కివీస్‌ జట్టుకే టీ 20 సీరీస్!

10 February, 2019 - 4:43 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హామిల్టన్‌: టీమిండియాతో జరిగిన టీ 20 సీరీస్‌ను ఆతిథ్య న్యూజిలాండ్‌ జట్టు కైవసం చేసుకుంది. దీంతో మూడు మ్యాచ్‌ల ఈ సీరీస్‌ను కివీస్ 2-1 తేడాతో గెలుచుకుంది. సెడెన్ పార్క్ వేదికగా నువ్వా నేనా అనే రీతిలో జరిగిన ఈ చివరి మ్యాచ్‌లో భారత్ తుది వరకూ పోరాడింది. న్యూజిలాండ్‌ నిర్దేశించిన 213 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో న్యూజిలాండ్‌‌లో తొలిసారిగా టీ 20 సీరీస్‌ సాధించాలనుకున్న భారత్‌ ఆశలు నెరవేరలేదు.

విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌ ఇన్నింగ్స్‌‌ను ధాటిగానే ఆరంభించింది. భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ శిఖర్‌ ధావన్‌ (5) తొలి వికెట్‌‌గా పెవిలియన్‌ చేరినప్పటికీ.. విజయ్‌ శంకర్‌ ‌(43), రిషభ్‌ పంత్‌ (28), హార్దిక్‌ పాండ్యా (21)లు బ్యాట్‌ బాగానే రాణించారు. ఇక వారికి జతగా కెప్టెన్ రోహిత్‌ శర్మ 38 పరుగులు చేయడంతో కివీస్‌కు భారత్‌ ధీటుగా బదులిచ్చింది. భారత్‌ స్కోరు 141 పరుగుల వద్ద రోహిత్‌ శర్మ నాల్గో వికెట్‌‌గా ఔటైన కాసేపటికే హార్దిక్‌, ధోని (2) కూడా నిష్ర్రమించడంతో స్కోరులో వేగం తగ్గింది. చివర్లో దినేశ్‌ కార్తీక్‌ (33 నాటౌట్‌), కృనాల్‌ పాండ్యా (26 నాటౌట్‌) చెలరేగి ఆడారు. అయినప్పటికీ భారత్‌‌ను విజయ తీరాలకు చేర్చలేకపోయారు. చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సి ఉండగా వీరిద్దరూ కేవలం 11 పరుగులు మాత్రమే రాబట్టగలిగారు. దీంతో ఆఖరి టీ 20, సీరీస్ ఆతిథ్య జట్టు ఖాతాలోకి వెళ్ళిపోయాయి.టాస్‌ గెలిచిన భారత్‌ ముందుగా ఫీల్డింగ్‌ తీసుకోవడంతో బ్యాటింగ్‌ చేసిన కివీస్‌‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు టీమ్‌ సీఫెర్ట్‌ (43) ధాటిగా ఆడి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. సీఫెర్ట్‌కు జతగా మరో ఓపెనర్‌ కొలిన్‌ మున్రో (72) చెలరేగి ఆడాడు. వీరిద్దరూ తొలి వికెట్‌‌కు 80 పరుగులు జత చేసిన తర్వాత సీఫెర్ట్‌ ఔటయ్యాడు. ఆ తర్వాత మున్రో-విలియమ్సన్‌‌ల జోడి స్కోరు బోర్డును మరింతగా చక్కదిద్దింది. ఈ క్రమంలోనే ఇరువురు 55 పరుగులు జత చేసిన తర్వాత మున్రో రెండో వికెట్‌‌గా అవుటయ్యాడు. మరో 15 పరుగుల వ్యవధిలో విలియమ్సన్‌ (27) కూడా ఔటవడంతో కివీస్‌ 150 పరుగుల వద్ద మూడో వికెట్‌ నష్టపోయింది.

గ్రాండ్‌ హోమ్‌(30), డార్లీ మిచెల్‌ (19 నాటౌట్‌), రాస్‌ టేలర్‌ (14 నాటౌట్‌) తమ వంతు బాధ్యతను సమర్ధంగా నిర్వర్తించడంతో కివీస్‌ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ రెండు వికెట్లు తీయగా, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌‌కు చెరో వికెట్‌ దొరికింది.