నితీష్ కాన్వాయ్‌పై రాళ్ళతో దాడి

12 January, 2018 - 9:48 PM

(న్యూవేవ్స్ డెస్క్)

పాట్నా: బీహార్ సీఎం నితీష్ కుమార్ కాన్వాయ్‌‌పై శుక్రవారం రాళ్ళతో దాడి జరిగింది. బక్సర్ జిల్లాలోని నందన్ ప్రాంతంలో ఈ ఆకస్మిక ఘటన జరిగింది. సమీక్ష యాత్రలో భాగంగా నితిష్ కుమార్ బక్సర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆ సమయంలో రాళ్లతో దాడి చేశారు. ఈ రాళ్ళ దాడిలో నితిష్ కాన్వాయ్‌‌లోని ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. అయితే.. ఈ దాడి నుంచి నితీష్ సురక్షితంగా బయటపడ్డారు.

ఆ తర్వాత నితీష్ తొలుత దమ్రోన్ గ్రామంలో బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి విషయంలో తన నిబద్ధతపై గిట్టని వారు ఇలా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ప్రజలు సహనం కోల్పోవద్దన్నారు. తనపై ఎవరు రాళ్ల దాడి చేశారో, ఎందుకు చేశారో ప్రస్తుతానికి తెలియదన్నారు. పాట్నాలో కూర్చొని పాలించేందుకు తాను లేనని చెప్పారు. మారుమూల గ్రామాల్లో కూడా పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం తన కర్తవ్యం అని సీఎం నితీష్ చెప్పారు.