‘నాటకం’ సినిమా రివ్యూ..!

28 September, 2018 - 4:31 PM

సినిమా పేరు: నాటకం
నటీనటులు: ఆశీష్‌ గాంధీ, అషిమా నర్వాల్‌, తోట‌ప‌ల్లి మ‌ధు తదితరులు
సంగీతం: సాయి కార్తీక్‌
సినిమాటోగ్రఫీ: గరుడవేగ అంజి
ఎడిటర్‌: మణికాంత్‌
నిర్మాత: శ్రీ సాయిదీప్‌ చాట్ల, రాధికా శ్రీనివాస్‌, ప్రవీణ్‌ గాంధీ, ఉమ కూచిపూడి
దర్శకత్వం: కళ్యాణ్‌జీ గోగన
బ్యానర్‌: రిజ్వాన్‌ ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌

తెలుగు సినీ పరిశ్రమలో అర్జున్‌రెడ్డి, RX 100 సినిమాలు విజయం సాధించడంతో రొమాంటిక్ ప్రేమకథా చిత్రాలు, సస్పెన్స్ థ్రిల్లర్లు, చిన్న సినిమాల జోరు పెరిగింది. కథ, కథనాలు బాగున్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న సమయంలో దర్శకుడు కల్యాణ్ జీ గోగన విభిన్నమైన ప్రమోషన్‌‌తో ముందుకొచ్చిన చిత్రం నాటకం. ఆశీష్ గాంధీ, అషిమా నర్వాల్ హీరో, హీరోయిన్లుగా నటించారు.స్టోరి: చింత‌ల‌పూడి గ్రామంలో ఆవారాగా తిరుగుతుంటాడు బాల‌ కోటేశ్వర‌రావు (ఆశీష్ గాంధీ). తిన‌డం, తిర‌గ‌డం, రాత్రయితే.. నాన్నతో క‌లిసి మందు కొట్టడం త‌ప్ప ఇంకేమీ చేయడు. పెళ్లి చేసుకుందామంటే పిల్ల కూడా దొర‌క‌దు. అయితే.. డిగ్రీ చదువుకునే పార్వతి (అషిమా న‌ర్వాల్‌)ని చూసి ఇష్టప‌డ‌తాడు. పార్వతికి ఎవ్వరూ ఉండ‌రు. అనాథ. పార్వతి కూడా కోటిని ప్రేమిస్తుంది. అదే సమయంలోనే ఆ ఊరిపై దండుపాళ్యం లాంటి దొంగల ముఠా దాడి చేస్తుంది. ఈ క్రమంలో పార్వతి గురించి భయంకరమైన నిజం తెలుస్తుంది. పీకల్లోతూ ప్రేమలో మునిగిన కోటికి పార్వతి గురించి తెలిసిన నిజం ఏమిటి? పార్వతి ఫ్లాష్ బ్యాక్ తెలుసుకున్న కోటి ఎలా రియాక్ట్ అయ్యాడు? చింత‌ల‌పూడిలో ఈ ముఠా సృష్టించిన విధ్వంసం ఏమిటి? దొంగల ముఠాను ఎలా ఎదుర్కొన్నాడు. పార్వతి దూరమైన కోటి మిగతా జీవితం ఎలా ఉండబోయిందనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే ‘నాటకం’ సినిమా కథ.బాల కోటేశ్వరరావు క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్‌తో నాటకం కథ మొదలవుతుంది. తండ్రీ కొడుకుల మధ్య తాగుడు వ్యవహారం శృతి మించుతుందనే క్రమంలో పార్వతిని కథలోకి లాగి మితిమీరిన శృంగారానికి తెర లేస్తుంది. తల్లి లేని కోటికి తండ్రి రెండో సెటప్‌‌ ఆసక్తికరమైన పాయింట్‌ వద్ద కథలోకి రావడంతో తల్లి, చెల్లి లాంటి క్యారెక్టర్లు బోనస్‌‌గా కనిపిస్తాయి. గ్రామంలో పాము కాటుకు గురైన మహిళ ఎపిసోడ్ కొంత ఆసక్తికరంగా ఉంటుంది. అలా సాగిపోతున్న కథలో మధ్య, మధ్యలో దొంగల ముఠాకు సంబంధించిన కేసు దర్యాప్తు కథలో దూరుతూ ఉంటుంది. చింతలపూడిలోకి దొంగల ముఠా ప్రవేశించడంతో తొలిభాగం ముగుస్తుంది.

