చైతు ‘సవ్యసాచి’ మూవీ రివ్యూ!

02 November, 2018 - 3:25 PM

సినిమా: సవ్యసాచి
జానర్: యాక్షన్‌ డ్రామా
నటీనటులు: నాగచైతన్య, నిధి అగర్వాల్‌, మాధవన్‌, భూమిక, వెన్నెల కిశోర్‌, సత్య, తాగుబోతు రమేష్
సంగీతం: ఎమ్‌.ఎమ్‌.కీరవాణి
దర్శకత్వం: చందూ మొండేటి
నిర్మాత: నవీన్‌ యర్నేని, వై.రవి శంకర్‌, సీవీ మోహన్‌

శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి బ్లాక్‌‌బస్టర్ విజయాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ అందిస్తున్న చిత్రం ‘సవ్యసాచి’. శైలజారెడ్డి అల్లుడు మూవీ సక్సెస్ తరువాత నాగచైతన్య అక్కినేని నటించిన చిత్రం కావడంతో అంచనాలు పెరిగాయి. ఈ మూవీ నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అక్కినేని వారసుడు నాగచైతన్య కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచీ యాక్షన్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. లవర్‌ బాయ్‌‌గా సూపర్‌ హిట్లు సాధించిన ఈ హీరోగా మాత్రం ప్రతీసారి ఫెయిల్‌ అయ్యాడు. అయినా మరోసారి అదే జానర్‌‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తనకు ప్రేమమ్‌ లాంటి బిగ్‌ హిట్ అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమా చేశాడు. మరి ఈ సినిమా అయినా చైతూకు యాక్షన్‌ హీరోగా సక్సెస్‌ ఇచ్చిందా? మైత్రీ మూవీస్‌‌కు నాలుగో బ్లాక్‌బస్టర్‌‌ను అందించిందా? చందు మొండేటి సరికొత్త పాయింట్ ప్రేక్షకులను మెప్పించిందా అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం.

స్టోరీ:
కులు వ్యాలీలో ఓ బస్సు ప్రయాణంతో సవ్యసాచి సినిమా స్టార్ట్ అవుతుంది. ఏ మాత్రం పరిచయం లేని 21 మంది ఆ బస్సులో ప్రయాణిస్తుంటారు. అయితే.. ఆ బస్సులో ఉన్న అందరికీ కామన్‌ పాయింట్‌.. వారందరికీ అరుణ్ అనే వ్యక్తి తెలుసు. అనుకోకుండా ఆ బస్సు ప్రమాదానికి గురవుతుంది. ప్రమాదంలో ఒక్క విక్రమ్‌ ఆదిత్య (నాగచైతన్య) తప్ప బస్సులో ఉన్న అందరూ చనిపోతారు.

యాడ్‌ ఫిలిం మేకర్‌ విక్రమ్‌ ఆదిత్య.. వానిషింగ్‌ ట్విన్‌ సిండ్రోమ్‌‌ (ఒకే దేహంలో ఇద్దరు)తో ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆనందం వచ్చినా కోపం వచ్చినా విక్రమ్ ఆదిత్య ఎడమ చేయి కంట్రోల్‌‌లో ఉండదు. చిత్ర అనే కాలేజ్ మేట్‌‌ను ప్రేమిస్తాడు. అయితే.. వానిషింగ్‌ ట్విన్‌ సిండ్రోమ్‌‌ కారణంగా ఆరేళ్లు ఆమెకు దూరమవుతాడు. విక్రమ్‌‌కు అక్క (భూమిక) కూతురు మహాలక్ష్మి అంటే ప్రాణం. తన అమ్మే మళ్లీ మహాలక్ష్మిగా పుట్టిందని నమ్ముతుంటాడు విక్రమ్‌. ఓ యాడ్‌ ఫిలిం పని మీద విక్రమ్‌ న్యూయార్క్‌ వెళ్లి వచ్చే సరికి ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి బావ, మహాలక్ష్మి చనిపోతారు. అక్క హాస్పిటల్‌‌లో ఉంటుంది.అన్నీ సవ్యంగా ఉన్న సమయంలో విక్రమ్‌ ఆదిత్య జీవితంలో తుపాను మొదలవుతుంది. ప్రమాదంలో అక్క కూతురు మహాలక్ష్మి కూడా చనిపోలేదని, తన దగ్గరే ఉందని ఓ అజ్ఞాత వ్యక్తి విక్రమ్‌‌కి ఫోన్‌ చేసి చెబుతాడు. అసలు పాప అతని వద్ద ఎందుకు ఉంది? విక్రమ్‌‌కి అజ్ఞాత వ్యక్తికి మధ్య వైరం ఏంటి? బస్సు ప్రమాదానికి ఈ కథకు సంబంధం ఏంటి? ఈ సమస్యల నుంచి విక్రమ్ ఆదిత్య ఎలా బయటపడ్డాడు? అనేది మిగతా కథ.

నటీనటులు:
సవ్యసాచి సినిమా ముఖ్యంగా నాగచైతన్య, మాధవన్‌‌ల చుట్టూనే తిరుగుతుంది. ఇద్దరూ తమ పాత్రల్లో అద‍్భుతంగా నటించారు. ప్రతీ సినిమాకు నటుడిగా ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తున్న చైతూ ఈ సినిమాలోనూ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎడమ చేయి తన మాట వినని పరిస్థితుల్లో ఒక వ్యక్తి పడే ఇబ్బందులను చాలా బాగా చూపించాడు. కామెడీ, రొమాన్స్‌, ఎమోషనల్‌ సీన్స్‌‌తో పాటు యాక్షన్‌ సీన్స్‌‌లోనూ ఆకట్టుకున్నాడు. గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో డ్యాన్స్‌ కూడా చైతూ చాలా బాగా చేశాడనే చెప్పాలి.

