సంచలనమే.. సరుకు లేదు!

30 January, 2018 - 3:12 PM

మీడియా పల్స్

మాస్ మీడియాను తెలుగులో జనమాధ్యమాలుగా చెప్పుకోవచ్చు. ప్రజా మాధ్యమం అనే మాటను, వామపక్ష భావజాలం ఉన్నవారు ప్రగతిశీలమైన మీడియా అనే రీతిలో ఇప్పటికీ వాడుతున్నారు. రేడియో, పత్రికలు, టెలివిజన్, సినిమా, ఇంటర్నెట్, న్యూమీడియా (ట్విట్టర్, ఫేస్‌‌బుక్, వాట్సాప్) వంటి వాటిని జన మాధ్యమాలుగా పరిగణించవచ్చు. మన మీడియా పల్స్‌‌లో ప్రధానంగా పత్రికా రంగం, మరీ ముఖ్యంగా తెలుగు పత్రికా రంగం గురించి చర్చిస్తున్నాం. అప్పుడప్పుడూ బుల్లితెర, అరచేతి తెర గురించి కూడా చెప్పుకుంటున్నాం. ఈసారి సినిమా గురించి మాట్లాడుకుందాం. దీనికి కారణం రెండు సినిమాలు: ఒకటి పద్మావత్, రెండు రామ్‌‌గోపాల్ వర్మ సినిమా. ఈ రెండిటిపై టెలివిజన్‌‌లో, పత్రికలలో, న్యూమీడియాలో బాగా చర్చ జరుగుతోంది.

రాణీ పద్మినిగా తెలుగు వాళ్లకు తెలిసిన రాజపుత్రుల కోడలు వీరగాధ స్వాతంత్ర్యోద్యమ కాలంలో బాగా వ్యాప్తిలోకి వచ్చింది. ఇందులో వాస్తవం ఎంత, కల్పన ఎంత అనేది అలా ఉంచితే ఈ కథ ఆధారంగా సినిమాలు, సీరియళ్లు, నవలా రూపంలో గాధలు దేశమంతటా అందుబాటులో ఉన్నాయి. 1988లో ప్రఖ్యాత దర్శకులు శ్యామ్ బెనిగళ్ దూరదర్శన్ కోసం జవహర్‌‌లాల్ నెహ్రూ ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ ఆధారంగా రూపొందించిన ‘భారత్ ఏక్ ఖోజ్‌’లో ఈ కథపై ఒక ఎపిసోడ్ ఉంది. ఓంపురి, రాజేంద్ర గుప్తా, సీమా కేల్కర్ అందులో అల్లాఉద్దీన్ ఖిల్జీ, రతన్ సింగ్, రాణీ పద్మినిగా నటించారు. 2009లో సోనీ టివి వారు 104 ఎపిసోడ్లుగా ఈ గాధ నిర్మాణం మొదలుపెట్టి వ్యయం పెరగడం, రేటింగులు తగ్గడం వంటి కారణాల వల్ల 48 ఎపిసోడ్లతోనే ముగించారు.

2016 డిసెంబర్‌‌లో మొదలైన సంజయ్ లీలా భన్సాలీ సినిమా మొదటి నుంచీ వార్తలలో ఉంది. 2017 జనవరిలో కర్ణిసేన సభ్యులు జైపూర్‌‌లోని జైగఢ్ కోటలో షూటింగ్ జరుగుతున్న వేళ దర్శకుడి చెంప పగలగొట్టారు. కొల్హాపూర్‌‌లో మార్చిలో చిత్ర నిర్మాణం సమయంలో రాజపుత్ర సమూహాలు పెట్రోల్ బాంబులు, రాళ్లతో జరిపిన దాడి కలకలం సృష్టించింది. సినిమాలో అల్లాఉద్దీన్ ఖిల్జీ, రాణీ పద్మిని మధ్య ప్రేమ సన్నివేశాలు ఏమీ లేవని దర్శక నిర్మాత ప్రకటించినా ప్రయోజనం లేకపోయింది. ఒకవైపు నిర్మాణం, మరో వైపు ప్రతిఘటనలు, క్రమం తప్పకుండా వార్తలు, ఇలా సాగింది ఈ సినిమాకు 2017 ఏడాది. ప్రధాన మంత్రి దాకా వెళ్లడమే కాక కోర్టుకు కూడా ఎక్కారు. ఉత్తరప్రదేశ్‌‌కు చెందిన రాజపుత్ర నాయకుడు అభిషేఖ్ సోమ్ ఇంకా ముందుకు వెళ్లి సంజయ్ లీలా భన్సాలీ, కథానాయిక దీపికా పదుకొనే తలలకు అయిదు కోట్ల రూపాయల వెల కట్టాడు. చివరలో విడుదల తేదీ దగ్గర కొంత మీమాంస నడిచింది. ఆఖరికి జనవరి 25న హిందీతో పాటు తమిళ, తెలుగు భాషలలో విడుదల అయింది.

