అధికార పార్టీపై చినరాజప్ప ఫైర్

15 June, 2019 - 6:09 PM

(న్యూవేవ్స్ డెస్క్)

కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌లో అధికార పక్షం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప నిప్పులు చెరిగారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ… టీడీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలే గెలిచారని వైయస్ఆర్ సీపీ నాయకులు పదే పదే ప్రచారం చేస్తూ … టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబును అవమానిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇది సబబు కాదని ఆయన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సూచించారు.

చంద్రబాబును సామాన్య వ్యక్తిలా ఎయిర్ పోర్టులో తనిఖీ చేయడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీఐపీ, జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న చంద్రబాబును ఎయిర్ పోర్టు సిబ్బంది తనిఖీలు చేయడం దారుణమన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు భద్రతను తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కుట్రలకు తెర తీశాయని ఆయన ఆరోపించారు. అందులోభాగంగానే ఈ తనిఖీలనీ ఆయన విమర్శించారు. పెద్దాపురంలో ఓడిన వాళ్లు వచ్చి పెత్తనం చేస్తే… తామేమీ గాజులు తగిలించుకుని లేమని చినరాజప్ప ఘాటుగా విమర్శించారు.