తొలిసారిగా స్ట్రయిట్ తెలుగు సినిమా చేసిన మాధవన్‌‌కు ఇది మంచి లాంచ్‌ అనే చెప్పాలి. తాను ఎలాంటి పాత్రనైనా పండించగలనని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు మాధవన్‌. సైకో విలన్‌‌గా మాధవన్‌ నటన, మాధవన్‌ పలికించిన హావ భావాలు సినిమాకు ప్లస్‌ అయ్యాయి. అయితే మాధవన్‌ పాత్రను ఇంకాస్త ఎలివేట్ చేస్తే బాగుండుననే ఫీలింగ్ కలుగుతుంది. హీరోయిన్‌‌గా పరిచయం అయిన నిధి అగర్వాల్ కేవలం లవ్‌ స్టోరీ, పాటలకే పరిమితమైంది. చైతు పక్కన ఫ్రెష్‌‌గా, గ్లామరస్‌‌గా మెరిసింది. తెలుగులో తొలి సినిమా కావడం వల్ల నటనపరంగా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేని కొన్ని లోపాలు కనిపించాయి. సవ్యసాచి సినిమాకు గ్లామర్ పరంగా ప్లస్ అనే చెప్పవచ్చు. యాక్టింగ్ పరంగా తన ప్రతిభను మెరుగు పరుచుకొంటే నిధి అగర్వాల్‌కు టాలీవుడ్‌‌లో మరిన్ని అవకాశాలు తలుపుతట్టే చాన్స్ ఉంది. భూమిక తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో తనదైన నటనతో ఆకట్టుకుంది. వెన్నెల కిశోర్‌, సుదర్శన్‌, సత్య తమ కామెడీ టైమింగ్‌‌తో ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:
వానిషింగ్‌ ట్విన్‌ సిండ్రోమ్‌ అనే డిఫరెంట్ పాయింట్‌‌ను ఎంచుకున్న దర్శకుడు చందూ మొండేటి యాక్షన్‌ ఎమోషనల్‌ అంశాలతో మంచి కథను రెడీ చేసుకున్నాడు. అయితే.. ఆ కథను తెర మీద ఆవిష్కరించటంలో కాస్త తడబడినట్టు అనిపిస్తుంది. సినిమాను ఇంట్రస్టింగ్‌ పాయింట్‌‌తో మొదలు పెట్టినా.. తరువాత ఫస్ట్‌ హాఫ్‌ అంతా హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలతో నడిపించాడు. హీరోకు ఉన్న ఎడమ చేతి ప్రాబ్లమ్‌‌కు సంబంధించిన సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో లేవు. ప్రీ ఇంట్రర్వెల్‌ వరకు అసలు కథ మొదలే అవకపోవటం నిరాశ కలిగిస్తుంది. తొలిభాగంలో బలమైన సన్నివేశాలు లేకపోవడం సినిమాకు ప్రతికూల అంశంగా మారింది.ఇంటర్వెల్‌ తరువాత కథ వేగం అందుకుంటుదనుకునే సమయంలో మరోసారి కాలేజ్‌ ఫ్లాప్‌ బ్యాక్‌ బ్రేక్‌ వేస్తుంది. ఈ సీన్‌‌లో సుభద్రా పరిణయం నాటకం, నిన్ను రోడ్డు మీద చూసినది లగాయిత్తు పాటలు ఆకట్టుకున్నా కథనం ఎమోషనల్‌‌గా సాగుతున్న సమయంలో ఈ సీన్స్‌ ఇబ్బంది పెడతాయి. మాధవన్‌ లాంటి టాలెంట్ నటుడు ఉన్నా పూర్తిగా ఉపయోగించుకోలేదనే భావన కలుగుతుంది. విలన్‌ క్యారెక్టర్‌‌ను మరింతగా ఎలివేట్ చేస్తే బాగుండేది. మాధవన్ క్యారెక్టర్‌‌ను ఇండోర్‌‌కు పరిమితం చేయడం వల్ల స్క్రీన్‌ప్లేలో పదును తగ్గిందని చెప్పొచ్చు. హీరో, విలన్ల మధ్య జరిగే మైండ్‌ గేమ్‌ ఆకట్టుకుంటుంది. ప్రీ క్లైమాక్స్‌ నుంచి సినిమా స్పీడందుకుంటుంది. నాగచైతన్య యాక్షన్‌ సీన్స్‌, మాధవన్‌ పర్ఫార్మెన్స్‌ సూపర్బ్‌. కీరవాణి సంగీతం సినిమాకు ప్లస్‌. పాటల పరవాలేదనిపించినా.. నేపథ్య సంగీతం యాక్షన్‌, ఎమోషనల్‌ సీన్స్‌‌కు మరింత హైప్‌ తీసుకువచ్చింది. ఎడిటింగ్‌పై మరికొద్దిగా దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

బలాలు:
నాగచైతన్య, మాధవన్‌ నటన
యాక్షన్‌ సీన్స్‌
వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ పాయింట్
వెన్నెల కిషోర్, సత్య కామెడీ
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
బలహీనతలు:
లవ్‌ ట్రాక్‌
రొటీన్‌ టేకింగ్
చందూ మొండేటి కథ
కథనాలు