ఆ ఓటర్లకే ఇకపై సర్కారీ సదుపాయాలు!

24 June, 2017 - 12:27 AM

(న్యూవేవ్స్ వ్యంగ్యవార్తావిభాగం ప్రత్యేక ప్రతినిధి)

ఆంధప్రదేశ్‌లో ఇకపై చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ పథకాలకు సంబంధించి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. తాజా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇకమీదట వీధిదీపాలు, పారిశుద్ద్యం నుంచి  రోడ్ల నిర్మాణం వంటి పనుల వరకు అన్నిటినీ అధికారపార్టీకి ఓటు వేసి గెలిపించిన గ్రామాల్లోనే అమలు చేస్తారు. అలాగే రేషన్ కార్డులు, డ్వాక్రాసంఘాలు, రుణమాఫీ నుంచి మొదలుకొని పెన్షన్ల వరకు ఏ పథకానికైనా దరఖాస్తులు పెట్టుకునేవారు విధిగా అధికారపార్టీకి ఓటు వేసిన వారై ఉండాలి. లేదా వారు కనీసం అధికారపార్టీకి మాత్రమే ఓటు వేస్తామని ప్రమాణ పత్రం ఒకటి జతచేయాల్సి ఉంటుంది.

అధికారపార్టీకి ఓటు వేయనివారు ఏ పథకానికైనా అర్హులెలా అవుతారని ఇటీవల ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు నంద్యాలలో ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దీనిపై ఐటీ మంత్రి నారా లోకేశ్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటైన త్రిసభ్య మంత్రివర్గ ఉపసంఘం ఆగమేఘాలపై కొన్ని సిఫారసులు చేసింది. అధికారపార్టీకి ఓటు వేయనివారి ఓటర్ ఐడీనే రద్దు చేయాలని కూడా ఈ కమిటీ సూచించింది. అలాగే అధికారపార్టీవారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని కూడా ఈ కమిటీ సిఫారసు చేసింది. అయితే ప్రస్తుతానికి ఈ సిఫారసుల్లో కొన్నింటినే పరిగణనలోకి తీసుకున్న టీడీపీ ప్రభుత్వం తొలిదశలో లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి స్పష్టమైన కొన్ని మార్గదర్శక సూత్రాలను నిర్దేశిస్తూ అర్ధరాత్రి ఆర్డినెన్స్ జారీ చేసింది.

మారిన ఈ నిబంధనల ప్రకారం ఇకపై అధికార పార్టీ (టీడీపీ)కి ఓటు వేయనివారు ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోకూడదు. ప్రభుత్వం వేసిన రోడ్లపై నడవ కూడదు. ఆ రోడ్లపై వాహనాలనూ నడపకూడదు. ప్రభుత్వం ఏర్పాటు చేసే వీధి దీపాలను వాడుకోకూడదు. ప్రభుత్వ పారిశుద్ధ్య వ్యవస్థను కూడా ఉపయోగించకూడదు. వారు తమ అవసరాలకు సొంతంగా వేరే ఏర్పాట్లు చేసుకోవాలి. ఒకవేళ ప్రభుత్వం వేసిన రోడ్డును దాటాల్సి వస్తే ఊతకర్రల్లాంటివి ఉపయోగించి అవతలికి అంగవేసి గెంతాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డుపై నడవకూడదు.

కాగా, ప్రభుత్వ సౌకర్యాలను ఉపయోగించుకునేవారు ముందుగా తాము అధికారపార్టీకే ఓటు వేశామనీ, వేస్తామనీ అంగీకరిస్తూ ఆధార్, ఓటర్ ఐడీ నంబర్లతో నోటరీ ప్రమాణపత్రాన్ని సమర్పించి ఆపై అధికారపార్టీ ధ్రువీ కరణ పత్రాన్ని కూడా పొందవలసి ఉంటుంది. వివిధ స్థాయుల్లో ఉండే అధికారపార్టీ ప్రతినిధులు ఆ ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తారు. వాటిని ఎండీవోలు, ఎంఆర్‌ఓలు పరిశీలించి లబ్ధిదారు అర్హత పత్రాన్ని జారీ చేస్తారు. ప్రతి పథకానికీ దరఖాస్తు చేసుకునేప్పుడు ఇకపై ఈ పత్రాన్ని తప్పనిసరిగా జతపరచవలసి ఉంటుంది.

