ఎస్.నిహాల్ సింగ్… టి.వి.ఆర్. షెనాయ్

24 April, 2018 - 3:06 PM

మీడియా పల్స్

ఉన్న పళంగా చూడగానే అరపేజీ వ్యాసం ఒక్క దూటున- అలాగే చదివేశాను. ఇలాంటి సందర్భాలు ఎపుడో కానీ సంభవించవు. ఆ వార్తాంశానికీ, ఆ చదువరికీ ఉండే అనుబంధాన్ని బట్టి ఇది ఉంటుంది!

ఆదివారం ఉదయం వాలిన అరడజను పేపర్లలో తొలి పత్రికను తిరగేశాను. అది హన్స్ ఇండియా.. నిహాల్ సింగ్ (S.Nihal singh) ఫోటో.. వ్యాసం రాసింది సయీద్ నక్వీ- ‘వన్ ఆఫ్ ఫైనెస్ట్ జంటిల్‌మెన్ ఎడిటర్స్’ అంటూ. మూడు వాక్యాలు చదవక ముందే నిహాల్ సింగ్ గతించారని బోధపడింది. ఇదేమిటి- ఇంత పెద్ద ఎడిటర్ కనుమూస్తే నాకు తెలియకపోవడం ఏమిటనే సిగ్గుతో వారి వ్యక్తిత్వాన్ని ఉగ్గడించే వ్యాసం చదివేశాను. అపుడు గుర్తొచ్చింది నాలుగు రోజుల క్రితం ఒక తెలుగు పత్రికలో T.V.R. SHENOY గతించారని ప్రచురించిన వార్త. ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉండిపోయిన రావల్పిండిలో 1929లో నిహాల్ సింగ్ జన్మించగా టి.వి.ఆర్. షెనాయ్ 1941లో కేరళ ప్రాంతపు ఎర్నాకుళంలో పుట్టారు. నిహాల్ సింగ్ ఏప్రిల్ 16 ఉదయం ఢిల్లీలోనూ; టివిఆర్ షెనాయ్ ఏప్రిల్ 17 సాయంకాలం మంగుళూరులో మరణించారు.

నిహాల్ సింగ్ గారు ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఇండియా పోస్ట్ పత్రిక ఎడిటరుగానే కాదు ఎమర్జెన్సీలో గట్టిగా ఎదురొడ్డి నిలబడ్డ స్టేట్స్‌మన్ పత్రిక సంపాదకులుగా చిరకాలం గుర్తుండిపోతారు. చివరి దశలో ‘ఏసియన్ ఏజ్’, ‘ది ట్రిబ్యూన్’లో కాలమ్స్ రాసేవారు నిహాల్ సింగ్. ఇప్పటి దక్షిణాది పాఠకులకు వారి దక్కన్ క్రానికల్ కాలమ్ బాగా గుర్తుండే అవకాశం ఉంది. షెనాయ్ గారు ‘ది వీక్’ ఆంగ్ల వార పత్రికలో రాసే చివరి పేజీ కాలమ్ ‘ది లాస్ట్ వర్డ్’ ఎంతోమందికి గుర్తుండే వీలుంది. ఐదారేళ్ళ క్రితం కొన్న నిహాల్ సింగ్ స్వీయ చరిత్ర Ink in my veins ఇంకా చదవకుండా నిట్టూర్పు విడిచే నా పుస్తకాల అల్మారాలో అట్లే ఉంది.ఇద్దరు సంపాదకుల గురించి తెలుసుకుందామని నెట్‌లో వెతికితే కుమీ కపూర్ రాసిన వ్యాసం నిహాల్ గురించి చాలా విషయాలు తెలిపింది. సిక్కు కుటుంబంలో జన్మించిన నిహాల్ జుట్టు కత్తిరించుకోవాలని బొంబాయికి చెప్పకుండా వెళ్ళి యువకుడిగా తల్లిదండ్రులను హడలెత్తించారు. అంతే కాదు తర్వాత ఒక విదేశీ వనితను వివాహమాడి మరింత ఆశ్చర్యం కల్గించారు. 1982 మీనాక్షిపురం ప్రాంతంలో జరిగిన మత మార్పిడుల గురించి నిహాల్ సింగ్ దక్షిణాది సంచికల ఎడిటర్ అయిన సయీద్ నక్వీని సంపాదకీయం రాయమన్నారు ఎక్స్‌ప్రెస్ గ్రూపు ఎడిటర్‌గా నిహాల్ సింగ్. అది ప్రచురింపబడగానే యజమాని రామ్‌నాథ్ గోయంకా మండిపడి తన చార్టెడ్ అకౌంటెంట్ ఎస్. గురుమూర్తితో ఒక ఖండన రాయించి పంపారు. ఎడిటర్‌గా నిహాల్ ఏమి చేశారు? చెత్తబుట్టలో వేశారు! పిమ్మట గోయంకానే సర్దుకున్నారు. నిహాల్ సింగ్ ఎడిటర్‌గా కొనసాగారు. ఇది నక్వీ స్వయంగా రాసిన వ్యాసంలో ఉంది. వారి స్వీయ చరిత్రను చదివితే మరిన్ని విషయాలు తెలియవచ్చు. చదవాలి.ఈ దేశపు రెండు కొసలలో 88, 77 వయసున్న దిగ్గజాల్లాంటి సంపాదకులు ఒక రోజు తేడాతో కాలపురుషుని చెంతకు చేరారు. నాకు మాత్రం వీరు ఒక రకంగా గుర్తుంటారు. 1988- `91 కాలంలో నేను గోవాలో ఉద్యోగం చేస్తున్నాను. ఆ సమయంలో చక్కగా గుర్తుండిపోయే పత్రికలు రెండింటిని ఇక్కడ గుర్తు చేసుకున్నాను. తర్వాత రెండు అంతరించాయి వేర్వేరు పరిస్థితుల్లో! రేమండ్స్ యజమాని సింఘానియా నడిపిన ‘ఇండియన్ పోస్ట్’ దినపత్రిక బొంబాయి నుంచి నిహాల్ సింగ్ నేతృత్వంలో మొదలైంది. ‘ఇండియన్ పోస్ట్’ను నేను గమనించే నాటికి వినోద్ మెహతా ఎడిటర్ అయ్యారు. టైమ్స్ సంస్థ చమత్కారాలతో ఇండియన్ పోస్ట్ మూతబడినా, చాలా ప్రయోగాలు చేసిన పత్రికగా ఇండియన్ పోస్ట్‌కు పేరుంది.

