ఉరకలెత్తుతున్న కృష్ణా గోదావరులు

11 September, 2019 - 6:51 AM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీటితో కృష్ణా గోదావరి నదులు ఉరకలెత్తి ప్రవహిస్తున్నాయి. దీంతో జలాశయాల స్థాయిని మించి వస్తున్న వరద నీటిని అధికారులు ఎక్కడికక్కడ గేట్లు ఎత్తివేస్తుండడంతో సాగరం వైపు పరుగులు తీస్తున్నాయి. మంగళవారం జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,90,452 క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. దీంతో శ్రీశైలం జలాశయంలోని ఆరు గేట్లను పైకెత్తి 4,24,530 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. పెద్ద ఎత్తున వరదనీరు వచ్చి చేరడంతో శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపించింది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.80 అడుగులకు చేరుకుంది. దీంతో ఒక దశలో క్రస్టు గేట్లపై నుంచి వరదనీరు దిగువకు దూకింది. గేట్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా శ్రీశైలం నుంచి 3.91 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది.

శ్రీశైలం దిగువన వఉన్న నాగార్జునసాగర్‌లోకి 4,13,198 క్యూసెక్కులు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు సాగర్ డ్యాంలోని 24 గేట్లను ఎత్తి అంతే స్థాయిలో వరదను దిగువకు విడుదల చేస్తున్నట్లు సాగర్ డ్యాం ఇన్‌చార్జి ఎస్ఈ ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. సాగర్‌ నుంచి మంగళవారం సాయంత్రానికి విడుదల చేసిన జలాల్లో దాని దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు 3,90,452 క్యూసెక్కులు చేరుతున్నాయి. పులిచింతల ప్రాజెక్టులో 3,83,002 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం 42.72 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు డీఈ తెలిపారు. పులిచింతల నుంచి భారీ ఎత్తున వరదను దిగువకు విడుదల చేస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద గంటగంటకూ వరద భారీ ఎత్తున పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజీలోకి 1,79,124 క్యూసెక్కులు వస్తుండగా 50 గేట్లు తెరిచి 93,173 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. విజయవాడ పక్కనే ఉన్న ప్రకాశం బ్యారేజీలోకి బుధవారానికి 3.50 లక్షల క్యూసెక్కుల వరద పెరిగే అవకాశం ఉంది. కాగా.. ఒక నీటి సంవత్సరం (జూన్‌ 1 నుంచి మే 31 వరకూ) కృష్ణా బేసిన్‌లో అన్ని ప్రాజెక్టుల గేట్లను రెండు పర్యాయాలు తెరిచి వరద నీటిని దిగువకు విడుదల చేయడం గత పదేళ్లలో ఇదే తొలిసారి.ఇప్పటి వరకూ గట్లు తెంచుకుని ప్రవహించిన గోదావరి నది కొద్దిగా శాంతించింది. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరిలో వరద ఉధృతి కాస్ట తగ్గింది. మూడు రోజులుగా మహోగ్రంగా ప్రవహించిన గోదావరి మంగళవారం సాయంత్రానికి కాస్త శాంతించింది. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని ఎగువున ఉన్న ఏజెన్సీ ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే.. ధవళేశ్వరం దిగువన ఉన్న కోనసీమ ప్రాంతంలో లంక గ్రామాలు ఇంకా వరదనీటి ముంపులోనే చిక్కుని ఉన్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి మంగళవారం మధ్యాహ్నం 14,59,000 క్యూసెక్కుల వరద నీటిని విడిచిపెట్టారు. రాత్రికి దాన్ని 11,39,000 క్యూసెక్కులకు తగ్గించారు. ఇక భద్రాచలం వద్ద మంగళవారం సాయంత్రానికి నీటిమట్టం మూడు అడుగుల మేర తగ్గింది. దేవీపట్నం మండలాన్ని ఇంకా వరదనీరు వణికిస్తూనే ఉంది. కోనసీమలో మంగళవారం రాత్రికి దాదాపు 48 లంక గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. 17 లంక గ్రామాలకు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. చింతూరు మండలంలో 15 గ్రామాల్లో వరద నీరు ప్రభావంతో ఆంధ్రా, ఒడిశా మధ్య రాకపోకలు పూర్తిగా పునరుద్ధరణ కాలేదు. కోనసీమలో బుధవారం నుంచి వరద తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మరో మూడు రోజుల్లో సాధారణ పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది.

ఇక శ్రీకాకుళం జిల్లాలో ప్రవహించే వంశధార నదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. గొట్టా బ్యారేజీలోకి 27,832 క్యూసెక్కులు చేరుతుండగా కాలువలకు 3,925 క్యూసెక్కులు విడుదల చేసి మిగులుగా ఉన్న 23,907 క్యూసెక్కులను గొట్టా బ్యారేజీ 22 గేట్లు తెరిచి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. తోటపల్లి ప్రాజెక్టులోకి నాగావళి వరద ప్రవాహం కొనసాగుతోంది.