నాని ‘జెర్సీ’ మూవీ రివ్యూ

19 April, 2019 - 3:25 PM

సినిమా పేరు: జెర్సీ
జానర్: ఎమోషనల్‌ స్పోర్ట్స్‌ డ్రామా
నటీనటులు: నాని, శ్రద్దా శ్రీనాథ్‌, సత్యరాజ్‌ తదితరులు
సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌
దర్శకత్వం: గౌతమ్‌ తిన్ననూరి
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ

సినిమా సినిమాకూ తన స్టార్ రేంజ్‌‌‌ను పెంచుకొంటూ వెళ్తున్న హీరోల్లో నాని ఒకరు. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి దానికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాడనేది నిర్వివాదాంశం. ప్రేక్షకుల్లో ఈ ఫీలింగ్ రావడం వల్లే నానీని ‘నేచురల్ స్టార్’ అని పిలుస్తారు. అయితే.. ఇంతకు ముందు నాని నటించిన దేవదాస్‌, కృష్ణార్జున యుద్ధం లాంటి కమర్షియల్‌ సినిమాలు చేసి నాని భంగపడ్డాడు. ఆ చిత్రాలు ఆశించిన మేర సంతృప్తి ఇవ్వకపోవడం, నాని తన స్వభావానికి భిన్నంగా సినిమాలు చేస్తున్నాడనే విమర్శల మధ్య జెర్సీ మూవీతో రూట్ మార్చాడు. దీంతో నాని మళ్లీ తన పంథాలోకి వచ్చేశాడనే చెప్పాలి. నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుని మళ్లీ తన సత్తా చాటుకునేందుకు జెర్సీతో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

అయితే.. జెర్సీ మూవీ నాని ఆశించిన విజయం ఇచ్చిందా? సినిమా ప్రమోషన్స్‌‌లో చెప్పిన మ్యాజిక్‌‌ను ప్రేక్షకులు ఫీల్‌ అయ్యారో లేదో.. బరువైన పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ ఆకట్టుకుందా? గౌతమ్ తిన్ననూరి ద్వితీయ విఘ్నాన్ని అధిగమించాడా? చూద్దాం..
స్టోరీ:
భారత జట్టుకు ఎంపికయ్యే సత్తా ఉన్న క్రికెటర్ అర్జున్ (నాని). క్రికెటర్‌‌గా అర్జున్‌ను అభిమానించిన సారా (శ్రద్ధా శ్రీనాథ్) అతడి ప్రేమలో పడుతుంది. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు. వారికి నాని (రోనిత్ కమ్రా) కుమారుడు పుడతాడు. జీవితం ఇలా సాఫీగా సాగిపోతున్న సమయంలో తన 26 ఏళ్ల వయసులో క్రికెట్‌‌కు అర్జున్ గుడ్‌బై చెబుతాడు. అర్జున్ నిర్ణయం సారాను హర్ట్ చేస్తుంది. ఆ తర్వాత లంచ తీసుకున్నాడనే ఆరోపణతో అర్జున్ ఉద్యోగం పోతుంది. అర్జున్ ఇలా రకరకాల సమస్యల్లో కూరుకుపోయి కొడుకుకు చిన్న గిఫ్ట్ కూడా కొని ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. అయితే.. 36 ఏళ్ల వయసులో కూడా ఇండియా జట్టుకు ఆడాలని అర్జున్ కలలు కంటూ ఉంటాడు. ప్రయత్నించిన ప్రతీసారి చివరి క్షణాల్లో చేజారిపోతూ ఉంటుంది. దీంతో ఆ వయసులో క్రికెట్‌ కెరీర్‌ను అర్జున్ వదిలేస్తాడు.

