జీవో 39ని రద్దు చేయాల్సిందే

13 September, 2017 - 3:12 PM


(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్‌: రైతు సమన్వయ సమితులు ఏర్పాటు కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో 39ని రద్దు చేయాలని అఖిలపక్షం నేతలు గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ, న్యూడెమోక్రసీ, తెలంగాణ జేఏసీ నేతలు బుధవారం గవర్నర్‌ను కలిసి జీవో 39 వల్ల జరిగే నష్టాలను వివరించారు. టీఆర్ఎస్ కార్యకర్తల ప్రయోజనం కోసమే ఈ సమితులు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు.

ఈ సందర్భంగా పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ జీవో 39 కేవలం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజకీయ అవసరాలు తీర్చడానికి మాత్రమే ఉపయోగపడుతుందని విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు కానీ, ఇతరాత్ర ఎవరికీ ఉపయోగపడదని చెప్పారు. దీనిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని, ఆయన సానుకూలంగా స్పందించారని భట్టి విక్రమార్క తెలిపారు. జీవో 39 రాజ్యాంగ విరుద్ధమని, రైతుల పేరుతో టీఆర్‌ఎస్ దోపిడీ చేస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ విమర్శించారు. ఈ జీవోను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ల్యాండ్ మాఫియాను పెంచి పోషించేందుకే 39 జీవోను ప్రభుత్వం తీసుకువచ్చిందని రమణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కల్పించిన హక్కులకు, రైతు సమితులు ఏర్పాటు విరుద్ధమని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌ రావు అన్నారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ రైతు సహకారం పేరుతో టీఆర్ఎస్ నేతలు ప్రజల్లో చిచ్చు రేపుతున్నారని విమర్శించారు. జీవో 39 రద్దు చేయాలని విపక్షాలన్నీ గవర్నర్‌ను కోరాయని తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరాం తెలిపారు. త్వరలో అన్ని సంఘాలతో కలిసి హైదరాబాద్‌లో సదస్సు నిర్వహిస్తామని, 15న వ్యవసాయ కమిషనర్‌ కార్యాలయం ఎదుట దీక్ష చేపడతామని ఆయన చెప్పారు. అక్టోబర్ 2న అన్ని గ్రామాల్లో నిరసనలు చేయనున్నట్లు కోదండరాం తెలిపారు.