వెనక్కి తగ్గిన ‘పద్మావతి’

19 November, 2017 - 4:22 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండటంతో పద్మావతి మూవీ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది  సినిమా యూనిట్. డిసెంబర్ 1 న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే రాణి పద్మిణి చరిత్రను వక్రీకరించారంటూ రాజ్‌పుత్‌లు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటామని ఇప్పటికే వాళ్లు హెచ్చరించారు. డిసెంబర్ 1న భారత్ బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే సినిమాను ఆ రోజు విడుదల చేయకూడదని ఆ మూవీ టీమ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

అయితే తమంతట తాము ఈ నిర్ణయం తీసుకున్నామని సినిమా యూనిట్ వెల్లడించింది. కొత్త రిలీజ్ డేట్‌ను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. సినిమాకు ఇంకా సీబీఎఫ్‌సీ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంది. దీనికోసం పద్మావతి టీమ్ దరఖాస్తు చేసుకున్నా.. అసంతృప్తిగా ఉందంటూ సీబీఎఫ్‌సీ తిరిగి పంపించేసింది.

మరో వైపు సినిమాకు సీబీఎఫ్ సీ సర్టిఫికేట్ ఇవ్వకపోవడంపై బీజేపీ ప్రభుత్వంపై బాలీవుడ్ నటులు మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వాలే పద్మావతి చిత్ర విడుదలలో జాప్యానికి కారణమని నటి, సామాజిక కార్యకర్త షబనా అజ్మీ ఆరోపించారు. పద్మావతి విషయంలో చిత్ర పరిశ్రమ ఏకతాటిపై నిలిచి గోవాలో సోమవారం ప్రారంభమవుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని బహిష్కరించాలని పిలుపు ఇచ్చారు. పద్మావతి మూవీని కొన్ని లాంఛనాలు పూర్తికాలేదనే సాకుతో సీబీఎఫ్‌సీ తిప్పిపంపడాన్ని ఆమె తప్పుపట్టారు. దీనివెనుక గుజరాత్‌ ఎన్నికల్లో ఓట్లు దండుకునే రాజకీయ కుట్ర ఉందన్నారు.

పద్మావతి మూవీలో ఏ వర్గం వారినీ కించపరిచే సన్నివేశాలు లేకుండా మార్పులు చేసేంతవరకూ సినిమా విడుదల చేయరాదని రాజస్ధాన్‌ సీఎం వసుంధరా రాజే కేంద్రమంత్రి సృతి ఇరానీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే..