‘గెలిస్తే ఆకాశ‌మే హ‌ద్దుగా ప‌నిచేస్తా’

15 April, 2019 - 12:29 PM

   (న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: నర్సాపురం పార్లమెంటరీ నియోజవర్గంలో తాను విజయం సాధిస్తే.. ఆకాశమే హద్దు అన్నట్లుగా అభివృద్ధి చేస్తానని జనసేన అభ్యర్థిగా పోటీ పడిన కొణిదెల నాగేంద్రబాబు (నాగబాబు) అన్నారు. ఫలితం తనకు వ్యతిరేకంగా వచ్చినా కూడా నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. తన జీవితంలో ఎవరినీ, ఎప్పుడూ ఎలాంటి మోసం చేయలేదని, అంతే నిబద్ధతతో తాను ఎన్నికల బరిలో నిలిచానని చెప్పారు. ఎన్నికలు ముగిసిన తర్వాత నాగబాబు యూట్యూబ్ చానల్లో ఓ వీడియోను విడుదల చేశారు.

ఆ వీడియోలో నాగబాబు మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా తనను ఎవరైనా విమర్శించే విధంగా ఇంతవరకూ నడుచుకోలేదన్నారు. అయితే.. ఎన్నికల సమరంలోకి దూకిన తరువాత రాజకీయంగా తనపై ప్రత్యర్థులు విమర్శలు చేశారని, వారి విమర్శలకు కౌంటర్‌గా తాను కాస్త కటువుగానే ప్రతి విమర్శలు చేశాను తప్ప ఎవరి మీదా కసి గానీ, కోపం గానీ లేదన్నారు.

నిజానికి ఎన్నికల ప్రచారం సందర్భంగా నర్సాపురం నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోని ప్రజలు తన పట్ల చూపించిన ఆదరణ, ప్రేమకు తాను ముగ్ధుడ్ని అయ్యాయనని నాగబాబు అన్నారు. వారందరికీ ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఎన్నికల సందర్భంగా తనను ఆశీర్వదించిన వారికి, విమర్శించిన వారికీ, తిట్టిన వారికి, సహాయపడిన వారందరికీ ఆయన ధన్యవాదాలు చెప్పారు.నిజానికి ఎన్నిక‌ల ప్రచారానికి ముందు నుంచీ మెగా బ్రదర్ నాగబాబు సంచలనాలకు కేరాఫ్‌గా ఉన్నారనే చెప్పాలి. సందర్భానుసారంగా ఆయన కొన్ని మీడియాల్లో చేసిన వ్యాఖ్యలు కాస్త మోతాదును మించాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం కావడం గమనార్హం. ఎన్నికల ప్రచారంలో నాగబాబు కుటుంబం (కుమారుడు వరుణ్ తేజ్, కుమార్తె నీహారిక, భార్య పద్మజ) మొత్తం ప్రచారం చేసి దుమ్ము లేపారనే చెప్పాలి.

నాగబాబు తాజాగా పోస్ట్ చేసిన యూట్యూబ్ వీడియోలో మాట్లాడుతూ.. ‘చాలా రోజుల త‌రువాత మ‌ళ్లీ మీ ముందుకు వ‌చ్చా. తాజాగా జ‌రిగిన‌ ఎన్నిక‌ల్లో న‌ర‌సాపురం ఎంపీగా పోటీ చేశాను. ఫ‌లితం కోసం ఎదురుచూస్తున్నాను. నర్సాపురం లోక్‌సభా నియోజ‌కవ‌ర్గం ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గాల ప్రజ‌లంద‌రికీ ధ‌న్యవాదాలు. ఫ‌లితం ఎలా వ‌స్తుందో తెలియ‌దు. అయితే ఇక్కడ గెల‌వ‌డం నాకు చాలా ముఖ్యం. అయితే పాజిటివ్ రిజ‌ల్టే వ‌స్తుంద‌ని భావిస్తున్నా. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్రజ‌లు నాపై చూపిన ప్రేమ‌కు నా జీవితాన్ని వాళ్ళకి అంకితం చేయాల‌నిపించింది. నేను ఎంపీగా గెలిస్తే హ‌ద్దులు లేకుండా ప‌నిచేస్తా. ఒక ఎంపీ ఏం చేయ‌గ‌ల‌డో.. ఎంత చేయ‌గ‌ల‌డో చేసి చూపిస్తా’ అని ఫేస్‌‌బుక్ లైవ్ ద్వారా నాగ‌బాబు తన మనసులోని మాట చెప్పారు.