బిగ్ బాస్ షోకి ఇక ‘కింగ్’

19 March, 2019 - 5:28 PM

(న్యూవేవ్స్ డెస్క్)

బుల్లి తెరపై బిగ్ బాస్ ఎంత హిట్ అయిందో అందరికి తెలిసిందే. బిగ్ బాస్ మొదటి సీజన్ షోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా… బిగ్ బాస్ సెకండ్ సీజన్‌కి నేచరుల్ స్టార్ నానీ వ్యాఖ్యాతగా ఉన్నారు. తాజాగా ముచ్చటగా మూడో సారి బిగ్ బాస్ షో ప్రారంభంకానుంది.

అందుకు స్టార్ మా యాజమాన్యం సన్నాహాలు చేస్తుందనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనికి వ్యాఖ్యాతగా కింగ్ నాగార్జునను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌కి కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌నే ఎంపిక చేద్దామని స్టార్ మా యాజమాన్యం నిర్ణయించింది.

ఆ క్రమంలో ఎన్టీఆర్‌తో కూడా ఈ సంస్థ చర్చలు జరిపింది. మూడో సీజన్ బిగ్ బాస్‌కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తే.. భారీ మొత్తంలో పారితోషకం కూడా ఇస్తామని ఎన్టీఆర్‌కి ఈ సంస్థ ఆఫర్ చేసినట్లు సమాచారం. కానీ ఆ ఆఫర్‌ని ఎన్టీఆర్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్.. దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో బిగ్ బాస్‌ షో చేయలేనని ఎన్టీఆర్ .. స్టార్ యాజమాన్యంతో పేర్కొన్నారట. ఇక సెకండ్ సీజన్‌కి వ్యాఖ్యతగా వ్యవహరించిన నానీ అయితే .. మళ్లీ బిగ్ బాస్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించనని ఇప్పటికే స్పష్టం చేశారు. దాంతో మా టీవీ యాజమాన్యం నాగార్జునను సంప్రదించినట్లు తెలుస్తోంది.

అదీకాక కింగ్ నాగార్జున.. ఇప్పటికే స్టార్ మాలో ప్రసారమైన.. మీలో ఎవరు కోటీశ్వరుడు అనే కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో నాగార్జున బిగ్ బాస్ థార్డ్ సీజన్‌కి వ్యాఖ్యాతగా వ్యవహరించే ఛాన్స ఉందని సమాచారం.

అియతే దీనిపై నాగార్జున కానీ లేదా స్టార్ మా యాజమాన్యం కానీ  ఓ ప్రకటన చేయాల్సి ఉంది. కింగ్ నాగార్జున హీరోగా వచ్చిన మన్మధుడు ఎంత హిట్ అయిందో చూశాము. తాజాగా మన్మధుడు 2 చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో నాగార్జున సరసన పాయల్ రాజ్ పుత్, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు.