ఐపీఎల్‌లో ఇక ‘నో బాల్ అంపైర్’!

06 November, 2019 - 5:20 AM

(న్యూవేవ్స్ డెస్క్)

ముంబై: 2020 జరిగే ఐపీఎల్‌లో తొలిసారిగా ‘నోబాల్‌ అంపైర్‌’ను ప్రత్యేకంగా పెడుతున్నారు. నో బాల్ విషయంలో అప్పుడప్పుడూ వస్తున్న వివాదాల నేపథ్యంలో ఇలాంటి ఘటనలను నివారించేందుకు ఐపీఎల్‌ గవర్నింగ్ కౌన్సిల్ ఈ కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ఇద్దరు ఫీల్డ్‌ అంపైర్లు, థర్డ్‌ అంపైర్, రిజర్వ్‌ అంపైర్‌లకు ఇది అదనం అన్నమాట. కేవలం మ్యాచ్‌లో నో బాల్స్‌ను ప్రత్యేకంగా పరిశీలించడమే ఈ అంపైర్‌ డ్యూటీ.

ఐపీఎల్‌–2019లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు- ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో చివరి బంతికి విజయం కోసం బెంగళూరు ఏడు రన్స్ చేయాల్సి ఉంది. మలింగ వేసిన బంతికి పరుగు రాలేదు. అయితే.. టీవీ రీ ప్లేలో అది ‘నో బాల్‌’ అని తేలింది. దానిని అంపైర్లు సరిగా గమనించి ఉంటే అదనపు పరుగు రావడంతో పాటు సిక్సర్‌తో తాము గెలిచే అవకాశం ఉండేదని భావించిన కోహ్లీ ‘అంపైర్లు కళ్లు తెరచి పనిచేయాలి’ అంటూ ఘాటుగానే వ్యాఖ్యానించాడు. రాజస్థాన్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో అంపైర్లు ముందుగా ‘నో బాల్‌’ ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తీసుకున్నారు. దీంతో చెన్నై కెప్టెన్‌ ధోని ఆగ్రహంతో మైదానంలోకి దూసుకొచ్చి వాదనకు దిగిన విషయం తెలిసిందే.

‘నో బాల్ అంపైరింగ్‌ గురించి చెబుతుంటే కాస్త వింత అనిపించవచ్చు. కానీ.. గవర్నింగ్‌ కౌన్సిల్‌ తొలి సమావేశంలోనే దీనిపై విస్తృతంగా చర్చ జరిగింది. మేం టెక్నాలజీని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని భావిస్తున్నాం. కాబట్టి నో బాల్స్‌ పొరపాట్లనే ప్రత్యేకంగా గుర్తించేందుకు ఒక అంపైర్‌ ఉంటే మంచిదే. రాబోయే ముస్తాక్‌ అలీ దేశవాళీ టీ20 టోర్నీలో దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించే అవకాశం ఉంది’ అని కౌన్సిల్‌ సభ్యుడొకరు తెలిపారు. మరోవైపు మ్యాచ్‌లో ‘పవర్‌ ప్లేయర్‌’ను తీసుకొచ్చే నిబంధనను ప్రస్తుతానికి పక్కనపెట్టాలని కూడా కౌన్సిల్‌ నిర్ణయించింది. ఈ అంశంపై ఇప్పటి వరకూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అనుమతి లభించలేదని తెలిసింది. ఎక్కువ మంది సీనియర్లు ఉన్న ఒక ఐపీఎల్‌ ఫ్రాంచైజీకి చెందిన వ్యక్తి తమ అనుకూలత కోసమే ఈ కొత్త తరహా ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది.

ఇలా ఉండగా.. ఐపీఎల్‌–2020 కోసం జరిగే ఆటగాళ్ల వేలాన్ని డిసెంబర్‌ 19న కోల్‌కతాలో నిర్వహించాలని గవర్నింగ్‌ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ ప్రతీసారీ వేలం బెంగళూరులోనే జరిగేది. 2019తో పోలిస్తే ఈసారి ఒక్కో ఫ్రాంచైజీ మరో రూ.3 కోట్లు అదనంగా ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తూ గరిష్ఠంగా రూ. 5 కోట్లకు పెంచారు.