ఈ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రభుత్వ సదుపాయాలను వాడుకుంటే దానిని చట్టప్రకారం నేరపూరితచర్యగా, కుట్రపూరిత చర్యగా పరిగణిస్తారు. వారిపై ప్రభుత్వం కేసులు నమోదు చేస్తుంది. అలాంటివారికి ఐదు వేల రూపాయల జరిమానాతో పాటు గరిష్ఠంగా మూడు నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంటుంది. కొన్ని గ్రామాల్లో ప్రతిపక్షపార్టీలకు ఎక్కువ ఓట్లు వచ్చి గెలిచినప్పటికీ కొందరు అధికార పార్టీ ఓటర్లు కూడా ఉంటారు కనుక అలాంటివారికి ధ్రువీకరణ పత్రాలతో ఆయా ప్రాంతాలలో ప్రభుత్వ సదుపాయాలను ఉపయోగించుకునే వెసులుబాటు కల్పిస్తారు. వారు అన్ని పథకాలకూ అర్హులవుతారు.

ఇదిలావుండగా ఈ నిబంధనలపై పెద్ద దుమారమే రేగుతోంది. టీడీపీ నేతలు కళా వెంకట్రావు, వర్ల రామయ్య, దేవినేని ఉమామహేశ్వర రావు తదితరులు ఈ నిబంధనలను వేరు వేరు మీడియా సమావేశాల్లో గట్టిగా సమర్థించి స్వాగతించారు. అధికారపార్టీకి ఓటు వేయనివారు అసలు ప్రభుత్వం అమలు చేసే పథకాలకు ఎలా దరఖాస్తు చేసుకుంటారని వర్ల రామయ్య విస్మయం వ్యక్తం చేశారు. అది అనైతికమనీ, దుర్మార్గమనీ ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి ఎం వెంకయ్య నాయుడు స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేసి ఈ నిబంధనలను ప్రశంసించా రని కూడా వర్ల చెప్పారు. ఓటు వేయకుండా ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలను వాడేసుకోవడం ”ఫ్యాషన్” అయిపోయిందని వెంకయ్య అన్నట్లు ఆయన తెలిపారు. అధికారపార్టీకి ఓటు వేయనివారికి ఆ పాటి శాస్తి జరగాల్సిందేనన్నారు. ఓటు వేయనివారు కూడా ఓటు వేసినట్లు అబద్ధం చెప్పే అవకాశం ఉంది కాబట్టి కాణీపాకం వినాయకుడిపై ఓటర్లు ప్రమాణం చేసి రాతపూర్వకంగా అధికారపార్టీకి ఆ మేరకు ప్రమాణపత్రం సమర్పించాలని వర్ల సూచించారు.

ఇదిలావుండగా ప్రతిపక్ష నాయకుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ నిబంధనలు అమల్లో ఉండేవి మహా అయితే ఇంకా రెండేళ్లేనన్నారు. తాను సీఎం కాగానే వాటిని రద్దు చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ నిబంధనలపై తాను విజయవాడలో త్వరలోనే మహాధర్నా చేపడతానని ఆయన ప్రకటించారు. మరోవైపు ప్రజాసంఘాలు కూడా ఈ ఆర్డినెన్సును వ్యతిరేకిస్తున్నాయి. హైకోర్టు అమరావతికి వచ్చాక ఈ ఆర్డినెన్సును ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేస్తామని ఆంధ్ర మేధావుల వేదిక అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ న్యూవేవ్స్ వ్యంగ్యవార్తావిభాగం ప్రతినిధికి తెలిపారు.