‘ఆక్సిజన్’ మూవీ రివ్యూ

30 November, 2017 - 1:08 PM

సినిమా : ‘ఆక్సిజన్’
నటీనటులు : గోపిచంద్, రాశీ ఖన్నా, అను ఇమ్మాన్యుయేల్, జగపతిబాబు తదితరులు
దర్శకుడు : ఎంఎం.జ్యోతి కృష్ణ
నిర్మాత : ఎస్.ఐశ్వర్య
సంగీతం : యువన్ శంకర్ రాజా
విడుదల తేది : నవంబర్ 30, 2017.

మాన్లీ హీరో గోపిచంద్ హీరోగా ఎ.ఎం. జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘ఆక్సిజన్’. ఎస్. ఐశ్వర్య నిర్మించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. రాశిఖన్నా, అను ఇమ్మాన్యుల్ హీరోయిన్లుగా నటించారు. కమర్షియల్ ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకొని నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

కథ:
తన కొడుకు, కూతుళ్లు, తమ్ముళ్లందరితో కలిసి వుండే ఓ ఉమ్మడి కుటుంబం పెద్ద రఘుపతి(జగపతి). అతని తమ్ముళ్లు బ్రహ్మాజీ, అభిమన్యు సింగ్, కొడుకు శ్యామ్, కూతురు శృతి (రాశిఖన్నా). శృతి పెళ్లి కోసం అమెరికా అబ్బాయి కృష్ణ(గోపిచంద్)తో పెళ్లి ఫిక్స్ చేస్తాడు రఘుపతి. తన మంచితనం, ధైర్యంతో ఇంట్లో వాళ్లందరికి దగ్గరవుతాడు కృష్ణ. కానీ తనకు తన ఊరిని, ఇంటివాళ్లని వదిలేసి అమెరికాకు వెళ్లడం ఇష్టంలేని శృతి మాత్రం కృష్ణని పెళ్లిచేసుకోవడానికి అయిష్టం చూపుతుంది. ఇదిలా వుంటే రఘుపతి కుటుంబానికి శత్రువు వీరభద్రం(శియాజీ షిండే). రఘుపతి కుటుంబంలోని వ్యక్తులను చంపడానికి పలు సంధర్భాల్లో ఎవరో ప్రయత్నిస్తుంటారు. వీరభద్రం కాకుండా మరెవరూ రఘుపతి కుటుంబ సభ్యులను చంపాలనుకుంటున్నారు అనేది కథాంశం. ఇక్కడ చిన్న ట్విస్ట్ మీకోసం.. రఘుపతి కుటుంబంలోని మనుషులను చంపాలనుకుంటుంది అమెరికా అల్లుడే. అసలు ఎందుకు కృష్ణ వాళ్లను చంపాలనుకున్నాడు? రఘుపతి ఫ్యామిలీకి కృష్ణకి ఏం సంబంధం అనే ఆసక్తికర అంశాలను వెండితెరపై చూస్తేనే బాగుంటుంది.

చాలా రోజుల తర్వాత గోపిచంద్ మరోసారి తనలోని ఎమోషనల్ యాక్ట్‌తో అలరించాడని చెప్పుకోవచ్చు. నటుడిగా యాక్షన్ సీన్లలో అదరగొట్టగా… తనలోని కామెడీని కూడా పండించే ప్రయత్నం చేసాడు. లుక్స్ పరంగా గోపిచంద్‌లో ఎలాంటి మార్పు లేకపోయినా.. క్యారెక్టర్ పరంగా కాస్త జాగ్రత్తలు తీసుకొని చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇందులో మరో ముఖ్య పాత్ర జగపతి బాబు. తన పాత్రలో జగపతి బాగా చేసాడు. జగపతి బాబు, గోపిచంద్‌ల మధ్య వచ్చే సీన్లు బాగున్నాయి. గీత పాత్రలో అను ఇమ్మాన్యుల్ బాగా చేసింది. వెస్ట్రన్ డ్రెస్సుల్లో అలరించడమే కాకుండా.. ఓ పాటలో తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. శృతి పాత్రలో రాశిఖన్నా క్యారెక్టర్ బాగుంది. అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా అందంగా కనిపించింది. శ్యామ్, అభిమన్యు సింగ్, షియాజీ శిండే, చంద్రమోహన్, అశిష్ విధ్యార్థిలు వారి వారి పాత్రల మేరకు బాగా చేసారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, అలీ నవ్వించే ప్రయత్నం చేసారు. ఇక మిగతా నటీనటులు పర్వాలేదనిపించారు. స్పెషల్ సాంగ్‌లో నటించిన సాక్షి చౌదరి పర్వాలేదనిపించింది. కానీ సినిమాలోని మూడు ట్విస్టులు అదిరిపోయాయి.

