‘నో ఫ్లై జోన్‌’గా లార్డ్స్ స్టేడియం!

13 July, 2019 - 10:16 PM

(న్యూవేవ్స్ డెస్క్)

లార్డ్స్ (బ్రిటన్): ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా ప్రసిద్ధ లార్డ్స్ మైదానం పరిసరాల్లో కఠినమైన ఆంక్షల్ని బ్రిటన్ ప్రభుత్వం విధించింది. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లోని పలు మ్యాచ్‌లు సందర్భంగా ఆకాశంలో బ్యానర్లు ప్రదర్శిస్తూ స్టేడియంల మీదుగా విమానాలు వెళ్లడం తీవ్ర కలకలాన్నే రేపింది. ఈ నేపథ్యంలో ఆతిథ్య ఇంగ్లండ్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే ఫైనల్‌కు వేదిక అయిన లార్డ్స్ మైదానం మీదుగా ఆదివారం ఎలాంటి విమానాలూ తిరగరాదంటూ యూకే ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు లార్డ్స్ మైదానం గగనతలాన్ని ‘నో ఫ్లై జోన్’గా ప్రకటించారు. లార్డ్స్ మైదానం పైనుంచి చార్టర్డ్ ఫ్లయిట్లు వెళ్లకుండా నిషేధాజ్ఞలు విధించింది.

ప్రపంచకప్ ఫైనల్ 14వ తేదీ ఆదివారం జరగనుంది. దానికి రిజర్వ్ డేగా జూలై 15వ తేదీని నిర్ణయించారు. ఈ రెండు తేదీల్లోనూ లార్డ్స్ మైదానంపై నో ఫ్లై జోన్ ఆదేశాలు అమలులో ఉంటాయి. ప్రపంచకప్‌లో భారత్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు.. ఓ విమానం బ్యానర్ ప్రదర్శిస్తూ స్టేడియం మీదుగా వెళ్లింది. ‘కశ్మీర్‌లో నరమేధం ఆపండి, కశ్మీర్‌కు విముక్తి కలిగించడం’ అనే నినాదం ఆ బ్యానర్‌తో ప్రదర్శించడం కలకలానికి దారితీసింది.

అంతకు ముందు.. పాకిస్తాన్- ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ సందర్భంగా కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఇలాంటి రాజకీయ నేపథ్యం ఉన్న నినాదాలతో క్రికెట్ స్ఫూర్తికి విఘాతం కలుగుతుందని భావించిన ఐసీసీ ఈ విషయంపై యూకే అధికార వర్గాలకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే ఫైనల్ సందర్భంగా లార్డ్స్ పరిసరాల్లో కఠిన ఆంక్షలు విధించారు.

కాగా.. పలు మ్యాచ్‌లకు అడ్డంకిగా మారిన వర్షం ఫైనల్ మ్యాచ్‌కు ఎలాంటి అడ్డంకి కలిగించబోవడం లేదు. లార్డ్స్‌లో ఆదివారం వర్షం కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. ఆదివారం లార్డ్స్‌లో ఉష్ణోగ్రత 21-23 డిగ్రీలు ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.