అప్పటికే తనను ప్రేమించిన సారాను పెళ్లి చేసుకున్న అర్జున్‌ ఓ ప్రభుత్వ ఉద్యోగంలో చేరి సాధారణ జీవితాన్ని గడుపుతుంటాడు. కొంత కాలానికి అర్జున్‌ ఉద్యోగం కూడా పోతుంది. క్రికెట్‌‌ను వదిలేసి, ప్రభుత్వ ఉద్యోగం పోయి పనీపాటా లేకుండా ఉంటాడు. ఇంట్లో ఖాళీగా ఉంటూ కనీసం కొడుకు పుట్టిన రోజున అడిగిన బహుమతి కూడా కొనివ్వలేకపోతాడు. ఇలా అన్నింటినీ భరిస్తూ ఉన్న అర్జున్‌.. కొడుక్కి తనో హీరోలా కనబడడానికి ఆపేసిన క్రికెట్‌‌ను మళ్లీ మొదలెట్టాలనుకుంటాడు. చివరికి అర్జున్‌ ఏమయ్యాడు? తాను అనుకున్నట్లు కొడుకు దృష్టిలో హీరోగా మిగిలాడా? లేదా అనేదే జెర్సీ మూవీ స్టోరీ.
నటీనటులు:
అర్జున్‌ పాత్రలో నాని జీవించేశాడు. ప్రొఫెషనల్‌ క్రికెటర్‌‌గానూ, నార్మల్‌ ఫ్యామిలీ పర్సన్‌‌గా కూడా నటించి మెప్పించాడు. రియల్‌ లైఫ్‌‌లో నాన్నగా మారిన నాని.. రీల్‌ లైఫ్‌‌లోనూ ఆ ఫీలింగ్‌‌ను క్యారీ చేశాడు. కొడుకును అపురూపంగా చూసుకుంటూ.. తనే ప్రపంచంలా బతికే తండ్రి పాత్రలో జీవించాడు. నటుడిగా నాని ఇప్పటికే పది మెట్లు ఎక్కడానుకుంటే.. ఈ సినిమాతో నాని మరో పది మెట్లు ఎక్కాడనే ఫీలింగ్ వస్తుంది.
సారా పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్‌ మంచి మార్కులు సంపాదించుకుంది. ప్రేయసిగా, భార్యగా రెండు పాత్రల్లో శ్రద్ధా సహజంగా నటించింది. మూడు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్ర ఆమెకు లభించింది. తొలిభాగంలో గ్లామరస్‌ పాత్రలో ఒదిగిపోయింది. చాలా ఇంటెన్సివ్‌‌గా నడిచే సెకండాఫ్‌‌లో ఫర్‌‌ఫెక్ట్ ఎమోషన్స్‌‌ పలికించింది. గ్లామర్‌‌తో కూడిన రొమాంటిక్ సీన్లలో అదరగొట్టింది. పైసా సంపాదించలేని భర్త ఉన్న ఇంటిలో సంసారం బాధ్యతలను భుజాన వేసుకొనే ఓ భార్యగా సారా పాత్రలో ఒదిగిపోయింది. నటనపరంగా చిన్న చిన్న లోపాలు ఉన్నా.. అవి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదనే చెప్పొచ్చు. లుక్స్‌ పరంగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుందనే చెప్పాలి.

కోచ్‌‌గా, స్నేహితుడిగా నిత్యం అర్జున్‌ పక్కనే ఉండి నడిపించే సత్యరాజ్‌ తన పాత్రకు న్యాయం చేశాడు. నానితో కలిసి సత్యరాజ్ చేసిన సీన్లు చాలా ఎమోషనల్‌‌గా ఉంటాయి. నాని స్నేహితులుగా నటించిన వారు తమ పరిధి మేరకు పర్వాలేదనిపించారు.

గౌతమ్ దర్శకత్వ ప్రతిభ:
భావోద్వేగంతో కూడి ఓ చిన్న పాయింట్‌ చుట్టూ ఎమోషన్స్‌‌ను భారీగా అల్లుకోవడం దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ప్రతిభకు అద్ధం పట్టింది. కథను భావోద్వేగాల ఒడిదుడుకుల మధ్య నడిపించిన తీరు బాగుంది. ఎక్కడా చిన్న తడబాటు లేకుండా కథను చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. కమర్షియల్ విలువలతో కూడిన స్క్రీన్‌ప్లే, ప్రతీ ఆడియెన్‌నూ కట్టిపడేసే సన్నివేశాల్ని రాసుకోవడం.. వాటిని ప్రేక్షకుడి హృదయానికి హత్తుకునేలా చిత్రీకరించిన తీరు మెప్పు పొందుతుంది. ఓ మంచి కథను తెరకెక్కించేందుకు గౌతమ్ పడిన తపన జెర్సీలో కనిపిస్తుంది.

