ఉత్తర కొరియా సంచలన నిర్ణయం!

13 May, 2018 - 10:50 AM

ప్యోంగ్యాంగ్ (ఉ.కొరియా): వరుసపెట్టి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ఉత్తరకొరియా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే మరో సంచలన ప్రకటన చేసింది. ఈ నెల 23, 25 తేదీల్లో అమెరికాతో చర్చలు జరగనున్న నేపథ్యంలో.. పరిస్థితులను బట్టి అంతకంటే ముందే అణ్వాయుధ పరీక్షల కేంద్రాన్ని పేల్చేయాలని నిర్ణయించింది. అణు పరీక్షలను ఆపేస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన నార్త్ కొరియా చీఫ్ కిమ్ అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ అధికారిక మీడియా తెలిపింది.

పేలుడు పదార్థాలతో పుంగే-రి అణుపరీక్షల కేంద్రాన్ని పేల్చి వేయనున్నట్టు అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. రీసెర్చ్ భవనాలు, సెక్యూరిటీ పోస్టులు, టన్నెల్స్, న్యూక్లియర్ వెపన్ ఇనిస్టిట్యూట్, ఇతర సంస్థలతో పాటు అన్నింటినీ ధ్వంసం చేయనున్నట్టు తెలిపింది. అణుపరీక్షలకు చరమగీతం పాడినట్టు ప్రకటించిన నేపథ్యంలో పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది.

జూన్ 12న కిమ్ జాంగ్ ఉన్‌‌తో సింగపూర్‌‌లో భేటీ కానున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.