‘కవిత’మ్మ పండగకి కాస్త విరామం!

07 October, 2018 - 6:44 PM

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడిందంటే… టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరామ్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, తెలంగాణ జాగృతి, తెలంగాణ సమాజం, ఇతర రాజకీయ పార్టీలు కలసి కట్టుగా పోరాటం చేశాయి. ఆ క్రమంలోనే తెలంగాణ ప్రజల కల సాకారమైంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే… తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తనయ తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కె. కవిత ప్రజలను బతుకమ్మ పండగ ద్వారా సంస్కృతికంగా చైతన్యం చేశారనే చెప్పాలి.

తెలంగాణ ఉద్యమంలో ఈ పండగ కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మను రాష్ట్ర పండగగా కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత ప్రతి ఏడాది శరన్నవరాత్రుల సమయంలో ఈ పండగను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాక.. ప్రపంచం నలుమూల ఉన్న తెలంగాణ ప్రజలు సైతం ఈ పండగ జరుకోవడం అనవాయితీగా వస్తుంది. విదేశాల్లో నిర్వహించే ఈ పండగకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీ అయితేనేమీ… వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పలువురు రాజకీయ నేతలు అయితేనేమీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు… అవుతున్నారు.

 అదే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అయితే… ట్యాంక్ బండపై ఈ పండగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అదీ కవిత ఆధ్వర్యంలో. కానీ ఈ పండగకు కేసీఆర్ ప్రభుత్వం ఏటా రూ. 10 కోట్లు కేటాయిస్తున్నదంటూ విపక్షాలు నానా యాగీ చేసి పారేశాయి. అయినా గత నాలుగేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం నిధులు కేటాయిస్తునే ఉంది. కవితమ్మ.. బతుకమ్మ ఆడుతూనే ఉంది. దీంతో బతుకమ్మ పండగ కాస్తా.. కవితమ్మ పండగగా మరిపోయిందంటూ విపక్షాలు సెటైర్లు వేస్తూ వచ్చాయి.

అయితే తాజాగా తెలంగాణలో ముందుస్తు ఎన్నికల నగారా మోగింది. ఈ నేపథ్యంలో ఈ సారి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం లేదని తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఎన్నికలు దూసుకొస్తున్న వేళ.. వాటిపై దృష్టి సారించడం అనివార్యం కావడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కవిత అంటున్నారు. తెలంగాణ మహిళలందరూ ఈ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు.

కాగా తెలంగాణ ఉద్యమ సమయంలోనూ…  రాష్ట్రం ఏర్పడిన తర్వాతా.. బతుకమ్మను కవిత ఓ రేంజ్‌లో హైలెట్ చేసింది. అంతేకాదు… పక్క రాష్ట్రంలోని డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె ఎంపీ కనిమెళి కూడా హైదరాబాద్ వచ్చి కవితతో కలసి బతుకమ్మ ఆడిన సంగతి గుర్తుండే వుంటుంది. మరి కవిత… అయితే ఈ సారి బతుకమ్మ ఆడరాదని ఆమె తీసుకున్న నిర్ణయం వెనక కేసీఆర్ ఉన్నారని సమాచారం. అంతేకాదు ఎన్నికలకు ఇక రెండు నెలలు మాత్రమే వ్యవధి ఉంది.

అలాంటి వేళ కవిత బతుకమ్మ ఆడితే.. రాజకీయంగా మైలేజ్ కోసం ఈ పని చేస్తోందని విపక్షాలకు ఆయుధం అయి కూర్చుంటుందని కేసీఆర్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. దీంతో వారి చేతిలో మనం జుట్టు పెట్టినట్లే అని ఆయన భావించారట. ఈ పండగకు కూడా నిధులు కేసీఆర్ ఇచ్చాడని ఢంకా భజాయించి మరీ మహా కుటమిగా ఏర్పడిన విపక్షాలు మహా రాద్ధాంతం చేస్తాయని కేసీఆర్ ఒకానొక సందర్బంగా ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. అందుకే ఈ సారి బతుకమ్మ పండగలో పాల్గొనవద్దు అంటూ కవితకు కేసీఆర్ బ్రేక్ వేశారని సమాచారం.

కాగా ఈ సారి కవితమ్మ.. బతుకమ్మ ఆడకపోవడంపై తెలంగాణ సమాజంలో వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బతుకమ్మ అంటే బతుకు కోరేది అంటూ తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ సెంట్‌మెంట్ కామెంట్లు చేసి ప్రజల్లో మంచి ఊపు, ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా…. సమాజాన్ని ఏకం చేశారు. అలాంటి కేసీఆర్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై ఎంత వరకు సబబు అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

 

అదీకాక.. తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఎన్నికల కోసం అసెంబ్లీని రద్దు చేసింది. ప్రస్తుతం అపద్దర్మ ప్రభుత్వం నడుస్తోంది. ఈ ప్రభుత్వం బతుకమ్మకు నిధులు కేటాయించక పోవడం వల్లే ఈ సారి కవితమ్మ బతుకమ్మ ఆడటం లేదని విపక్షం ప్రధాన ఆస్త్రంగా చేసుకుని ఆరోపణలు ఎక్కుపెట్టింది.

ఏదీ ఏమైనా… ఎన్నికల వేళ.. కవితమ్మ బతుకమ్మ ఆడి తెలంగాణ ప్రజలను తమ వైపు తిప్పుకోవచ్చు అని గులాబీ దళంలో అంతర్గతంగా చర్చ సాగుతోంది. మరి కవిత ఎందుకు ఈ సారి బతుకమ్మ ఆడను అని క్లారిటీగా చెప్పిందో కారు పార్టీలోని లీడర్లకు క్యాడర్లకే ఓ అర్థం కానీ ప్రశ్నగా మిగిలింది.

అయితే కవితమ్మ బతుకమ్మ ఆడిన ఓ వీడియోను తెలంగాణ జాగృతి సంస్థ రూపొందించి ఓ యూట్యూబ్ చానల్‌లో  పోస్ట్ చేసింది. ఈ ఏడాదికి ఇంతటితోనే సరిపెట్టుకోండి అన్నట్లుగా ఉంది సదరు వీడియో. అంతే తప్ప.. ఆమె ప్రజల్లోకి వచ్చి బతుకమ్మ ఆడే పరిస్థితి లేకుండా పోయింది.

కాగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బతుకమ్మకు సమయం కేటాయిస్తే.. ప్రతిపక్షాల నోటికి పని చెప్పినట్లు ఉంటుందని … ప్రత్యేకంగా కవితమ్మ బతుకమ్మ ఆడుతున్న వీడియోను షూట్ చేసి పెట్టారు.

ప్రతిపక్షాలు మాత్రం సూది మోపినంత విషయం తెలిసినా రాద్ధాంతం చేయకుండా మానతాయా అంటే ఆలోచించాల్సిందే. ఎన్నికలు కాకుండా మామూలు రోజుల్లో అయితే కవితమ్మ ఈ పాటికి ధూం ధాంగా బతుకమ్మ సన్నాహాల్లో మునిగిపోయి ఉండేది కాదంటారా?

-జి.వి.వి.ఎన్. ప్రతాప్