నింగిలోకి నాసా పార్కర్ సోలార్ ప్రోబ్..!

12 August, 2018 - 5:32 PM

 (న్యూవేవ్స్ డెస్క్)

కేప్‌‌కెనెవరాల్‌: సూర్యుడికి అత్యంత సమీపానికి వెళ్లేందుకు ఉద్దేశించిన స్పేస్ షిప్ పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌‌ను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఆదివారం ప్రయోగించింది. కేప్‌ కెనెవరాల్‌ ఎయిర్‌‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి దీన్ని నింగిలోకి పంపించారు. డెల్టా 4 భారీ రాకెట్‌ ద్వారా ఈ ప్రోబ్‌ నింగిలోకి నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారు జామున 3.31 గంటలకు డెల్టా-4 రాకెట్‌ ద్వారా ఈ ప్రయోగం జరగాల్సింది. సాంకేతిక కారణాల వల్ల ఆదివారానికి శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని చివరి నిమిషంలో వాయిదా వేశారు. రాకెట్‌ నింగిలోకి బయలుదేరడానికి కొద్దిసేపటి ముందు హీలియం అలారం మోగడంతో ప్రయోగాన్ని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.

150 కోట్ల డాలర్ల విలువైన ఈ వ్యోమనౌక విషయంలో ఇంజినీర్లు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని నాసా ఉన్నతాధికారి థామస్‌ జుర్బెచన్‌ పేర్కొన్నారు. ఇది తమకు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన వ్యోమనౌక అని వివరించారు. సూర్యుడి వెలుపలి వాతావరణ వలయమైన కరోనాలోకి దూసుకెళ్లే ఈ వ్యోమనౌక.. సౌర తుపాన్లు, జ్వాలల గురించి అనేక వివరాలను వెలుగులోకి తెస్తుందని భావిస్తున్నారు. తద్వారా అంతరిక్ష వాతావరణ హెచ్చరికలను మరింత మెరుగ్గా చేయవచ్చు.

పార్కర్‌ సోలార్ నేరుగా సూర్యుడి వద్దకు వెళ్లదు. బుధుడి చుట్టూ కనీసం ఏడు చక్కర్లు కొట్టిన తర్వాత 2024 డిసెంబర్‌ 19 నాటికి తొలిసారి సూర్యుడికి అత్యంత సమీపంలోకి అంటే.. కేవలం 40 లక్షల కిలోమీటర్ల దూరానికి చేరుతుంది. దీని ద్వారా దశాబ్దాలుగా శాస్త్రవేత్తలకు కొరుకుడు పడని సమస్యలకు సమాధానాలు చెబుతుందని అంచనా. సౌర కుటుంబపు సహజ నక్షత్రం సూర్యుడు ఓ మిస్టరీల పుట్ట. ఉపరితలం కంటే చుట్టూ ఉండే వాతావరణం విపరీతమైన వేడి కలిగి ఉండటం వీటిల్లో ఒక్కటి మాత్రమే. ఇలా ఎందుకు ఉంటుందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా అని పిలిచే సూర్యుడి వాతావరణం నుంచి వెలువడే శక్తిమంతమైన కణాలు కొన్నిసార్లు మన ఉపగ్రహ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఈ కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్స్‌‌ను క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు పార్కర్‌ శోధక నౌక ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.

చిన్న సైజు కారులా ఉండే ‘పార్కర్‌’ శోధక నౌక సుమారు ఆరేళ్ల పాటు ప్రయాణించి సూర్యుడికి అత్యంత సమీపంలోకి చేరుతుంది. సూర్యుడి నుంచి వెలువడే రేడియో ధార్మిక కిరణాలను గుర్తించేందుకు ఓ ఫీల్డ్‌ యాంటెన్నా.. అక్కడి ధూళి కణాలను సేకరించేందుకు ప్రత్యేకమైన ఎస్‌‌పీసీ పరికరం ఉంటాయి. వీటితో పాటు ఇంధనం సమకూర్చేందుకు సోలార్‌ ప్యానెల్స్, సమాచారాన్ని భూమ్మీదకు పంపేందుకు రేడియో యాంటెన్నా, అయస్కాంత క్షేత్రాన్ని పరిశీలించేందుకు మ్యాగ్నెటో మీటర్‌ వంటి పరికరాలూ ఉన్నాయి.

వన్నీ ఒక ఎల్తైతే.. పార్కర్‌ ముందు భాగంలో ఉండే ఉష్ణ కవచం ఇంకో ఎత్తు. దాదాపు 8 అడుగుల వ్యాసం, నాలుగున్నర అంగుళాల మందం ఉన్న కార్బన్‌ మిశ్రమ లోహంతో ఈ ఉష్ణ కవచం తయారైంది. దాదాపు 1,371 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రతలను కూడా తట్టుకోగలగడం దీని ప్రత్యేకత. కవచానికి మరో వైపున ఉండే పరికరాలన్నీ దాదాపు గది ఉష్ణోగ్రతలోనే ఉండటం మరో విశేషం. అంటే.. కవచం గుండా వేడి ఏమాత్రం ప్రసారం కాదన్నమాట.

2017 వరకూ దీని పేరు సోలార్‌ ప్రోబ్‌ మాత్రమే. ఆ తర్వాత దీని పేరును పార్కర్‌‌గా మార్చారు. 1958లో సౌర తుపానులను మొట్టమొదట అంచనా వేసిన శాస్త్రవేత్త యుజీన్‌ పార్కర్‌ కృషికి గుర్తింపుగా ఆయన పేరు పెట్టారు. యుజీన్‌ పార్కర్‌ షికాగో యూనివర్సిటీ అధ్యాపకుడిగా పనిచేశారు. బతికి ఉండగా ఓ శాస్త్రవేత్త పేరు అంతరిక్ష నౌకకు పెట్టడం నాసా చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.