పెళ్ళికూతురు అవుతున్న ప్రధాని!

03 May, 2019 - 2:51 PM

    (న్యూవేవ్స్ డెస్క్)

విల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డెన్ (38) త్వరలోనే వైవాహిక బంధంలో అడుగుపెట్టబోతున్నారు. సుదీర్ఘ కాలంగా ప్రేమలో ఉన్న తన ప్రియుడు, టీవీ వ్యాఖ్యాత క్లార్క్ గేఫోర్డ్ (41) ను ఆమె పెళ్లి చేసుకుంటున్నారు. ఈ మేరకు వారిద్దరూ వివాహ నిశ్చితార్థం (ఎంగేజ్‌మెంట్) చేసుకున్నారు. శుక్రవారంనాడు జరిగిన ఓ వేడుకలో జెసిండా తన ఎడమచేయి మధ్య వేలుకు డైమండ్ ఉంగరం ధరించి కనిపించారు. దీంతో జెసిండాకు వివాహ నిశ్చితార్థం జరిగినట్లు అందరికీ అర్థమైంది. జెసిండా ఆర్డెన్ వివాహం ఆమె సహచరుడు క్లార్క్‌ గేఫోర్డ్‌‌తో త్వరలోనే జరగనుందని ప్రధాని కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. జెసిండా ఆర్డెన్- క్లార్క్ గేఫోర్డ్ వివాహం చేసుకోనుండడంలో ఆశ్చర్యం ఏమీ లేకపోవచ్చు. కానీ పెళ్ళి కాకుండానే వారిద్దరికీ ఆడపిల్ల పుట్టింది. తమ ముద్దుల పట్టికి వారు నెవ్ టె అరోహ అనే పేరు పెట్టుకున్నారు.

ఈ సందర్భంగా జెసిండా అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ఈస్టర్‌ ఆదివారం రోజున ప్రధాని, క్లార్క్‌‌ల ఎంగేజ్‌‌మెంట్‌ జరిగిందని పేర్కొన్నారు. అయితే.. వారు ఏ తేదీన పెళ్ళి చేసుకుంటారనేది మాత్రం ప్రస్తుతానికి నిర్ణయించలేదని, ఇంతకు మించిన వివరాలు తాను వెల్లడించలేనని చెప్పారు.టెలివిజన్ ప్రెజెంటర్ క్లార్క్‌ గేఫోర్డ్‌, న్యూజిలాండ్ లేబర్ పార్టీ నేత జెసిండా ఆర్డెన్‌లకు 2012లో పరిచయమైంది. న్యూజిలాండ్‌‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాతీయ భద్రతా చట్టంలో మార్పులు తీసుకువస్తుందన్న వార్తల నేపథ్యంలో.. ఆ చట్టానికి సంబంధించిన వివరాల కోసం పార్లమెంట్ సభ్యుడితో మాట్లాడేందుకు క్లార్క్ పార్లమెంట్ హౌస్‌కు వెళ్లినప్పుడు జెసిండాతో పరిచయం అయింది. లేబర్ పార్టీలో చురుగ్గా పనిచేస్తున్న జెసిండాతో గేఫోర్డ్‌కు పరిచయం ఏర్పడింది.

పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరు కలిసి సహజీవనం చేయడం మొదలుపెట్టారు. ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ జంట గత ఏడాది జూలైలో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ క్రమంలో దేశాధినేత హోదాలో ఉండి బిడ్డకు జన్మనిచ్చిన రెండో మహిళగా జెసిండా రికార్డులకెక్కారు. అంతకు ముందు బాధ్యతలు నిర్వర్తిస్తూ అప్పటి పాకిస్తాన్ ప్రధాని బెనజీర్ భుట్టో బిడ్డకు జన్మనిచ్చిన మొదటి మహిళగా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించారు.ఇక.. క్లార్క్‌ గేఫోర్డ్ కొన్నాళ్లుగా తన ఉద్యోగానికి దూరంగా ఉంటూ కూతుర్ని చూసుకుంటున్నారు. జెసిండా ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మార్చి 15న న్యూజిలాండ్‌‌లోని రెండు మసీదులపై శ్వేత జాతీయుడు కాల్పులు జరిపి 51 మందిని పొట్టన పెట్టుకున్నప్పుడు తక్షణమే స్పందించి, అక్కడి ముస్లింలకు అండగా నిలబడినందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. జెసిండాకు కృతజ్ఞతగా యూఏఈ ప్రభుత్వం ఆమె చిత్రాన్ని బుర్జ్‌ ఖలీఫాపై ప్రదర్శించి గౌరవించింది.