లంచం కోసం వృద్ధుల భిక్షాటన!

26 January, 2019 - 4:22 PM

(న్యూవేవ్స్ డెస్క్)

భూపాలపల్లి (తెలంగాణా): వాళ్ళసలే వృద్ధ దంపతులు.. పనేమీ చేయలేరు. జవసత్వాలు ఉడిగిపోయిన ఆ ముసలి దంపతులను కూడా విడిచిపెట్టని అవినీతి అధికారి బాగోతాన్ని వాళ్ళిద్దరూ చాలా తెలివిగా.. సమయస్ఫూర్తితో బహిర్గతం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూమి పాస్ పుస్తకాల పంపిణీకి ఇలాంటి చీడపురుగులు చెడ్డపేరు తీసుకువస్తున్నాయనేందుకు ప్రత్యక్ష నిదర్శనమే ఈ సంఘటన.

ఇంతకీ ఆ వృద్ధ దంపతులు చేసిందేంటంటే.. ‘తాసీల్దారుకు లంచం ఇచ్చేందుకు సాయం చేయాలంటూ వారిద్దరూ బిచ్చమెత్తారు. లంచం ఇస్తేనే పాసు పుస్తకాలు ఇస్తానని ఆ తాసిల్దారు మెలిక పెట్టాడు. దీంతో ఏం చేయాలో తెలియని వృద్ధ దంపతులు వినూత్నంగా నిరసనకు దిగారు. ‘ఓ అవినీతిపరుడికి లంచం ఇవ్వాలనీ, దయచేసి సాయం చేయాల’ని భిక్షాటన మొదలుపెట్టారు.

తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం ఆజంనగర్‌‌కు చెందిన మంతు బసవయ్య, లక్ష్మి వృద్ధ దంపతులు. తమ పట్టా భూములకు పాసు పుస్తకాలు ఇచ్చేందుకు తాసిల్దారు లంచం అడుగుతున్నాడని శుక్రవారం జిల్లా కేంద్రంలో భిక్షాటన చేశారు. ఈ విషయం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు తక్షణం స్పందించి ఆర్డీఓ ద్వారా సమస్యను పరిష్కరించారు.

ఈ వృద్ధ దంపతులు తమ తొమ్మిది ఎకరాల భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని రెండేళ్లుగా తాసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. రెండు నెలల క్రితం తాసిల్దారు కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాతో కూడా నిరసన తెలిపారు. వారి పాస్ పుస్తకాల విషయంలో ఇటీవల జేసీ స్వర్ణలత తాసిల్దారును ఆదేశించినా ఎలాంటి ఫలితమూ లేదు. చివరిగా తాసిల్దారుకు లంచం ఇస్తేనే పాసు పుస్తకం జారీ చేస్తారనే ఉద్దేశంతో భిక్షాటనకు దిగారు. తమకు జరిగిన అన్యాయాన్ని ఫ్లెక్సీలపై రాయించి భిక్షాటన మొదలుపెట్టారు.

కలెక్టర్‌ ఆదేశాల మేరకు వారిని భూపాలపల్లి ఆర్డీఓ వెంకటాచారి తన కార్యాలయానికి పిలిపించి 4.10 ఎకరాలకు పట్టాదారు పాసుపుస్తకాన్ని అందజేశారు. మిగతా 5.07 ఎకరాల భూములు వివాదంలో ఉన్నందున పూర్తిగా పరిశీలించి పట్టాదారు పాసు పుస్తకం జారీ చేస్తామని ఆర్డీఓ వెల్లడించారు.

ఈ వృద్ధ దంపతులకు సర్వే నెంబర్‌ 622/52లో 2.37 ఎకరాల భూమి ఉంది. ఇందులో 1.37 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన కానుగంటి కొంరయ్యకు ఫోర్జరీ పత్రాల ద్వారా అప్పగించేందుకు అధికారులు యత్నించినట్లు బసవయ్య దంపతులు ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లు తాసిల్దారు కార్యాలయానికి వచ్చినా న్యాయం జరగకపోవడంతో వీరిద్దరూ గత ఏడాది నవంబర్ 19న పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగారు. న్యాయం చేయకుంటే ఆత్మహత్యే తమకు శరణ్యమని వాపోయారు.