సులో పాక్ చేసిన ఆరోపణలకు భారత దీటుగా బదులిచ్చింది. యుఎస్‌హెచ్ఆర్సీలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ ఠాకూర్ సింగ్ మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్ ప్రజల హక్కుల పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి  కార్యక్షేత్రంగా మారిన ఒక దేశం అసత్య ఆరోపణలు చేస్తోందని ఆమె నిప్పులు చెరిగారు. పాక్ ప్రేరేపిత టెర్రరిజం కొన్నేళ్ళుగా కశ్మీర్‌ను ఏ విధంగా విచ్ఛిన్నం చేసిందో ఆమె వివరించారు. తద్వారా దాయాది పాక్ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. అంతర్గత విషయాల్లో మరో దేశం జోక్యాన్ని ఏ దేశమూ అంగీకరించదని, భారత్ అయితే.. అస్సలు అంగీకరించబోదని విజయ ఠాకూర్ సింగ్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ చర్యలన్నీ కుట్రపూరితమే అని, రాజ్యాంగానికి లోబడే జమ్మూ కశ్మీర్ విషయం భారత ప్రభుత్వం వ్యవహరించిందని వివరించారు. సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు, ప్రగతిశీల విధానాలను అవలంబించే దిశగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆమె వెల్లడించారు.

ఇలా ఉండగా.. కశ్మీర్‌ భారత అంతర్గత అంశమని ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్యదేశాలైన రష్యా, యూకే, అమెరికా సహా ఫ్రాన్స్‌ వంటి ఇతర దేశాలు ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి అంతర్జాతీయ సమాజం ముందు భారత్‌ పరువు తీయాలని భావించిన పాక్‌ మంత్రి.. కశ్మీర్‌ భారత రాష్ట్రం అని సంబోధించి నాలుక కరుచుకున్నారు. దీంతో దేశ విభజన నాటి నుంచి ఇప్పటిదాకా దాయాది దేశం వెంట ఈ మాట వినాలని ఎదురు చూస్తున్న వాళ్లకు ఖురేషి మాటలు హాయినిస్తాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తద్వారా కశ్మీర్‌ భారత అంతర్గత అంశమని పాక్‌ కూడా ఒప్పుకున్నదంటూ తమదైన శైలిలో పాక్‌ తీరును ఎండగడుతున్నారు.