ఒకే రోజు పీఎంగా.. సీఎంగా …

26 May, 2019 - 8:34 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ/అమరావతి: భారత ప్రధానిగా నరేంద్ర మోదీ మరోసారి ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు అయింది. మే 30వ తేదీన రాత్రి 7.00 గంటలకు ప్రధానిగా మోదీ చేత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అందుకు రాష్ట్రపతి కార్యాలయం ముస్తాబు అవుతుంది.

రాష్ట్రపతి కార్యాలయం ఈ మేరకు అధికారక ప్రకటన వెలువరించింది. అలాగే రాష్ట్రపతి కూడా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అయితే మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారంతోపాటు పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆ క్రమంలో ఇప్పటికే గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిలో ముఖ్యులతోపాటు ఈ ఎన్నికల్లో గెలిచిన ముఖ్యలను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

అలాగే మే 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వైయస్ జగన్ చేత.. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

ఈ కార్యక్రమం విజయవాడలో బందర్ రోడ్డులో సమీపంలో ఉన్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదిక కానుంది. ఆ రోజు వైయస్ జగన్ ఒక్కరే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే వైయస్ జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్‌, విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారాకతిరుమలరావు ఇతర ఉన్నతాధికారులతోపాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు సమావేశమై చర్చించారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విశాఖలోని శ్రీశారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ముహుర్తుం ఖరారు చేసిన విషయం  విదితమే.