నాగ్- ఆర్జీవీ ‘ఆఫీసర్’ మూవీ రివ్యూ

01 June, 2018 - 3:47 PM

సినిమా పేరు: ఆఫీసర్‌
జోనర్‌: యాక్షన్‌ థ్రిల్లర్‌
నటీనటులు: నాగార్జున అక్కినేని, మైరా సరీన్‌, బేబీ కావ్య, ఫెరోజ్‌ అబ్బాసీ, షాయాజీ షిండే, రాజేంద్రప్రసాద్‌, అజయ్‌ తదితరులు
సంగీతం: రవిశంకర్‌
బ్యానర్‌: ఆర్‌. కంపెనీ ప్రొడక్షన్‌
సినిమాటోగ్రఫీ: ఎన్‌. భరత్‌ వ్యాస్‌, రాహుల్‌ పెనుమత్స
కథ, స్క్రీన్‌‌ప్లే, దర్శకత్వం: రామ్‌ గోపాల్‌ వర్మ

కింగ్ నాగార్జున- విలక్షణ దర్శకుడు రాంగోపాల్‌‌‌వర్మ కాంబినేషన్‌ అంటే తప్పకుండా గుర్తొచ్చే చిత్రం ‘శివ’. ఆ సినిమా తర్వాత హీరోగా నాగార్జున ఎన్ని సినిమాలు చేసినా.. వర్మ చాలా చిత్రాలకు దర్శకత్వం వహించినా కానీ వీరి సందర్భం వస్తే ‘శివ’ గురించి తప్పనిసరిగా ప్రస్తావన వచ్చి తీరాల్సిందే. ఈ ఇద్దరి కాంబినేషన్‌‌‌లో సినిమా వస్తోందంటే అంచనాలు భారీగానే ఉంటాయి. ప్రేక్షకులు కాస్త ఎక్కువగానే ఆశిస్తారు.

సుమారు రెండున్నర దశాబ్దాల తర్వాత మళ్లీ వీళ్లిద్దరూ చేతులు కలిపారు. ఈ క్రేజీ కాంబినేషన్‌లో తాజాగా తెరకెక్కిన చిత్రమే ‘ఆఫీసర్‌’. కర్ణాటకకు చెందిన ఐపీఎస్‌ ఆఫీసర్‌ ప్రసన్న జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు వర్మ ఇంతకు ముందే చెప్పాడు. వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన ఈ కాప్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ప్రేక్షకుల్ని మెప్పించగలిగిందా? వరుస పరాజయాలతో ఉన్న వర్మకు ఊరట లభించిందా? పరిశీలిద్దాం.

స్టోరీ:
నారాయణ్‌ పసారి (ఫెరోజ్‌ అబ్బాసీ) ముంబైలో ఎన్‌‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌. వరుస ఎన్‌‌కౌంటర్లతో ముంబైలో మాఫియాను నిర్మూలిస్తుంటాడు. దీంతో ప్రజల్లో అతనికి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ వచ్చేస్తుంది. అదే సమయంలో నారాయణ ఓ బూటకపు ఎన్‌‌కౌంటర్‌ కేసులో చిక్కుకుంటాడు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు హైదరాబాద్‌‌కు చెందిన అధికారి శివాజీ రావు (నాగార్జున అక్కినేని) నేతృత్వంలో ఓ కమిటీని అధికారులు నియమిస్తారు. విచారణలో పసారికి అండర్‌ వరల్డ్‌‌తో సంబంధాలు ఉన్నట్లు తేలుతుంది. దీంతో పసారిని అరెస్ట్‌ చేసి కోర్టు బోనులో నిలబెడతాడు శివాజీ. అయితే.. తన నెట్‌‌వర్క్‌‌ను ఉపయోగించి పసారి నిర్దోషిగా బయటపడతాడు.

ఈ కేసు ఓడిపోవటం ఇష్టం లేని శివాజీ ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌‌కు బదిలీ చేయించుకుని అక్కడే ఉండిపోతాడు. తనని అరెస్ట్‌ చేయించాడన్న పగతో పసారి.. శివాజీపై పగబడతాడు. అక్కడి నుంచి వీరిద్దరి మధ్య వార్‌ స్టార్టవుతుంది. తర్వాత జరిగే పరిణామాలు, మధ్యలో ఓ ట్విస్ట్‌, చివరికి యుద్ధంలో గెలుపు ఎవరిది? అనేదే ఆఫీసర్‌ సినిమా కథ.

మాఫియా, అండర్‌‌వరల్డ్‌, పోలీస్‌ డిపార్ట్‌‌మెంట్‌‌లకు సంబంధించిన కథను బాగా డీల్‌ చేయగలగడం రాంగోపాల్‌‌వర్మకు ఉన్న ప్రధాన బలం. ఈ మూడు అంశాలు ఇందులో ఉండేలా చూసుకున్నాడు వర్మ. రొటీన్‌ సినిమాలకు భిన్నంగా ఈ కథను మొదలుపెట్టాడు. పోలీస్‌ డిపార్ట్‌‌మెంట్‌‌లో ఇన్వెస్టిగేషన్‌ ఎలా సాగుతుంది? డిపార్ట్‌‌మెంట్‌ లోపల తతంగం ఏంటి? అనే విషయాలను బాగా పరిశీలించిన వర్మ.. దానికి సంబంధించిన సన్నివేశాలను చాలా లోతుగా తెరకెక్కించగలిగాడు. కథ ప్రారంభం, గమనం, చాలా ఆసక్తిగా సాగుతాయి.నటీనటులు:

