‘మ్యూట్ మోదీ’.. ప్రెస్‌మీట్ ఏదీ..?

10 January, 2018 - 8:16 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: అనేక విషయాల్లో తానే మొదటి వ్యక్తినని చెప్పుకునేందుకు ఆరాటపడే మన ప్రధాని నరేంద్ర మోదీ మరో విషయంలో కూడా మొదటి వ్యక్తే.. అయితే.. ఆ విషయం చెప్పుకోవడం మరచిపోయినట్టున్నారు. ప్రధాన మంత్రిగా మోదీ బాధ్యతలు స్వీకరించి మూడున్నర ఏళ్లు గడచిపోయినప్పటికీ ఇంతవరకు ఒక్క విలేకర్ల సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. అటల్‌ బిహారీ వాజపేయితో పాటు దేశానికి ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన వారంతా విలేకర్ల సమావేశాలు ఏర్పాటు చేసిన వారే. చివరికి మౌన ప్రధాని అంటూ మోదీ ఎద్దేవా చేసిన మన్మోహన్‌ సింగ్‌ కూడా ఏడాదికి రెండుసార్లు విలేకర్ల సమావేశం నిర్వహించారు.

మోదీకి మరో 16 నెలలు ప్రధాని పదవీకాలం ఉన్నప్పటికీ భవిష్యత్తులో అయినా విలేకరుల సమావేశం పెడతారనే నమ్మకం లేదు. తాను చెప్పింది వినాలే గానీ.. ఎదురు ప్రశ్నిస్తే మాత్రం నరేంద్ర మోదీకి నచ్చదని కొంత మంది మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్పారు. మోదీ మనస్తత్వాన్ని ఇప్పటికే వారు విశ్లేషించారు. అంటే విలేకరుల సమావేశంలో ఎదురు ప్రశ్నలు ఉంటాయి. అందుకే మోదీ విలేకర్ల సమావేశం నిర్వహించడం లేదని స్పష్టం అవుతోంది. అందుకే ఆయన తన పట్ల విధేయత చూపుతున్న రెండు టీవీ చానళ్లను ఎంపిక చేసుకొని ఇంటర్వ్యూలు మాత్రం ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ముందుగా తాను ఎంపిక చేసుకున్న ప్రశ్నలే ఉండడం గమనార్హం.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలతో ముఖాముఖి సంబంధాలు ఉండాలి కనుక ట్విట్టర్, నమో ఆప్, రేడియోలో ‘మన్‌ కీ బాత్‌’ ద్వారా ప్రజలతో మోదీ టచ్‌‌లో ఉంటున్నారు. కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, హోం మంత్రి రాజ్‌‌నాథ్‌ సింగ్‌ ఇదివరకు విలేకరుల సమావేశాలు తరచూ ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు వారు కూడా అందుకు జంకుతున్నారు. ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే వారు కూడా విలేకర్లను దూరంగా ఉంచుతున్నారని సమాచారం.

గతంలో పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నప్పుడు సెంట్రల్‌ హాల్లో కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు విలేకరులకు అందుబాటులో ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మోదీ నియమించుకున్న గుజరాత్‌‌కు చెందిన ఆయన సహాయకుడొకరు పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌ గేటు వద్ద కాపు కాస్తాడు. ఏ జర్నలిస్ట్‌ ఎవరి కోసం వచ్చాడో ఎంక్వైరీ చేస్తాడు. ఆ రోజు ఏ మంత్రి ఎక్కడ విలేకరులతో మాట్లాడతాడో చెబుతాడు. ఆ అధికారి అనుమతి ఉంటే తప్ప విలేకరులతో మాట్లాడేందుకు అవకాశం లేకుండా పోయిందని ఓ సీనియర్‌ మంత్రే విలేకరుల ముందు వాపోయిన సందర్భం ఉంది.

నరేంద్ర మోదీ తనకు విధేయులుగా ఉండడం కోసం కీలకమైన పదవుల్లో గుజరాత్‌‌కు చెందిన వారినే ఎక్కువ మందిని నియమించుకున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు ప్రెస్‌‌కు బ్రీఫింగ్‌ ఇవ్వడం కోసం మన్మోహన్‌ సింగ్‌ వరకు ప్రధానికి ‘ప్రెస్‌ అడ్వైజర్‌’గా ఒకరిని నియమించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ పదవిలో సీనియర్‌ జర్నలిస్ట్‌‌ను గానీ, అధికారిని గానీ నియమిస్తారు. ఈ సంప్రదాయానికి కూడా నరేంద్ర మోదీ తిలోదకాలిచ్చేశారు. మూడుసార్లు గుజరాత్ సీఎంగా పనిచేసినప్పుడు కూడా మోదీ మీడియాను దూరంగానే ఉంచేవారని, ఏ మంత్రి నుంచీ ఎలాంటి సమాచారమూ అందేది కాదని గుజరాత్‌ మీడియా మిత్రులు తెలియజేశారు.

ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన సమాచారం కోసం విడివిడిగా వివిధ మంత్రిత్వ శాఖలకు, అధికార విభాగాలకు ఆర్టీఐ కింద పిటిషన్లు దాఖలు చేసుకోవడం, అక్కడి నుంచి సమాధానం వచ్చే అవకాశం గతంలో ఉండేది. ఇప్పుడు అలాకాదు. అన్ని ఆర్టీఐ దరఖాస్తులను పీఎంఓకు పంపించాల్సిందే. ఇదివరకు (కాంగ్రెస్‌ హయాంలో) పీఎంఓ కార్యాలయం పది శాతం దరఖాస్తులను తిరస్కరిస్తే ఇప్పుడు 80 శాతం దరఖాస్తులను తిరస్కరిస్తోంది. ఎదురులేని చక్రవర్తిగా వ్యవహరించే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా తరచూ విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేస్తుంటే మోదీ ఒక్క విలేకరుల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడం ఏ మార్కు ప్రజాస్వామ్యం అనుకోవాలి? అనే ప్రశ్నలు వస్తున్నాయి. నిజానికి ఇప్పుడు ‘మౌని ప్రధాని’ ఎవరు? అనుకోవాలో మరి..!