ఓఆరార్‌కు బయటే కొత్త పరిశ్రమలు

08 November, 2019 - 7:42 AM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధానిలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్డు లోపల మాత్రం ఇక నుంచి కుదరదు. కొత్త పరిశ్రమ ఏదైనా ఏర్పాటు చేయాలంటే.. ఓఆరార్‌కు బయట మాత్రమే అనుమతి ఇస్తామని కేసీఆర్ ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. హైదరాబాద్‌లో కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మేరకే రూ.1200 కోట్ల మేరకు పెట్టుబడులతో రకరకాల కేటగిరీలలో హైదరాబాద్ పరిధిలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వచ్చిన 281 దరఖాస్తులను సర్కార్ తిరస్కరించింది. ఔటర్ రింగ్ రోడ్డుకు ఆవతల మాత్రమే ఆయా పరిశ్రమల్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయా సంస్థలకు ప్రభుత్వం సూచించింది.

ఓఆరార్ వెలుపల పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు గల సానుకూల అంశాలపై పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించాలని అధికారులను కేసీఆర్ ప్రభుత్వం ఆదేశించింది. జాతీయ రహదారుల అనుసంధానం, విమానాశ్రయానికి దగ్గర్లో ఉండడం లాంటి అంశాలను ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రస్తావనకు తెస్తుండడం గమనార్హం. హైదరాబాద్‌ను కారుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కాలుష్య కారక పరిశ్రమలను తరలించేందుకు ప్రభుత్వం మరో పక్కన సన్నాహాలు చేస్తున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో, సమీప ప్రాంతాల్లో ఉన్న 1746 పరిశ్రమలు కాలుష్య కారకాలుగా గుర్తించిన సర్కార్ వాటిని ఓఆరార్ బయట గుర్తంచిన 19 ప్రాంతాల్లోకి తరలించేందుకు రెడీ అవుతోందని సమాచారం.