రాయుడు, రిషబ్‌కు దక్కని చోటు

15 April, 2019 - 5:21 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ముంబై: వచ్చే నెల 30 నుంచి ఇంగ్లండ్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు 15 మందితో కూడిన భారత జట్టును సెలెక్షన్ కమిటీ సోమవారం ముంబైలో ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ సభ్యులు కోహ్లీ సేనను ఖరారు చేశారు.

అయితే.. ఈ జట్టులో తెలుగు రాష్ట్రానికి చెందిన అంబటి తిరుపతి రాయుడు, రిషబ్ పంత్‌లకు స్థానం దక్కకపోవడం గమనార్హం. గత కొంతకాలంగా అటు భారత జట్టులోనూ.. ఇటు ఐపీఎల్‌‌లోనూ రాణిస్తున్న యువ ఆటగాడు రిషబ్‌ పంత్ ఆశలపై బీసీసీఐ నీళ్లు జల్లింది. రిజర్వ్ కీపర్‌‌గా రిషబ్‌‌ను జట్టులోకి తీసుకుంటారని అభిమానులంతా భావించారు. అయితే.. పంత్‌‌కు కాకుండా దినేశ్ కార్తీక్‌‌కి రిజర్వ్ కీపర్‌’గా తీసుకోవడం విశేషం. దీంతో రిషబ్‌కు ఈ సారి ప్రపంచకప్‌లో పాల్గొనే అవకాశం చేజారిపోయింది.

ఇక.. టీమిండియాలో నాలుగో నెంబర్ ఆటగాడిపై గడచిన ఆరు నెలలుగా చాలా చర్చే జరిగింది. గత ఏడాది అక్టోబరులో ఆసియా కప్‌ తర్వాత కోహ్లి బహిరంగంగానే రాయుడు ఈ స్థానానికి సరైనవాడంటూ మద్దతు పలికాడు కూడా. గతేడాది ఐపీఎల్‌‌లో చక్కటి ప్రదర్శన తర్వాత రాయుడు టీమిండియాలోకి పునరాగమనం చేశాక భారత్‌ 24 వన్డేల్లో పాల్గొంటే రాయుడు 21 ఆడాడు. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో వన్డే సీరీస్‌ సమయంలో ఇంకా అనిశ్చితి ఉందంటూ కోహ్లి, రోహిత్‌ చేసిన వ్యాఖ్యలు మళ్లీ సందేహాలు రేకెత్తించాయి. కివీస్‌‌తో చివరి వన్డేలో చక్కటి బ్యాటింగ్‌‌తో 90 పరుగులు చేసిన రాయుడు ఆసీస్‌‌తో సొంతగడ్డపై మూడు వన్డేల్లోనూ విఫలమయ్యాడు. దాంతో రాయుడ్ని సెలెక్షన్ కమిటీ పక్కన పెట్టేయడం గమనార్హం.