బంగ్లా- న్యూజిలాండ్ జట్ల టెస్ట్ రద్దు

15 March, 2019 - 11:58 AM

(న్యూవేవ్స్ డెస్క్)

క్రైస్ట్‌‌చర్చ్‌: బంగ్లాదేశ్‌- న్యూజిలాండ్‌ జట్ల మధ్య శనివారం ప్రారంభం కావాల్సిన టెస్ట్ మ్యాచ్‌‌ను రద్దయింది. ఈ విషయాన్ని ఏఎన్‌ఐ వార్తా సంస్థ తన ట్విటర్‌‌ ఖాతాలో పోస్ట్ చేసింది.

బంగ్లాదేశ్ క్రికెటర్లు స్థానిక మసీదులో శుక్రవారం ప్రార్థనలకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని దుండుగులు కాల్పులు జరిపారు. ఈ ప్రమాదంలో పలువురు మరణించగా అనేక మంది గాయపడ్డారు. అయితే.. బంగ్లాదేశ్ క్రికెటర్లు మాత్రం తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని బయటపడ్డారు. ఈ దాడి అనంతరం బంగ్లా క్రికెటర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌‌తో జరగాల్సిన మూడో టెస్ట్‌ను రద్దు చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

బంగ్లాదేశ్‌ జట్టు అధికార ప్రతినిధి జలాల్‌ యూనిస్‌ ఈ విషయంపై స్పందించారు. ‘మా జట్టు ఆటగాళ్లు స్థానిక మసీదులో ప్రార్థనలకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. వెంటనే తేరుకొన్న మా జట్టు సభ్యులు అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆటగాళ్లంతా క్షేమంగానే ఉన్నారు. ఈ దాడి నేపథ్యంలో ఆటగాళ్లు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. వారిని వెంటనే హోటల్‌‌కు తరలించి అక్కడే ఉండమని చెప్పాం’ అని ఆయన పేర్కొన్నారు.