జగన్‌పై మైసూరా ఫైర్

11 July, 2019 - 7:06 PM

(న్యూవేవ్స్ డెస్క్)

కడప: రాయలసీమ తాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించాలని ఏపీ సీఎం వైయస్ జగన్‌కి మాజీ మంత్రి ఎం.వి.మైసూరారెడ్డి విజ్ఞప్తి చేశారు. గోదావరి మిగులు జలాలు శ్రీశైలానికి తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం థార్ ఎడారిగా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు.. గోదావరి జలాలు శ్రీశైలంలోకి తీసుకొస్తే ఏపీని తెలంగాణకు తాకట్టు పెట్టినట్లే అని ఆరోపించారు.

సీఎం జగన్, పక్కా రాష్ట్ర సీఎం కేసీఆర్ చేతిలో కీలుబొమ్మగా మారారని మండిపడ్డారు. జగన్ అవగాహనారాహిత్యంతో గోదావరి జలాలపై చర్చలు జరుపుతున్నారన్నారు. గోదావరి మిగులు జాలలను వాడుకునే హక్కు దిగువ రాష్ట్రాలకే ఉంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎన్. తులసిరెడ్డి స్పష్టం చేశారు. ఏపీకి సంబంధించిన ప్రాజెక్టులపై కేసీఆర్ .. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్‌తోపాటు సుప్రీంకోర్టులో కేసులు వేశారని.. వాటిని వెనక్కి తీసుకోవాలని చెప్పాలని వైయస్ జగన్‌కి తులసిరెడ్డి సూచించారు. కేసీఆర్ ట్రాప్‌లో జగన్ పడ్డారని తులసిరెడ్డి మండి పడ్డారు.

గురువారం కడపలోని ప్రెస్ క్లబ్‌లో రాయలసీమ నీటి సమస్యపై చర్చా వేదికను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కృష్ణా గోదావరి అనుసంధానంలో రాయలసీమ నీటి సమస్య అనే అంశంపై చర్చించారు. ఈ రాయలసీమలోని నాలుగు జిల్లాల రైతు సంఘాల ప్రతినిధులు, రాజకీయ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.