ఉల్లి కోసం ఆసియా దేశాలు విలవిల

03 December, 2017 - 8:51 AM


(న్యూవేవ్స్ డెస్క్)

ముంబై/ఢాకా: ఉల్లి కటకట కేవలం భారత్‌కే కాదు, మిగిలిన ఆసియా దేశాలనూ తాకింది. ఉల్లి అతి పెద్ద ఉత్పత్తిదారైన భారతదేశంలో ఎగుమతులపై పరిమితి విధించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో సరుకుకు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ ప్రభావం బంగ్లాదేశ్‌, మలేసియా దేశాలపై తీవ్రంగా పడింది. ఆసియా దేశాలైన బంగ్లాదేశ్‌, మలేసియా ఉల్లికోసం కటకటలాడుతున్నాయి.

బంగ్లాదేశ్‌‌లో కిలో ఉల్లి ధర ఈ వారంలో రూ.106కు చేరి ఆల్‌టైం రికార్డు సృష్టించింది. భారత్‌లో కొత్త పంట మార్కెట్‌లోకి వస్తే గానీ ధరలు అదుపులోకి వచ్చే అవకాశం లేదు. గత కొద్ది నెలల వ్యవధిలోనే ఉల్లిపాయల ధర దాదాపు ఐదు రెట్లు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.45 వేలు పలుకుతుంటే, భారత్‌ ఎగుమతులకు రూ.54 వేలను కనీస ధరగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఎగుమతులు మందగించాయని ముంబై వ్యాపారులు చెబుతున్నారు.

గత జూలైలో భారత్‌ నుంచి ఉల్లి ఎగుమతుల ధర రూ.11 వేలు మాత్రమే కావడం గమనార్హం. ఎగుమతులను నియంత్రించినా దేశీయంగా ఉల్లి ధర అదుపులో లేదు. ఇక్కడి రిటైల్‌ మార్కెట్‌లోనూ ఉల్లి ధర వినియోగదారుడికి చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా కేజీ రూ.60 చొప్పున విక్రయిస్తున్నారు. గత వారం దేశ రాజధాని ఢిల్లీలో ఏకంగా రూ.80 పలికింది. ఇతర మెట్రో నగరాల్లోనూ కేజీకి రూ.50 నుంచి రూ.70 వరకూ ధర పలుకుతోంది. ఉల్లిని ఎక్కువగా పండించే రాష్ట్రాల నుంచి సరఫరా తగ్గడం వల్లే ధరలు పెరిగాయని వ్యాపారులు పేర్కొంటున్నారు.

పాకిస్థాన్‌ ఉల్లి ఎగుమతులకు అవసరమైన అనుమతులు ఇవ్వకుండా పరోక్షంగా ఎగుమతులపై నిషేధం పెట్టింది. దాంతో అక్కడి నుంచీ సరఫరా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఉల్లిపాయలు వచ్చేలోపు ఉల్లి ధర రూ.100 వరకు చేసుకుంటుందని భావిస్తున్నారు. రాబోయే రెండు నెలల్లో ఉల్లిపై భారత్‌ పరిమితులు ఎత్తివేస్తుందని, తద్వారా అటు ధరతో పాటు, కొరత తగ్గుముఖం పట్టొచ్చని ఉల్లి వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.

ఉల్లికి భారత్‌తో పాటు ఇతర ఆసియా దేశాల్లో విపరీతమైన గిరాకీ ఉంది. ముఖ్యంగా పాకిస్థాన్‌, మలేసియా, బంగ్లాదేశ్‌లో వీటి వినియోగం ఎక్కువ. గతేడాది విపరీతంగా ఉల్లిని పండించి నష్టపోయిన భారత్‌, పాక్‌ రైతులు ఈ సారి సాగు విస్తీర్ణం తగ్గించారు. ఫలితంగా ఉల్లి కొరత ఏర్పడింది. దీంతో భారత్‌ ఎగుమతులపై పరిమితి విధించింది. ఈ ఏడాది చివరి వరకు టన్ను ఉల్లి ధరను 850 డాలర్లుగా నిర్ణయించింది. దీంతో కొద్దిమంది మాత్రమే ఆ ధరను చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో చాలా వరకు ఎగుమతులు తగ్గుముఖం పట్టాయని ముంబైకి చెందిన ఎగుమతుల వ్యాపారి ఒకరు తెలిపారు. గతంతో పోలిస్తే ఈ ధర 7 రెట్లు అధికం.

ఉల్లి భారత్‌ నుంచి బంగ్లాదేశ్‌, మలేసియా, యూఏఈకి ఎగుమతి అవుతుంటాయి. భారత్‌ సహా పాకిస్థాన్‌, చైనా, ఈజిప్టు ఉల్లిని ఎగుమతి చేస్తుంటాయి. భారత్‌లో ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో ఆసియా దేశాల్లో ధరలు ఆకాశాన్ని తాకాయి. ఒకసారి భారత్‌లో పంట చేతికొచ్చాక ధర తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఢాకాకు చెందిన వ్యాపారులు భావిస్తున్నారు. దేశంలో ముఖ్యంగా మూడు సీజన్లలో ఉల్లిని సాగు చేస్తుంటారు. వేసవి చివర్లో సాగు చేసే ఉల్లి డిసెంబర్‌లో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని, అప్పుడు ధరలు దిగొస్తాయని భారత్‌కు చెందిన జాతీయ హార్టీకల్చర్‌ రీసెర్చ్‌, డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ పీకే గుప్తా తెలిపారు. అయితే, పంట మార్కెట్‌లోకి వచ్చినా మిగులు కొంతమాత్రమే ఉండే అవకాశం ఉందని, తొలుత దేశంలో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టిన తర్వాతే ఎగుమతుల గురించి ఆలోచించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.