‘ఎన్టీఆర్ కథానాయకుడు’ రివ్యూ

09 January, 2019 - 3:28 PM

సినిమా: ఎన్‌.టి.ఆర్‌ కథానాయకుడు
జానర్: బయోపిక్‌
నటీ నటులు: నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్‌, దగ్గుబాటి రాజా, కల్యాణ్‌రామ్‌, రానా, సుమంత్‌, భరత్‌రెడ్డి, వెన్నెల కిషోర్‌, పూనమ్‌ బాజ్వా, మంజిమా మోహన్‌, నరేష్‌, మురళీశర్మ, క్రిష్‌, రవికిషన్‌, శుభలేఖ సుధాకర్‌, రవిప్రకాష్‌, చంద్ర సిద్ధార్థ, భానుచందర్‌, ప్రకాష్‌‌రాజ్‌, కె.ప్రకాష్‌, ఎన్‌.శంకర్‌, దేవీప్రసాద్‌ తదితరులు
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్‌ వీఎస్‌
ఎడిటింగ్‌: అర్రం రామకృష్ణ
సంభాషణలు: బుర్రా సాయిమాధవ్‌
దర్శకత్వం: క్రిష్‌ జాగర్లమూడి
నిర్మాతలు: నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి

బాలీవుడ్, టాలీవుడ్‌‌లలో ఇప్పుడు బయోపిక్‌‌ల సీజన్‌ నడుస్తోంది. ఇంతకు ముందు ‘మహానటి’ మూవీ ఘనవిజయం సాధించటంతో ఇప్పుడు మరో మహానటుడి జీవిత కథ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు సినీరంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జీవితకథను రెండు భాగాలుగా తీస్తున్నారు. తండ్రి పాత్రలో నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ, నిర్మిస్తున్న మొదటి భాగం ఎన్‌.టి.ఆర్‌ కథానాయకుడు బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో బాలయ్య తొలిసారిగా నిర్మాతగా మారటంతో సినిమా మీద అంచనాలు బాగా పెరిగాయి. ఆ అంచనాలను ఎన్‌.టి.ఆర్‌ కథానాయకుడు అందుకుందా? తండ్రి పాత్రలో బాలయ్య మెప్పించాడా? క్రిష్‌ దర్శకుడిగా మరోసారి సత్తా చాటాడా? చూద్దాం.కథ‌:
ఎన్టీఆర్ సినీ జీవితం తెరచిన పుస్తకం. అందుకే దర్శకుడు క్రిష్ దశాబ్దాలుగా జనాలకు తెలిసిన విషయాలే సినిమాటిక్‌‌గా వెండితెర మీద చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌‌కు ఆయన భార్యతో ఉన్న అనుబంధం ఆమె మాటకు ఎంత విలువ ఇస్తారనే విషయాలు చూపించారు. ఎన్టీఆర్‌ బాల్యం జోలికి పోకుండా నేరుగా సినీ జీవితంతో కథ మొదలుపెట్టారు. క్యాన్సర్‌‌తో బాధపడుతున్న బసవరామ తారకం (విద్యాబాలన్‌) పరిచయంతో సినిమా మొదలవుతుంది. ఆమె ఎన్టీఆర్ ఆల్బమ్‌‌ను చూస్తుండగా అసలు కథ స్టార్ట్‌ అవుతుంది.

రామారావు (బాలకృష్ణ) రిజిస్ట్రార్‌ ఆఫీస్‌‌లో మంచి ఉద్యోగం వచ్చినా అక్కడి పరిస్థితులు లంచాలకు అలవాటు పడిన అక్కడి ఉద్యోగుల పద్ధతులు నచ్చక చేరిన మూడు వారాల్లోనే ఉద్యోగం వదిలేసి సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. గతంలో రామారావు వేసిన నాటకం చూసిన ఎల్వీ ప్రసాద్‌ (జిష్షు) సినిమా అవకాశం ఇస్తాననటంతో ఆయనను కలిసేందుకు మద్రాస్‌ బయల్దేరుతారు. అలా మద్రాసు చేరిన రామారావు సినీ ప్రయాణం ఎలా మొదలైంది. మొదట్లో నటుడిగా ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులేంటి? అక్కినేని నాగేశ్వర్రావు (సుమంత్‌)తో ఆయన అనుబంధం, వెండితెర వేల్పుగా ఎన్టీఆర్‌ ఎదిగిన తీరు, ఆయనను రాజకీయాలవైపు నడిపించిన పరిస్థితులే ఈ సినిమా కథ. చివరిగా ఎన్టీఆర్ రాజకీయ పార్టీని ప్రకటించటంతో తొలి భాగం ముగుస్తుంది.న‌టీన‌టులు:
సినిమా మొత్తం ఎన్టీఆర్‌ పాత్ర చుట్టూతా తిరగటంతో ప్రతీ ఫ్రేమ్‌లోనూ బాలయ్యే తెర మీద కనిపిస్తారు. ఒక రకంగా నందమూరి అభిమానులకు ఈ సినిమా పండగే అని చెప్పొచ్చు. అయితే.. ఎన్టీఆర్‌ యువకుడిగా ఉన్నప్పటి పాత్రలో బాలయ్య లుక్‌ ఆకట్టుకోలేదు. నటన పరంగా తండ్రి పాత్రలో బాలకృష్ణ ఒదిగిపోయారనే చెప్పాలి. కాస్త వయసైన పాత్రలో బాలయ్య లుక్‌, పెర్ఫామెన్స్‌ బాగుంది. సినిమాలో మరో కీలక పాత్ర ఎన్టీఆర్ సతీమణి బసవరామ తారకం. ఆ పాత్రకు విద్యాబాలన్‌ లాంటి నటిని ఎందుకు తీసుకున్నారో సినిమా చూస్తే అర్ధం అవుతుంది. తన నటనతో ఆ పాత్ర స్థాయిని విద్యాబాలన్ ఎంతో పెంచారు. చక్కని నటనతో ఆకట్టుకున్నారు. సినిమాలో కాస్త ఎక్కువ సేపు కనిపించే మరో పాత్ర ఎన్టీఆర్‌ సోదరుడు త్రివిక్రమ్‌ రావుది. ఈ పాత్రలో చాలా కాలం తరువాత దగ్గుబాటి రాజా వెండితెర మీద కనిపించారు. లక్ష్మణుడి లాంటి తమ్ముడిగా రాజా నటన బాగుంది. అక్కినేని పాత్రలో ఆయన మనవడు సుమంత్ జీవించారనే చెప్పాలి. ఆ పాత్రకు మరొకరిని ఊహించుకోలేనంత స్థాయిలో సుమంత్ ఒదిగిపోయారు. ఇతర పాత్రల్లో ఎంతో మంది హేమా హేమీల్లాంటి నటులు కనిపించారు. ప్రతి ఒక్కరూ తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారు.