పార్వతి, కోటి మధ్య ప్రేమ కలహాలు, పాటలతో రొటీన్‌‌గా రెండో భాగం సాగుతుంది. పార్వతి, కోటి పెళ్లి చేసుకున్న తర్వాత ఓ భయంకరమైన వాస్తవం బయటపడుతుంది. దాంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది. పార్వతి సహాయంతో చివరకు దొంగల ముఠా భరతం ఎలా పట్టాడనే కథకు ముగింపుగా మారుతుంది. ఇక చివర్లో కోర్టు సీన్ పెట్టి సినిమాను మరింత సాగదీయడం ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారుంది.ఎలా ఉందంటే: క‌థ‌ని ప్రారంభించిన విధానం బాగుంది. ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణం, దానికి త‌గ్గట్టుగానే క‌థానాయ‌కుడి వేష‌భాష‌లు ఇవ‌న్నీ ఆక‌ట్టుకుంటాయి. పార్వతిని చూసి మ‌న‌సు ప‌డ‌డం.. వాళ్లిద్దరి రొమాన్స్‌, ముద్దులు ఇవ‌న్నీ కుర్రకారుకి న‌చ్చుతాయి. ఈ ప్రేమ‌క‌థ‌ని మున్ముందు ఎలా న‌డుపుతాడా? అనే ఆస‌క్తి నెల‌కొంటుంది. కానీ… అంతవ‌ర‌కే ఆలోచించిన ద‌ర్శకుడు ఆ త‌ర‌వాత కూడా ప‌టిష్టమైన క‌థ‌ రాయలేక‌పోయాడు. దొంగ‌ల ముఠాని తొలి స‌న్నివేశాల్లో భ‌యంక‌రంగా చూపించి, పార్వతీపురంలో అంత‌కు మించిన విధ్వంసం సృష్టిస్తార‌న్న బిల్డప్ ఇచ్చి.. వాళ్ళని క్లైమాక్స్ వ‌ర‌కూ ట‌చ్ చేయ‌లేదు. ఈ ప్రేమ‌క‌థ‌ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థం కాక ఏవేవో ప్రయ‌త్నాలు చేశాడు. మ‌ధ్యలో ఈ చిత్రం హార‌ర్ కోణంలో కూడా సాగుతుంది. అయితే ఆ స‌న్నివేశాలు, అందులోంచి వ‌చ్చిన ఎమోష‌న్లు ఏవీ స‌రిగా పండ‌లేదు.
తొలి భాగంలో అంబులెన్స్ సీన్‌, అమ్మాయిల్ని కిడ్నాప్ చేసే వ్యవ‌హారం, రెండో స‌గంలో ఓ అమ్మాయిని గ‌ర్భవ‌తిని చేసి, అబార్షన్ చేయించుకోడానికి బేరం పెట్టే సంద‌ర్భంలో వ‌చ్చే స‌న్నివేశం.. ఇవ‌న్నీ క‌థ‌కు అన‌వ‌స‌రం అనిపిస్తాయి. హీరో తాలుకు యాక్షన్ త‌డాఖాని చూపించేందుకే ఆ స‌న్నివేశాల్ని దర్శకుడు వాడుకున్నాడు. మద్యపానం, శృంగారం, ర‌క్తపాతం ఇలా ఏ ర‌కంగా చూసినా మోతాదుకు మించే అనిపిస్తుంది. ప‌తాక స‌న్నివేశాల్లో క‌థానాయ‌కుడు క‌త్తి ప‌ట్టి విజృంభిస్తాడు. ఆ స‌న్నివేశంలో ర‌క్తం ఏరులైపారుతుంది. సినిమా అయిపోయింద‌నుకుంటే.. కోర్టు స‌న్నివేశంతో దాన్ని ఇంకాస్త పొడిగించాడే. అక్కడ‌క్కడా మెరిసిన కొన్ని సంభాష‌ణ‌లు, హీరో వీర‌త్వం, మోటుద‌నం త‌ప్ప ఈ ‘నాట‌కం’ ఆశించినంత ర‌క్తిగా లేకపోయింది.