వింబుల్డన్‌ విజేత జొకోవిచ్

15 July, 2019 - 7:08 AM

(న్యూవేవ్స్ డెస్క్)

లండన్‌: ఇద్దరు టాప్‌ సీడ్ల మధ్య జరిగిన ఆఖరి యుద్ధంలో అంతిమ విజయం నొవాక్ జొకోవిచ్‌ను వరించింది. వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) 7–6 (7/5), 1–6, 7–6 (7/4), 4–6, 13–12 (7/3)తో రెండో సీడ్‌ రోజర్‌ ఫెదరర్‌ (స్విట్జర్లాండ్‌)పై విజయం సాధించాడు. ఐదు సెట్ల పోరాటంలో మూడు సెట్లను టైబ్రేక్‌లే తేల్చాయి. ఏస్‌ల రారాజు ఫెడరర్‌ ఏకంగా 25 ఏస్‌లు సంధించినప్పటికీ టైబ్రేక్‌లో వెనుకబడ్డాడు. దీంతో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. విజేత జొకోవిచ్‌ 10 ఏస్‌లు సంధించి, 52 అనవసర తప్పిదాలు చేశాడు. ఈ స్విస్‌ స్టార్‌ 61 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. 94 విన్నర్లు కొట్టిన ఫెడరర్, ఆరుసార్లు డబుల్‌ ఫాల్ట్‌ చేశాడు. జొకోవిచ్‌ 54 విన్నర్లు కొట్టాడు. ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌లో ఐదో టైటిల్‌ గెలిచిన జొకోవిచ్‌ ఓవరాల్‌గా 16వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు.

ఓపెన్‌ శకం ప్రారంభమయ్యాక టాప్‌ సీడ్, రెండో సీడ్‌ వింబుల్డన్‌ ఫైనల్లో తలపడటం ఇది 14వ సారి. 2015లోనూ ఈ ఇద్దరూ టైటిల్‌ కోసం పోటీపడగా ఫెదరర్‌పై జొకోవిచ్ గెలిచాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 20 కోట్ల 26 లక్షలు) రన్నరప్‌ ఫెదరర్‌కు 11 లక్షల 75 వేల పౌండ్లు (రూ. 10 కోట్ల 13 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

ఇద్దరు హేమాహేమీల ఆట తొలి నుంచే వేటగా మారిందంటే అతిశయోక్తి లేదు. అందుకే ఒక్క సెట్‌ మినహా మిగతా అన్ని సెట్లూ నువ్వానేనా అన్న రీతిలో సాగాయి. ముందుగా 58 నిమిషాల పాటు జరిగిన తొలి సెట్‌లో ఎవరి సర్వీస్‌ను వారు నిలబెట్టుకోవడంలో సఫలమయ్యారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌ ఒక గేమ్‌ గెలిస్తే.. మరో గేమ్‌ ఫెదరర్‌ నెగ్గాడు. ఇలా 12 గేమ్‌ల దాకా సాగిన తొలి సెట్‌లో ఇద్దరూ ఆరేసి పాయింట్లు సంపాదించారు. దీంతో ఫలితం తేల్చేందుకు టైబ్రేక్‌ అనివార్యమైంది. టైబ్రేక్‌లో సెర్బియన్‌ అంత చురుగ్గా ఫెదరర్‌ షాట్లకు పదును పెట్టలేకపోయాడు. దీంతో ఫెదరర్ తొలి సెట్‌ను కోల్పోయాడు.

తుది పోరులో ఈ రెండో సెట్‌ మినహా అన్ని సెట్లూ యుద్ధాన్ని తలపించాయి. ఈ సెట్‌లో ఫెదరర్ ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌ హాండ్‌ షాట్లతో చెలరేగాడు. ప్రత్యర్థి కంటే రెట్టింపు వేగంతో కదం తొక్కడంతో జొకోవిచ్ ఆటలు సాగలేదు. దీంతో ఫెదరర్‌ జోరుకు తిరుగు లేకుండా పోయింది. మొదటి నుంచీ చకచకా పాయింట్లు సాధిస్తుండటంతో వరుస గేముల్లో రోజర్‌ గెలుస్తూ వచ్చాడు. రెండు బ్రేక్‌ పాయింట్లతో పాటు తన సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో కేవలం 15 నిమిషాల్లోనే ఫెదరర్‌ 4–0తో ఆధిపత్యం చాటాడు. అదేపనిగా అనవసర తప్పిదాలు చేసిన సెర్బియన్‌ స్టార్‌ ఒక్క గేమ్‌ అయినా గెలకుండానే సెట్‌ కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు. చివరికి ఐదో గేమ్‌లో జొకోవిచ్‌కు గేమ్‌ గెలిచే పట్టుచిక్కింది. తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో 1–4తో ఫెదరర్‌ జోరుకు ఎదురు నిలిచాడు. వెంటనే తేరుకున్న ఫెదరర్‌ మరో బ్రేక్‌ పాయింట్‌తో పాటు సర్వీస్‌ నిలబెట్టుకొని సెట్‌ను 6–1తో గెలిచాడు.

ఇక మూడో సెట్‌ కూడా తొలి సెట్‌నే తలపించింది. ప్రతి పాయింట్‌ కోసం ఇద్దరూ శక్తికి మించి శ్రమించారు. 52 నిమిషాల పాటు జరిగిన ఈ సెట్‌లో ఫెదరర్‌ తన ప్రత్యర్థిపై 4 ఏస్‌లతో విరుచుకుపడినప్పటికీ 12 అనవసర తప్పిదాలు ఫలితంపై ప్రభావం చూపాయి. ఈ సెట్‌ కూడా 6–6 దాకా సాగడంతో టైబ్రేక్‌ తప్పలేదు. ఇందులో సెర్బియన్‌ స్టార్‌ వయసు పైబడిన ఫెదరర్‌పై సహజంగా తన దూకుడు కనబరచి సెట్‌ దక్కించుకున్నాడు. నాలుగో సెట్‌లో మళ్లీ ఫెదరర్‌ జోరు పెంచాడు. ఇందులో సుదీర్ఘ ర్యాలీలు జరిగిన ప్రతీసారి ఫెదరర్‌ విన్నర్లు సంధించి సెట్‌ గెలిచాడు.

నిర్ణాయక ఐదో సెట్‌ హోరాహోరీగా సాగింది. ఒక దశలో 8–7తో ఆధిక్యంలో ఉన్నపుడు తన సర్వీస్‌లో ఫెదరర్‌ 40–15తో రెండు మ్యాచ్‌ పాయింట్లు సంపాదించాడు. అయితే జొకోవిచ్‌ తేరుకొని ఈ గేమ్‌లో ఫెడరర్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి స్కోరును 8–8తో సమం చేసి మ్యాచ్‌లో నిలిచాడు. ఆ తర్వాత ఆఖరి సెట్‌ కటాఫ్‌ స్కోరు 12–12 దాకా జరిగింది. ఇక్కడ టైబ్రేక్‌ నిర్వహిస్తే మళ్లీ జొకోవిచే పైచేయి సాధించడంతో టైటిల్‌ దక్కింది. ఈ సీజన్‌లో సెర్బియన్‌ స్టార్‌కిది రెండో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచిన జొకోవిచ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సెమీస్‌లో వెనుదిరిగాడు.