చూడు ‘పెద్దమ్మ’ పాడు మోడీ

10 August, 2018 - 5:10 PM

 

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: విభజనతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. విభజన హామీలు అమలు అయితేనేమీ.. ప్రత్యేక హోదా అయితేనేమీ ఏ ఒక్కటి ఇప్పటి వరకు అమలు కాలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి మూడడులుగు ముందుకీ నాలుగడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలు అలుపెరగకుండా పార్లమెంట్ లోపల.. వెలుపలా పోరాటం చేస్తున్నారు.

అయితే టీడీపీ ఎంపీల్లో అందరిదీ ఒక దారి అయితే… చిత్తూరు ఎంపీ ఎన్ శివప్రసాద్‌ది మరో దారి. సహజంగా నటుడైన శివప్రసాద్ విభజన జరిగిన తర్వాత తన నటనాకౌశలాన్ని పార్లమెంట్ వేదికగా ప్రదర్శిస్తూ… అటు పార్లమెంట్ సభ్యులను… ఇటు తెలుగు ప్రజలను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా… విభజన హామీలతోపాటు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ.. శివ ప్రసాద్ తాజాగా వేసిన హిజ్రా వేషం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ముగింపు రోజైన శుక్రవారం ఈ వేషంలో పార్లమెంట్‌కు వెళ్లిన శివప్రసాద్‌… అక్కడ ఉన్న వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు ఎంపీలను కలసి… ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఆ క్రమంలో నాటి యూపీఏ ప్రభుత్వ హాయాంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది. అయితే అప్పటి యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీని శివప్రసాద్ కలసి.. నాడు చట్టసభలో ఏపీకి ఇచ్చిన పలు హామీలు మోడీ హాయాంలో ఇప్పటికే అమలు కాలేదంటూ శివ ప్రసాద్.. సోనియాగాంధీ వద్ద మొరపెట్టుకున్నారు.

దీనిపై పలు రకాల కామెంట్లు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. అయితే విభజన జరిగిన తర్వాత రాష్ట్ర విభజన చేసిన పెద్దమ్మ సోనియాగాంధీనే కాదు అందుకు సహకరించిన ఈ చిన్నమ్మను కూడా గుర్తు పెట్టుకోండంటూ బీజేపీ అగ్రనేత సుష్మాస్వరాజ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో సోనియాగాంధీతో హిజ్రా వేషంలో ఉన్న శివప్రసాద్‌ ఫొటోపై ‘చూడు పెద్దమ్మ పాడు మోడీ’.. అంటూ సెటైర్లు వేస్తున్నారు నెట్‌జన్లు.