విశ్లేష‌ణ‌:
ఎన్టీఆర్ కేవ‌లం తెలుగు వారి అభిమాన న‌టుడు మాత్రమే కాదు. తెలుగు ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేసి స‌గ‌ర్వంగా త‌లెత్తుకునేలా చేసిన మ‌హోన్నతుడు. వెండితెర‌పై జాన‌ప‌ద‌, పౌరాణిక‌, సాంఘిక.. ఇలా జాన‌ర్ ఏదైనా త‌న‌దైన న‌ట‌న‌తో చెర‌గ‌ని ముద్రవేసిన గొప్ప న‌టుడు. ఆయ‌న పోషించిన‌న్ని పౌరాణిక పాత్రలు మ‌రో న‌టుడు చేయ‌లేదంటే అతిశ‌యోక్తి కాదు. తెలుగు సినిమా చ‌రిత్రలో ఆయ‌న పేజీలు సువ‌ర్ణాక్షరాల‌తో లిఖించ‌ద‌గ‌ిన‌వి అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. సినీ ప్రస్థానంలో ఎలాంటి ఉన్నత శిఖ‌రాల‌కు చేరుకున్నారో ఆ త‌ర్వాత తెలుగుదేశం పార్టీని స్థాపించి, ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన తీరును ఎవ‌రూ మ‌ర్చిపోలేరు.అలాంటి ఎన్‌.టి.ఆర్‌ లాంటి మహానటుడి జీవిత కథను వెండితెర మీద ఆవిష్కరించే బృహత్తర బాధ్యతను తీసుకున్న దర్శకుడు క్రిష్‌, నందమూరి అభిమానులను దృష్టిలో పెట్టుకొని సినిమాను తెరకెక్కించారు. కథా కథనాల మీద కన్నా బాలయ్య అభిమానులను అలరించే ఎలివేషన్‌ షాట్స్‌ మీదే ఎక్కువగా దృష్టి పెట్టారు. ఎన్టీఆర్‌ కథను తెలుసుకోవాలనుకున్న ప్రేక్షకులను నిరాశపరిచినా.. ఫ్యాన్స్‌‌ను మాత్రం మెప్పించారు. ముఖ్యంగా కృష్ణుడిగా ఎన్టీఆర్ తెరమీద కనిపించే సన్నివేశానికి థియేటర్లో అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తుంది. ఎన్టీఆర్‌, బసవరామ తారకం మధ్య వచ్చే సన్నివేశాలను తన స్టైల్‌‌లో ఎంతో ఎమోషనల్‌‌గా చూపించారు దర్శకుడు. అయితే.. అక్కడక్కడా కథను కాస్త సాగదీసిన ఫీలింగ్‌ కలుగుతుంది. సినిమాకు ప్రధాన బలం కీరవాణి సంగీతం. పాటలతో పాటు నేపథ్యం సంగీతంతో సన్నివేశాల స్థాయిని పెంచారు కీరవాణి. రచయిత సాయి మాధవ్‌ బుర్రా మనసును తాకే మాటలతో మెప్పించారు. జ్ఞానశేఖర్‌ సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్‌ లుక్‌ తీసుకువచ్చింది. బాలయ్య హీరోగానే కాక నిర్మాతగా కూడా మంచి మార్కులు సాధించారు. ఎన్టీఆర్ కథను అభిమానులకు అందించేందుకు ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఖర్చు పెట్టారు.

బలాలు:
బాలయ్య, విద్యాబాలన్‌ నటన
ఎన్టీఆర్‌, బసవరామ తారకం మధ్య వచ్చే సన్నివేశాలు
సంగీతం
ఎన్టీఆర్ ఎదిగిన తీరు, గెట‌ప్పులు
భావోద్వేగ స‌న్నివేశాలు
ఎన్టీఆర్‌-ఏయ‌న్నార్‌‌ల మైత్రి
సంభాష‌ణలు
బలహీనతలు:
ఫస్ట్‌ హాఫ్‌‌లో బాలకృష్ణ లుక్‌
సాగదీత సన్నివేశాలు
సినిమా నిడివి