శ్రీకిశోర్ డైరెక్షన్‌లో `మై ఇండియ‌న్ బాయ్‌‌ఫ్రెండ్`

08 June, 2018 - 1:03 PM

స‌శేషం, భూ, దేవిశ్రీ ప్రసాద్ లాంటి విల‌క్షణ‌మైన సినిమాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శకుడు శ్రీకిషోర్ ఇప్పుడు `మై ఇండియ‌న్ బాయ్‌‌ఫ్రెండ్‌` అనే చైనీస్ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు. చైనాలోని ఓ ఇండియ‌న్ అబ్బాయి.. చైనీస్ అమ్మాయికి మ‌ధ్య జ‌రిగే బ్యూటీఫుల్ అండ్ ఎమోష‌న‌ల్ రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌‌టైన‌ర్‌‌గా ఈ చిత్రం రూపొంద‌బోతోంది.

ఈ సినిమా గురించి దర్శకుడు శ్రీకిశోర్ మాట్లాడుతూ…`నేను 2012 నుండి హాంగ్‌కాంగ్‌‌లో ఉంటున్నాను. ఓ చైనీస్ అమ్మాయిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాను. ద‌ర్శక‌త్వం చేయ‌డంతో పాటు అక్కడి పిల్లల‌కు డాన్స్ కూడా నేర్పిస్తుంటాను. ఇప్పటి వ‌ర‌కు తెలుగులో సినిమాలు చేసిన నేను ఓ చైనీస్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది? అని ఆలోచించాను. ఎంద‌రో మ‌హామ‌హులున్న చైనా సినిమా రంగంలో.. నా సినిమాలను ఎవ‌రైనా చూస్తారా? నేను ఎలాంటి వైవిధ్యమైన చైనా మూవీని తెర‌కెక్కించ‌గ‌ల‌ను? వ‌ంటి చాలా ప్రశ్నలు నా బుర్రలో ఉండేవి. అందుక‌ని చాలా రీసెర్చ్ చేశాను. చాలా మంది వ్యక్తుల‌ను క‌లిశాను. హాంగ్‌కాంగ్‌, మెయిన్‌‌లాండ్‌, చైనా, తైవాన్ త‌దిత‌ర ప్రాంతాల్లో సినిమా మార్కెట్ ఎలా ఉంది? అనే విష‌యాల‌ను ఆరా తీశాను. ఇక్కడి ప్రేక్షకులు హ్యుమన్ వేల్యూస్‌, సెన్సిబిలిటీస్‌‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తార‌ని తెలిసింది. అందుక‌ని ఆ అంశాల మేళ‌వింపుతో ఇండియ‌న్ స్టైల్ ఆఫ్ చైనీస్ మూవీ చేయాల‌నుకున్నాను. ఇందులో మ‌న సినిమాల్లోలాగా అంద‌మైన పాట‌లు, డాన్సులు ఉంటాయి. నేను అక్కడే ఉండ‌టం వ‌ల్లే చైనీయ‌లు బాగానే అబ్జర్వ్ చేశాను. అందువ‌ల్ల కావాల్సినంత స‌మాచారాన్ని సేక‌రించగ‌లిగాను. కొన్ని నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని చైనీస్ అమ్మాయి.. ఇండియ‌న్ అబ్బాయి మ‌ధ్య ప్రేమ పుడితే ఎలా ఉంటుంది? అనే దానిపై `మై ఇండియ‌న్ బాయ్‌‌ఫ్రెండ్` అనే రొమాంటిక్ ల‌వ్‌‌స్టోరీని రాశాను. ఇది రెండు దేశాల సంస్కృతుల‌ను తెలియ‌జేసేదిగా ఉంటుంది` అన్నారు.