మహిళా క్రికెట్‌‌లో పెను సంచలనం!

09 June, 2018 - 11:17 AM

(న్యూవేవ్స్ డెస్క్)

డబ్లిన్: మహిళా క్రికెట్‌ చరిత్రలో పెనుసంచలనం నమోదయింది. ఐర్లండ్‌ ఆతిథ్యం ఇస్తున్న ముక్కోణపు సీరీస్‌‌లో న్యూజిలాండ్‌ మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 490 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. దీంతో అటు పురుషులు, ఇటు మహిళల అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో అత్యధిక స్కోర్‌ సాధించిన జట్టుగా కివీస్‌ మహిళల జట్టు రికార్డు సృష్టించింది.

డబ్లిన్‌లో శుక్రవారం ఐర్లండ్‌తో జరిగిన వన్డేలో 4 వికెట్ల నష్టానికి ఏకంగా 490 పరుగులు సాధించి… 21 ఏళ్ల క్రితం తాను సాధించిన రికార్డును తానే బద్దలు కొట్టింది. 1997లో క్రైస్ట్ చర్చ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన వన్డేలో న్యూజిలాండ్ మహిళా జట్టు 5 వికెట్లు కోల్పోయి 455 పరుగులు చేసింది. తాజాగా చేసిన అత్యధిక పరుగులతో ఆ రికార్డును ఆ దేశ జట్టే తుడిచిపెట్టేసింది.

ఐర్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ సుజీ బేట్స్ చెలరేగి ఆడింది. 94 బంతుల్లో 151 పరుగులు సాధించింది. మ్యాడీ గ్రీన్ 77 బంతుల్లో 121 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో బౌండరీల వర్షం కురిసింది. మొత్తం 64 బౌండరీలు, ఏడు సిక్సర్లు ఈ వన్డేలో నమోదయ్యాయి.

న్యూజిలాండ్ జట్టు సాధించిన ఈ రికార్డు అంతర్జాతీయ పురుషులు, మహిళల వన్డే క్రికెట్‌లోనే అత్యధిక స్కోర్. పురుషుల వన్డే క్రికెట్‌లో అత్యధిక స్కోరు రికార్డు ఇంగ్లండ్ పేరున ఉంది. 2016లో ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన వన్డేలో పాకిస్తాన్‌పై ఇంగ్లండ్ 444 పరుగులు చేసింది.

డబ్లిన్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు రెండో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. అనుకూలంగా ఉన్న పరిస్థితులను సద్వినియోగం చేసుకున్న కివీస్ ఓపెనర్లు సుజీ, జెస్ వాట్కిన్ (62 పరుగులు) ఏకంగా 172 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 491 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లండ్ జట్టు 35.3 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌట్ అయిపోయింది.