‘ఓ బేబీ’ హల్‌చల్

22 July, 2019 - 3:56 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: బి. వి. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత అక్కినేని నటించిన చిత్రం ఓ బేబీ. జులై 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ టాక్‌ని అందుకుంది. అంతేకాదు.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యూఎస్‌లో సైతం ఓ బేబీ చిత్రం హల్‌చల్ చేస్తోంది.

యూఎస్‌లో విడుదలైన ఈ చిత్రం వన్ మిలియన్ డాలర్లను ఇప్పటికే వసూళ్ల చేసిందని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ వెల్లడించింది. అంతేకాదు.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై రూ. 35 కోట్లకు పైగా నగదు వచ్చిందని ప్రకటించింది. ఈ చిత్రంపై విమర్శకుల సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో నాగశౌర్య, సీనియర్ నటి లక్ష్మీ, రాజేంద్ర ప్రసాద్, రావు రమేశ్ కీలక పాత్ర పోషించారు. ఓ బేబికి మిక్కిజే మేయర్ స్వరాలు అందించారు. ఈ చిత్రానికి సునీత తాటి, టీజీ విశ్వప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరించారు. కాగా సమంత నటించిన చాలా చిత్రాలు సూపర్ హిట్ సాధించమే కాదు.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. కానీ సమంత సోలోగా నటించిన ఈ చిత్రానికి కూడా సినీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంపై ఈ చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తుంది.