ఇక సినిమా విషయానికొస్తే… ‘ఆక్సిజన్’ సినిమా ట్రైలర్ చూస్తేనే ఇదొక ఫ్యామిలీ, రివేంజ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ అని అర్థమవుతోంది. తన ఫ్యామిలీకి జరిగిన అన్యాయంపై గోపిచంద్ ఎలాంటి పోరాటం చేసాడు అనేది కథాంశం. ఇలాంటి కాన్సెప్టు కథలతో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. కథనం పరంగా అక్కడక్కడ కాస్త మార్పులు వున్నట్లుగానే అనిపిస్తున్నప్పటికీ… సినిమా చూస్తున్నంతవరకు కూడా పలుచోట్ల పాత సినిమాలు గుర్తుకొస్తూ వుంటాయి. ఇక గోపిచంద్ నటుడిగా ఎదుగుతున్నప్పటికీ.. తను ఎంచుకునే కథల విషయంలో మాత్రం ఎలాంటి కొత్తదనం కనిపించడంలేదు. యాక్షన్ ఓరియెంటెడ్ కథలకే మొగ్గు చూపుతుండటం వల్ల గోపిచంద్ చేసే సినిమాలన్నీ కూడా రొటీన్‌గా అనిపిస్తున్నాయి. ఇక నటీనటుల విషయం కాస్త పక్కన పెడితే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్‌లో కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్ అంశాలు అన్నీ కూడా సరిగ్గానే మెయింటెన్ చేసుకుంటూ వచ్చాడు దర్శకుడు. అక్కడక్కడ ఫ్యామిలీ ఎమోషన్స్ టచ్ చేసినప్పటికీ.. ఎక్కువ శాతం యాక్షన్ అంశాలపైనే దృష్టిపెట్టినట్లుగా అనిపిస్తోంది.

ఇక యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన పాటలు విజువల్స్ పరంగా బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. ఛోటా.కె.నాయుడు, వెట్రీ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. పీటర్ హెయిన్, స్టంట్ సిల్వ అందించిన యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయి. కొన్ని కొన్ని చోట్ల మరీ… యాక్షన్ సీన్స్ బాగా ఎక్కువైపోయినట్లుగా అనిపిస్తుంది. డైలాగ్స్ పర్వాలేదు. కానీ ఎడిటింగ్ విషయంలో మరింత కేర్ తీసుకుని వుంటే బాగుండేది. దర్శకుడు జ్యోతికృష్ణ పాతకథకే కొన్ని అంశాలను జోడించి, చూపించాలని ప్రయత్నించాడు. దర్శకుడిగా జ్యోతికృష్ణ తను అనుకున్న విధంగా చూపించడంలో అక్కడక్కడ కాస్త తడబడినట్లుగా అనిపిస్తోంది. కానీ దర్శకుడిగా మాత్రం జ్యోతికృష్ణ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా.. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ ఇష్టపడే ప్రేక్షకులకు ‘ఆక్సిజన్’ చిత్రం బాగానే అనిపిస్తోంది. కొన్ని కొన్ని యాక్షన్ సీన్లు పక్కనపెడితే.. సినిమా అంతా కూడా బాగుంది.