మహారాష్ట్రను తాకిన ‘ఓఖీ’.. ముంబయిలో వర్షాలు

05 December, 2017 - 10:54 AM

 (న్యూవేవ్స్ డెస్క్)

ముంబయి: తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిన ‘ఓఖీ’ తుపాను ఇప్పుడు మహారాష్ట్రను తాకింది. దీని ప్రభావంతో ముంబయిలో మంగళవారం ఉదయం నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో ఇక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ముంబయితో పాటు సిందుర్ఘ, థానే, రాయ్‌ఘడ్, పల్గర్ జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రైల్వే స్టేషన్ల వద్ద అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.ప్రస్తుతం గంటలకు 18 మైళ్ల వేగంతో కదులుతున్న ఓఖీ బుధవారం ఉదయం గుజరాత్‌ వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అటు గుజరాత్ ప్రభుత్వం కూడా తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది. జాలర్లు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరించింది.ఓఖీ తుపాన్ ధాటికి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో సుమారు 20 మంది మృతి చెందారు. భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల వల్ల కన్యాకుమారి, దక్షిణ కేరళ, లక్షద్వీప్‌‌లో వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేల సంఖ్యలో భారీ చెట్లు నేలకొరిగాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్‌, సమాచార వ్యవస్థ నిలిచిపోయింది. వందల సంఖ్యలో జాలర్లు సముద్రంలో చిక్కుకుకపోగా.. నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, తీరప్రాంత సిబ్బంది వారిని రక్షించారు.