16వ శతాబ్దపు సూఫీ కవి మాలిక్ మహమ్మద్ జాయిసీ మహాశయుడు ‘పద్మావత్’ పేరున రచించిన పద్య గాధలో పద్మినిని సింహళ ప్రాంతపు యువరాణిగా చిత్రించారు. దీనిని పర్షియన్ లిపిలో అవధ్ భాషలో రాశారు. అవధ్ ప్రాంతపు జానపద గాధలలో గట్టి ముద్ర వేసిన ఈ గాధ, ఇదే రాజపుత్రుల, ఖిల్జీల అసలైన గాధ అనే గుర్తింపును జనసామాన్యంలో సంపాదించింది. మతం, నమ్మకాలు ఆధారంగా దేని మీదైనా దుమారం లేపడం సులువు. ఈ సినిమాపై వివాదానికి వస్తువు ఒక కారణం కాగా సంజయ్ భన్సాలీ సంచలనాల చరిత్ర మరో కారణం. వ్యతిరేకించే వర్గాల ఎఫ్‌ఐఆర్‌‌లో ఆయనను ‘హాబిచ్యువల్ అఫెండర్‌’గా పేర్కొన్నారు. ఇవి కాకుండా మరో సంచలన కోణం కూడా ఉంది. స్వాతంత్ర్య స్ఫూర్తికి చిహ్నం అయిన పద్మిని పాత్రను పోషించిన దీపిక, అల్లాఉద్దీన్ ఖిల్జీ పాత్రధారి రణ్‌వీర్ సింగ్ నిజ జీవితంలో ప్రేమికులు. వారు త్వరలో పెళ్లి చేసుకుంటారని కూడా వార్తలు వచ్చాయి. ఈ కారణాలతో సినిమాను నిరోధించడానికి కర్ణి సేనలు ప్రయత్నించాయి. ఇది కల్పన అని చెప్పడానికి జాయిసీ వాడిన పద్మావత్ పేరునే సినిమాకు ఖరారు చేశారు. చివరకు సుప్రీంకోర్టు అనుమతితో సినిమా విడుదల అయింది. జనవరి 25, 26, 27 తేదీలలో టెలివిజన్‌‌లో, ఇంటర్నెట్‌‌లో న్యూ మీడియాలో ఈ సినిమా వార్తలు హడావుడి చేశాయి. పత్రికలు అన్నీ ఈ సినిమా గురించి చాలా విషయాలు రాశాయి.

నిజానికి సినిమా చూస్తే ఇంత హడావుడి ఎందుకనిపిస్తుంది. విలన్ ఖిల్జీగా రణవీర్ సింగ్ విశ్వరూపం చూపి సినిమా అంతా ఆక్రమించారు. ఆయనే సినిమాకు హీరో – నెగటివ్ హీరో. ఆయన ముందు రతన్ సింగ్‌‌గా వేసిన షాహిద్ కపూర్ తేలిపోయాడు. దీపికా పదుకొనే ఇద్దరు హీరోల పారితోషికం కన్నా ఎక్కువ తీసుకుందట. వారు పది కోట్ల రూపాయల చొప్పున తీసుకోగా ఆమె 13 కోట్లు తీసుకున్నదని వార్తలు. చాలా నగలు ధరించి బరువు భరించినందుకని మనం భావించాలి. నృత్యం గురించి ప్రత్యేకంగా వార్తలు వచ్చాయి. బృంద నృత్యంలో కథానాయిక చాలాసేపు లాంగ్‌‌షాట్‌‌లోనే కనబడతారు. ‘బాహుబలి’ 1లో అనుష్క పాత్ర గురించిన హడావుడి గుర్తుకు వచ్చింది దీపిక పాత్ర విషయంలో. దీపిక కన్నా ఖిల్జీ భార్యగా నటించిన అదితిరావు హైదరీ అందంగా కనిపించారు. ఆ అమ్మాయి ఇప్పుడు ఒకటి రెండు తెలుగు సినిమాలలో నటిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా రాష్ట్రాలలో పద్మావత్‌‌ను తక్కువ కేంద్రాలలో విడుదల చేసి జాగ్రత్త పడ్డారు. ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌‌లలో రాబడి మందకొడిగా ఉందట. ముంబయి, దక్షిణ భారతం, పశ్చిమ బెంగాల్‌లలో బాగా నడుస్తున్నదట. రెండు రోజుల్లో 56 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ‘హిందూ’ పత్రిక చాలా ప్రముఖంగా రాసింది. మొత్తంగా చూస్తే దేశంలోని అన్ని వ్యవస్థలూ సినిమా ప్రచారానికి దోహదపడ్డాయని అనిపిస్తోంది.ఇటీవలి కాలంలో జిఎస్‌‌టి అనే మాట బహుళ ప్రచారంలోకి వచ్చింది. రాంగోపాల్ వర్మ దీనికి కొత్త అర్ధాలు తీస్తూ ‘ఎస్’ అంటే సెక్స్ అంటూ ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ అనే సినిమా తీసి జనవరి 26న విడుదల చేశారు. రాంగోపాల్ వర్మ దర్శకుడు కావడంతో ఇందులో సెక్స్ విషయంపై టెలివిజన్‌‌లో, న్యూమీడియాలో చర్చ రాజుకుంది. దాంతో సినిమా లాభపడవచ్చు. అందులో ఏమీ లేదని రేపు ధృవపడవచ్చు.

– డా. నాగసూరి వేణుగోపాల్
మీడియా విశ్లేషకులు