సీరియస్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో నాగార్జున మెప్పించాడు. థ్రిల్లర్‌ సినిమాకు కావాల్సిన ఇంటెన్సిటీని తన నటనలో చూపించాడు. ఈ వయసులో కూడా ఫిట్‌‌గా నాగ్ కనిపించాడు. శివాజీ పాత్రకు తన వంతు న్యాయం చేశాడు. హీరోయిన్‌ మైరా సరీన్‌‌ది చిన్న పాత్రే. నటనపరంగా ఫర్వాలేదనిపించింది. నెగటివ్‌ రోల్‌‌లో ఫెరోజ్‌ అబ్బాసీ మెప్పించాడు. అవినీతి అధికారిగా పసారీ పాత్రలో ఆకట్టుకున్నాడు. నాగార్జున కూతురిగా కనిపించిన బేబి కావ్య చాలా బాగా చేసింది. అజయ్‌ తప్ప మిగతా పాత్రలన్నీ తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియనివే.

విశ్లేషణ:
ఆర్జీవీ- నాగ్ కాంబోలో సినిమా అనౌన్స్‌ చేసినప్పుడు ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగా. అయితే టీజర్‌, ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యాక ఆ అంచనాలపై ఒకరకమైన అనుమానాలు ప్రారంభమయ్యాయి. చాలా కాలం తర్వాత వర్మ చేసిన సీరియస్‌ ప్రయత్నమే ఆఫీసర్‌. గత చిత్రాలతో పోలిస్తే బెటర్‌‌గా అనిపిస్తుంది. సాధారణంగా పోలీస్‌-మాఫియా కథనాలతో సినిమాలు తీసే వర్మ.. తన వరకు డిపార్ట్‌‌మెంట్‌‌లో అధికారుల మధ్య ఘర్షణ, విచారణ లాంటి కొత్త పాయింట్‌‌తో కథను రూపొందించుకున్నాడు. నాగార్జున-విలన్‌ పాత్రలను తీర్చి దిద్దిన తీరు, ఫస్టాఫ్‌‌లో డిఫరెంట్‌ స్టోరీ లైన్‌ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతాయి. కానీ, సెకండాఫ్‌‌లో వర్మ ఆ అంచనాలను కంటిన్యూ చేయలేకపోయాడు. నెమ్మదిగా సాగే కథనం, పాటలు ప్రేక్షకుల్లో అసహనానికి దారితీస్తాయి. పోలీసాఫీసర్‌ అయిన విలన్‌.. మాఫియాతో చేతులు కలిపి హీరోపై పగ తీర్చుకోవాలని చేసే యత్నాలు సిల్లీగా అనిపిస్తాయి. మిగతా పాత్రలను కూడా దర్శకుడు చాలా బలహీనంగా మలిచాడు. డైలాగులు కూడా మెప్పించలేకపోయాయి. సెకండ్‌ హాఫ్‌‌లో కథ మరీ నెమ్మదిగా సాగటం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. క్లైమాక్స్‌‌లో మాత్రం హీరోయిజం బాగుంది.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ రవిశంకర్‌ పాటల్లో నిరాశపరిచినా.. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌‌తో బిస్వాస్‌ ఆకట్టుకున్నాడు. చాలా సందర్భాల్లో సౌండ్‌ థ్రిల్‌ చేస్తూ ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుంది. ఈ ప్రయోగంలో వర్మను అభినందించొచ్చు. పాత్రల ఎంపిక, కెమెరా పనితనంలో ఆర్జీవీ మార్క్‌ కనిపిస్తుంది. అయితే పాత్రలు పరిచయం లేనివి కావటంతో ఒకానొక సందర్భంలో డబ్బింగ్‌ సినిమా చూస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది. నిర్మాణ విలువలు ఆకట్టుకునేలా లేవు. అనుకున్న కథను సిన్సియర్‌‌గా తెరకెక్కించిన వర్మ.. థ్రిల్లర్‌ సినిమాకు కావాల్సిన వేగాన్ని మాత్రం అందించలేకపోయాడు. లాజిక్‌‌లు మాట్లాడే వర్మ.. కొన్ని సన్నివేశాల్లో ఇంటెలిజెన్సీకి అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా ఆలోచన చేయలేకపోయాడు. గంట 55 నిమిషాల నిడివిలో సినిమాటిక్‌ అనుభూతిని అందించలేకపోవటం గమనార్హం. పూర్తిస్థాయిలో సీరియస్‌‌గా సాగే ఈ చిత్రం అన్ని వర్గాల వారిని అలరించటం అనుమానమే. మొత్తానికి నాగ్‌ ఇచ్చిన అవకాశాన్ని దర్శకుడు వర్మ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేదనే చెప్పొచ్చు.

అయితే.. సామాన్య ప్రేక్షకుడికి, రొటీన్‌ సినిమాలు చూసేవాళ్లకు ఈ తరహా కథ, కథనాలు సన్నివేశాలు కొత్తగా అనిపిస్తాయి. భరత్‌ వ్యాస్‌, రాహుల్‌ పెనుమత్స కెమెరా పనితనం బాగుంది. సినిమాను ఇంకాస్త రిచ్‌‌నెస్‌‌తో తీస్తే బాగుండేది.

బలం:
హీరో-విలన్‌ పాత్రలు
డిఫరెంట్‌ స్టోరీ లైన్‌
సినిమాటోగ్రఫీ
సౌండింగ్‌
బలహీనతలు:
క్యారెక్టర్లను బలంగా తీర్చిదిద్దలేకపోవటం
ప్రొడక్షన్‌ విలువలు
సెకండాఫ్‌‌లో నెరేషన్‌