వారాంతపు పత్రికలు ఇప్పుడు లేవు గానీ, మూడు దశాబ్దాల ముందు ‘సండే అబ్జర్వర్’ చాలా విలక్షణంగా సాగేది. దీనికి పోటీగానే భావించబడే ‘ది సండే మెయిల్’ అనే వారాంతపు వార్తా వారపత్రిక నాలుగు ప్రధాన నగరాల నుంచి 1989లో మొదలయింది టి.వి.ఆర్. షెనాయ్ సంపాదకత్వంలో. బ్రాడ్ షీట్ 16 పేజీలు లేదా 20 పేజీలతో వీక్లీ సైజ్‌లో వెలువరించిన అనుబంధం గొప్పగా ఉండేది. ఇప్పటికీ ఈ సంచికలు నా దగ్గర ఉన్నాయి. రాజకీయ విషయాలూ, సినిమా సంగతులు లేకుండా చాలా ఆసక్తికరంగా ఈ అనుబంధాలు సాగేవి. పిరియాడికల్ జర్నలిజంలో ప్రయోగాలు చేయాలనుకుకేవారికి ఇవి గొప్ప ఆకరాలు. ఇలాంటి విలక్షణ పత్రికకు టి.వి.ఆర్. షెనాయ్ ఎడిటర్. అందువల్ల నిహాల్ సింగ్, టి.వి.ఆర్. షెనాయ్ నాకు ప్రత్యేకంగా గుర్తుండిపోతారు.తెలుగులో ఎన్నో దినపత్రికలూ; లెక్కకు మించి వార్తా చానళ్ళు; కంపరం పుట్టించే రీతిలో సోషల్ మీడియా ఉన్నా- ముఖ్యమైన వార్తలు మిస్ అవుతున్నాం. తెలుగు మీడియాకు ఈ సంపాదకులు అవసరం ఉండకపోవచ్చు లేదా మన సంపాదక శ్రేణులకు వీరి గురించి తెలియకపోయి ఉండవచ్చు. అయినా మన పాత్రికేయులూ, సంపాదకులు వీరి గురించి తెలుసుకోవాలి. స్ఫూర్తి పొందాలి.

– డా. నాగసూరి వేణుగోపాల్
మీడియా విశ్లేషకులు