ఓయూలో రాహుల్‌కు ‘నో’ పర్మిషన్

10 August, 2018 - 4:46 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ అనుమతి నిరాకరించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఓయూలో రాహుల్ సదస్సును అనుమతించలేమని వీసీ తిరస్కరించినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో ఈ నెల 13, 14 తేదీల్లో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ)లో పర్యటిస్తారని, సదస్సు కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నాయని టీ-కాంగ్రెస్ నేతలు చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఓయూలో రాహుల్ సదస్సుకు అనుమతి లభించలేదు. ఇందుకు వర్శిటీ వీసీ నిరాకరించారు. భద్రతా కారణాల రీత్యా ఈ సదస్సు నిర్వహణకు అనుమతి నిరాకరించినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు హైకోర్టును ఆశ్రయించనున్నాయని సమాచారం వస్తోంది. కాగా.. రాహుల్‌ గాంధీని యూనివర్శిటీలోకి అడుగుపెట్టనివ్వబోమని కొన్ని విద్యార్థి సంఘాలు ఇప్పటికే ఆందోళన బాటపట్టాయి. యూనివర్శిటీలో రాహుల్‌ని అడుగుపెట్టనివ్వకుండా చూడాలని కోరుతూ ఇప్పటికే తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి విద్యార్థి సంఘాల నాయకులు వినతిపత్రాలు కూడా సమర్పించడం గమనార్హం.