విశ్లేషణ:
మనిషి కష్టాలు పడుతూ.. పలు ఒడిదుడుకులు ఎదుర్కొంటూ.. చివరికి సక్సెస్‌ అవడం.. అనే కాన్సెప్ట్‌ వెండితెరకు షరా మామూలే. అయితే స్క్రీన్‌‌పై ఆ కథలనే ఎలా ఆవిష్కరించారనే దానిపై ఫలితం ఆధారపడి ఉంటుంది. జెర్సీ లాంటి కథలు మనం ఈపాటికే ఎన్నింటినో చూసి ఉంటాం. కానీ ఈ కథకు క్రికెట్‌ నేపథ్యం ఎంచుకోవడం, ఆ పాత్రలో నాని విశ్వరూపం చూపించడం, గౌతమ్‌ తిన్ననూరి తన ప్రతిభ‌తో కథను నడిపించిన తీరు ఈ సినిమాను నిలబెట్టాయి. డెబ్బై రోజుల నాని కష్టం వెండితెరపై స్పష్టంగా కనిపిస్తుంది. ప్రొఫెషనల్‌ క్రికెటర్‌‌గా నాని తనను తాను మలచుకోవడంలో సక్సెస్‌ అయ్యాడు.
గౌతమ్‌ తిన్ననూరి తనకు కలిసి వచ్చిన స్క్రీన్‌‌ప్లేతో మరోసారి మ్యాజిక్‌ చేశాడనొచ్చు. కథలో భాగంగానే అక్కడక్కడా ఫ్లాష్‌ బ్యాక్‌‌ను రివీల్‌ చేస్తూ.. సినిమాను ముందుకు నడిపించాడు. అయితే ఈ క్రమంలో ఫస్టాఫ్‌ కాస్త లెంగ్తీగా, స్లోగా నడిచినట్టు అనిపిస్తుంది. నాని తన కుమారుడితో ఉన్న సన్నివేశాలు కంట తడిపెట్టిస్తాయి. సెకండాఫ్‌‌లో వేగం పెంచినా.. పూర్తిగా క్రికెట్‌ నేపథ్యంలో సాగింది. అందువల్ల జెర్సీ అన్ని వర్గాల ప్రేక్షకులకూ రుచించకపోవచ్చు.

నాని నుంచి ఫ్యామిలీ ప్రేక్షకులు ఆశించే కామెడీ లేకపోవటం, కంటతడి పెట్టించే సన్నివేశాలు మరీ ఎక్కువగా ఉండటం లాంటివి సినిమాను కొన్ని వర్గాలకే పరమితం చేసే అవకాశం ఉంది. ప్రీ క్లైమాక్స్‌‌లో పూర్తిగా ఆట నేపథ్యంలో సాగింది. చివర్లో వచ్చే ట్విస్టే షాకింగ్‌‌గా అనిపిస్తుంది. అనిరుధ్‌ అందించిన సంగీతం సినిమాకు ప్లస్‌. నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. సినిమా మొత్తం 1986, 96 నేపథ్యంలోనే జరగ్గా.. అప్పటి వాతావరణాన్ని సినిమాటోగ్రాఫర్‌ బాగా చూపించారు. పీరియాడిక్‌ నేపథ్యంలో సాగినా ఈ సినిమాకు ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పడిన కష్టం కూడా తెరపై కనిపిస్తుంది. ఎడిటింగ్‌‌కు ఇంకాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.

సినిమాటోగ్రఫీ, రీరికార్డింగ్ ఇతర అంశాలు ఈ సినిమాను తెర మీద ఓ జీవితాన్ని ఆవిష్కరించాయి. తెలుగు తెర మీద మ్యాజిక్ చేసిన సినిమాల్లో జెర్సీ మరో మ్యాజిక్‌ అని చెప్పొచ్చు.
బలాలు:
నాని
కథా కథనం
సంగీతం
బలహీనతలు:
నిడివి
హై ఎమోషన్స్‌
స్లో నెరేషన్‌