ఎవరెలా చేశారంటే..:
ఈ సినిమాలో న‌టీన‌టులంతా కొత్తవారే. క‌థానాయ‌కుడు చూడడానికి నిజంగానే మొర‌టోడులా ఉన్నాడు. న‌ట‌న బాగుంది. ఏ ద‌శ‌లోనూ ఇబ్బంది ప‌డ‌లేదు. క‌థానాయిక‌లో అనుమెహ‌తా (ఆర్య హీరోయిన్‌), వేద రూపు రేఖ‌లు క‌నిపిస్తాయి. అందంగా ఉంది. ముద్దు స‌న్నివేశాల్లో న‌టించ‌డానికి అస్సలు మొహ‌మాట‌ప‌డలేదు. తాగుబోతు తండ్రిగా తోట‌ప‌ల్లి మ‌ధు న‌ట‌న కూడా ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రల్లో పెద్దగా తెలిసిన వారు, గుర్తు పట్టే వారెవరూ లేరు. ఆయ పాత్రల మేరకు వారు బాగానే నటించారు.
సాయికార్తీక్ పాట‌లు ఓకే అనిపిస్తాయి. తొలి పాట ‘యాడ బుట్టినావే’ న‌చ్చుతుంది. నేప‌థ్య సంగీతంలోనూ ప్రావీణ్యం చూపించాడు. కెమెరా ప‌నిత‌నం బాగుంది. ద‌ర్శకుడు ఎంచుకున్న క‌థ‌లో అంతగా బ‌లం లేదు. కేవ‌లం స‌న్నివేశాల‌తో నెట్టుకురావాల‌నుకున్నాడంతే. బ‌ల‌మైన క‌థ లేన‌ప్పుడు అది కుద‌ర‌ని ప‌ని అని గ్రహించ‌లేక‌పోయాడు. రొటీన్‌‌గా సీన్లను పేర్చుకొంటూ వెళ్లిపోయాడే తప్ప.. ఓ భిన్నమైన సినిమాను తెరకెక్కించే ప్రయత్నం జరగలేదు. కథ, కథనాలపై దర్శకుడు పట్టు లేదని పలు సన్నివేశాల్లో కనిపిస్తుంది. బలమైన సన్నివేశాలు, నాసిరకమైన నటీనటులతో ఓ రుచికరమైన వంటకం అందించడంలో తడబాటు కనిపిస్తుంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు నచ్చే అంశాలు బాగానే ఉన్నాయి. ప్రమోషన్ పరంగా దిగువ సెంటర్ల ప్రేక్షకులకు సినిమాను చేర్చగలిగితే కలెక్షన్లు రాబట్టే అవకాశం లేకపోలేదు.

బ‌లాలు:
హీరో, హీరోయిన్ల నటన
పాట‌లు
కెమెరా ప‌నిత‌నం
ప్రొడక్షన్ వాల్యూస్
బ‌ల‌హీన‌త‌లు:
క‌థ‌, కథనాలు
కథలో అనేక ట్విస్టులు
సాగదీత
లాజిక్ లేని స‌న్నివేశాలు
గంద‌ర‌గోళం